Share News

వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:18 AM

విశ్వవిద్యాలయాల్లో 13 ఏళ్లుగా భర్తీగానీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Telangana Government

  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి మార్గదర్శకాలు జారీ..

  • నేరుగా 500 పోస్టుల నియామకం

  • త్వరలో ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లో 13 ఏళ్లుగా భర్తీగానీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వర్సిటీల్లో వెయ్యికి పైగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఖాళీలుండగా, వాటిలో దాదాపు 500 పోస్టులు భర్తీ చేయడానికి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. మంగళవారం వాటి నియామక మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. వీటిని రాత పరీక్ష ఆధారంగా కాకుండా ప్రత్యక్ష నియామక విధానంలో భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఎంపికలో అవకతవకలకు తావు లేకుండా నియామక ప్రక్రియపారదర్శకంగా జరగాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా నియామకాలు చేపట్టడానికి ఉన్నత విద్యా మండలి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాత ఆయా యూనివర్సిటీల్లో భర్తీ చేయనున్న ఖాళీ పోస్టుల వివరాలను వెల్లడిస్తారు.


అటుపై అభ్యర్థుల నుంచి దరఖాస్తులను తెలంగాణ ఉన్నత విద్యా మండలి స్వీకరిస్తుంది. ప్రొఫెసర్ల నియామకంలో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) జారీ చేసిన మార్గదర్శకాలను పాటించనున్నది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌ మార్కుల ఆధారంగా స్కోర్‌ కేటాయిస్తుంది. డిగ్రీలో 80 శాతం , అంతకంటే ఎక్కువ మార్కులు ఉంటే 15, 60-80 శాతం మార్కులకు 13, 55-60 శాతం మార్కులకు 10, 45 శాతం కంటే తక్కువ మార్కులుంటే 5 పాయింట్లు ఇస్తుంది. దీంతోపాటు అభ్యర్థుల్లో పీహెచ్‌డీ చేసిన వారికి 30, నెట్‌లో అర్హత సాధిస్తే 5, సెట్‌ 3, రీసర్చ్‌ పబ్లికేషన్‌కు 10, బోధనానుభవనానికి ఏడాదికి 2 మార్కుల చొప్పున గరిష్ఠంగా 10 చొప్పున మార్కుల ఆధారంగా ఉన్నత విద్యా మండలి స్కోర్‌ కేటాయిస్తుంది.


దరఖాస్తు చేసుకున్న వారిలో 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి.. ఆయా జాబితాలను సంబంధిత విశ్వ విద్యాలయాలకు పంపుతుంది. ఆయా వర్సిటీల వీసీల నేతృత్వంలోని కమిటీ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, ఎంపిక చేస్తుంది. సీఎం ఆదేశాల మేరకు నియామక ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా చేపడతామని, ఎంపికైన అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో ఉంచుతామని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు అచార్య బాలకిస్టారెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్‌ను ఈసీ గెలిపించాలా?

పదికి మించి ఫారం-7 దరఖాస్తులు కుదరదు

జనవరిలో విజయవాడ హైవే విస్తరణ

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 05:18 AM