ఆ ఐఏఎస్ అక్రమాలపై సీఎంవో నిఘా!
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:44 AM
రాష్ట్రంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సాగిస్తున్న అక్రమాలు, అవినీతి దందాల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు అధికారిక సర్కిళ్లలో తీవ్ర హాట్‌టాపిక్‌గా మారింది.
రంగంలోకి విజిలెన్స్, ఇంటెలిజెన్స్
రెండు చేతులా సంపాదన నుంచి నిరుద్యోగ నిధుల భక్షణలోనూ ఆ అధికారిపై బిగుస్తున్న ఉచ్చు!
సివిల్ సర్వీసెస్ వర్గాల్లో తీవ్ర చర్చ
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సాగిస్తున్న అక్రమాలు, అవినీతి దందాల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు అధికారిక సర్కిళ్లలో తీవ్ర హాట్‌టాపిక్‌గా మారింది. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు నిత్యావసరాల సరఫరాల్లో కమీషన్లు, గుడ్‌విల్ పేరిట వసూళ్లు, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు అందించే నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిధుల కుంభకోణానికి సంబంధించి ఆ ఐఏఎస్ అధికారి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఐఏఎస్ అధికారి అవినీతి, అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేగడంతో ఇప్పటికే విజిలెన్స్, ఇంటెలిజెన్స్ వంటి నిఘా వర్గాలు రంగంలోకి దిగి గుట్టుచప్పుడు కాకుండా ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రస్తుతం ఆ ఐఏఎస్ నిర్వర్తిస్తున్న పదవిలో జరిగిన అవకతవకలపైనే కాకుండా.. ఆయన గతంలో ఏయే హోదాల్లో విధులు నిర్వర్తించారు..? అప్పట్లో అవకతవకలు, ఆరోపణలపైన నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఇపుడు వాటన్నింటిని బయటకు లాగనున్నట్లు సాక్షాత్తు నిఘా వర్గానికి చెందిన ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి ఉద్దేశ్యాలు, జరిగిన అవకతవకలు, బినామీల దందా, అమీర్‌పేట్‌లోని తన పుత్రరత్నం కార్యాలయ వివరాల సేకరణపై నిఘా వర్గాలు ఇప్పటికే విచారణ మొదలు పెట్టినట్లు తెలిసింది. మరోవైపు ఆ ఐఏఎస్ వ్యవహారంపైన ప్రభుత్వం కూడా సీరియ్‌సగానే ఉన్నట్లు సమాచారం. స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఈ పరిణామాలపై దృష్టి సారించింది.
టెండర్ల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలు, ఆయనకు దళారులుగా వ్యవహరించిన వారిపైన సమగ్రంగా విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది. ఇక తన అక్రమాల గుట్టు బయటపడుతుండటంతో.. సదరు ఐఏఎస్ అధికారి తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించే క్రమంలో భాగంగా.. ‘నేను అత్యంత సంపన్న కుటుంబం నుంచి వచ్చాను. నాకు ఎప్పటి నుంచో వందల కోట్ల ఆస్తులున్నాయి. ఇలా చిల్లరగా వ్యవహరించి కక్కుర్తిపడే వాడిని కాదు’ అంటూ ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు.. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు గతంలో సరఫరా చేసిన కొందరు కాంట్రాక్టర్లు మంగళవారం బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును కలిశారు. కేంద్రీకృత టెండర్ల పేరుతో సబ్ కాంట్రాక్టు ఇచ్చేసి.. మళ్లీ సబ్‌లకే సబ్ ఇచ్చేసి డీసెంట్రలైజ్డ్‌గా మార్చారని ఫిర్యాదు చేశారు. కాగా, ఈ అంశంపై ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 24న అక్రమాలకు అడ్డాగా మారిన అమీర్‌పేట్‌లోని ఆ అధికారి పుత్రరత్నం కార్యాలయం ముందు చావు డప్పు దండోరా మోగిస్తామని మాదిగ, మాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత దేవని సతీశ్ మాదిగ ప్రకటనలో హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆర్టీసీకి దసరా కళ.. ప్రయాణికుల రద్దీ ప్రారంభం
Read Latest AP News And Telangana News And International