ఎమ్మెల్సీ బరిలో మళ్లీ రాంచందర్‌రావు?
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:56 AM
రాష్ట్ర బీజేపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు అంశం చివరి దశకు చేరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరిగింది. టికెట్ కోసం సీనియర్ నాయకులు గట్టి లాబీయింగ్ చేసుకుంటున్నారు.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్
నియోజకవర్గం నుంచే పోటీకి అవకాశం
ఒక వేళ ఆయనకు ఇవ్వకపోతే తమ పేర్లు
పరిశీలించాలంటున్న సీనియర్ నాయకులు
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బీజేపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు అంశం చివరి దశకు చేరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరిగింది. టికెట్ కోసం సీనియర్ నాయకులు గట్టి లాబీయింగ్ చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి 12 మంది, నల్లగొడ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ టికెట్ కోసం ఆరుగురు నాయకులు పోటీ పడుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించే అవకాశాలున్నట్లు ఒకవైపు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయనకు కాకపోతే తమకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు సీనియర్ నాయకులు జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు డోకూరి పవన్‌కుమార్ మధ్య పోటీ ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రాంచందర్‌రావుకు బదులుగా మరొకరికి అవకాశం ఇవ్వాలనుకుంటే మహబూబ్‌నగర్‌కు చెందిన సీనియర్ నేత పవన్‌కుమార్‌కు టికెట్ ఇవ్వాలని డీకే అరుణ పట్టుబడుతున్నట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, వీరేందర్గౌడ్తోపాటు సీనియర్ నాయకులు ఎన్.శ్రీవర్ధన్‌రెడ్డి, ఎస్.మల్లారెడ్డి, సారంగుల అమర్నాథ్, ప్రకాశ్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరోవైపు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టికెట్‌ను బీసీ నేతకు కేటాయించే అవకాశం ఉందనే చర్చ నడుస్తుండగా.. పీఆర్టీయూ నేత భిక్షంగౌడ్‌తో పాటు సీనియర్ నాయకులు అశోక్, పుల్లారావు యాదవ్, డాక్టర్ వెంకటేశ్వర్రావు, టి.రవికుమార్ పోటీ పడుతున్నారు.
కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై ఏర్పాటైన రెండు కమిటీలు మంగళవారం అభిప్రాయ సేకరణ చేపట్టాయి. ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్చార్జిలతో పాటు సీనియర్ నాయకుల అభిప్రాయాలను సేకరించాయి. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు సభ్యుల కమిటీ హైదరాబాద్‌లో ఈ ప్రక్రియ నిర్వహించగా, రాంచందర్‌రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే తమకు అభ్యంతరం లేదని పలువురు సీనియర్లు చెప్పినట్లు తెలిసింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌కు సంబంధించి ఏర్పాటైన కమిటీ ఆయా జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు తీసుకుంది. ఆయా కమిటీలు బుధవారం రాష్ట్ర నాయకత్వానికి నివేదికలు అందించనున్నాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ నివేదికలకు అనుగుణంగా ఒక్కో స్థానానికి ముగ్గురేసి అభ్యర్థులతో కూడిన జాబితాను జాతీయ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ నివేదించనుంది. అనంతరం, అభ్యర్థులపై కేంద్ర నాయకత్వం ప్రకటన చేయనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఆ ఐఏఎస్ అక్రమాలపై సీఎంవో నిఘా!
Read Latest AP News And Telangana News And International