జనవరిలో విజయవాడ హైవే విస్తరణ
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:00 AM
రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు..
ఎల్బీనగర్-హయత్నగర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్పై కొత్త డీపీఆర్కు ఆదేశాలు
రాష్ట్రానికి 5 రోప్ వేలు, 3 ఆర్వోబీలకు ఆమోదం
కృష్ణా నదిపై సోమశిల వద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి..
నిర్మాణ శంకుస్థాపనకు కేంద్ర మంత్రి అంగీకారం
రాష్ట్ర అభివృద్ధిలో కీలక ముందడుగు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న పలు కీలక రహదారులు, వంతెనలు, ఎలివేటెడ్ కారిడార్లు, రోప్వేలు సహా పనులను వేగవంతం చేయడంతో పాటు కొన్ని పనుల ప్రారంభించడం పట్ల గడ్కరీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి నితిన్ గడ్కరీతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్-విజయవాడ (ఎన్హెచ్-65) రహదారి విస్తరణ పనులను జనవరిలో ప్రారంభిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదన పట్ల కూడా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఎల్బీనగర్-హయత్నగర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలిపారన్నారు. మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు ప్రతిపాదించిన శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి కొత్త డీపీఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారని వెల్లడించారు. పర్వతమాల పథకం కింద రాష్ట్రానికి 5 రోప్ వేలు, 3 ఆర్వోబీలను మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపారన్నారు. కృష్ణా నదిపై సోమశిల దగ్గర ప్రతిపాదించిన ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపనకు కేంద్ర మంత్రి అంగీకారం తెలిపారని వెల్లడించారు.
ఈ వంతెన పూర్తయితే తిరుపతి వెళ్లేందుకు సుమారు 80కి.మీ దూరం తగ్గడంతో పాటు ప్రయాణ సమయమూ తగ్గుతుందని వివరించారు. సేతు బంధన్ పథకం కింద తెలంగాణలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల నిర్మాణానికి కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. వీటితో పాటు రాష్ట్రంలోని 34 రాష్ట్ర రహదారులను.. జాతీయ రహదారులుగా అభివృద్థి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కేంద్రమంత్రి ఆదేశించారని తెలిపారు. పుల్లూరు- అలంపూర్- జట్రపోలు- పెంటవెల్లి- కొల్లాపూర్- లింగాల -అచ్చంపేట- డిండి- దేవరకొండ- మల్లేపల్లి- నల్లగొండ రాష్ట్ర రోడ్లను జాతీయ రోడ్లుగా అప్గ్రేడ్ చేయాలని కోరగా.. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధిలో కీలక ముందడుగుగా నిలుస్తాయని అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాగా నవంబరు 19 నుంచి 22 వరకు హైదరాబాద్లో నిర్వహించే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) సదస్సుకు హాజరుకావాలని మంత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీని ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, పలువురు అధికారులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎమ్మెల్సీ బరిలో మళ్లీ రాంచందర్రావు?
ఆ ఐఏఎస్ అక్రమాలపై సీఎంవో నిఘా!
Read Latest AP News And Telangana News And International