అల్పాహారంపై పిల్లలు హ్యాపీ!
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:28 AM
ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం సత్ఫలితాలను ఇస్తోంది. పాఠశాలల్లోనే ఉదయం టిఫిన్ అందుబాటులోకి రావడంతో విద్యార్థులు సంతోషంగా ఉన్నారని, హాజరు శాతం పెరగడమే కాకుండా వారి ఆరోగ్యమూ బాగుంటోందని తేలింది.
రుచి చాలా బాగుందన్న 91 శాతం విద్యార్థులు
రుచి, పరిమాణం బాగుందన్న 76 శాతం టీచర్లు
పాఠశాలల్లో 20-22శాతం హాజరు పెరిగింది
ఆకలి ఫిర్యాదులు 98శాతం తగ్గిపోయాయి
ఆరోగ్య సమస్యలు కూడా 89 శాతం తగ్గాయి
60 పాఠశాలల్లోనే కొత్తగా 1525 అడ్మిషన్లు
అల్పాహార పథకంపై ‘థర్డ్ విజన్ రిసెర్చ్’ నివేదిక
హైదరాబాద్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం సత్ఫలితాలను ఇస్తోంది. పాఠశాలల్లోనే ఉదయం టిఫిన్ అందుబాటులోకి రావడంతో విద్యార్థులు సంతోషంగా ఉన్నారని, హాజరు శాతం పెరగడమే కాకుండా వారి ఆరోగ్యమూ బాగుంటోందని తేలింది. గతంతో పోల్చితే పిల్లల ఆకలి ఫిర్యాదులు బాగా తగ్గాయి. రాష్ట్రంలోని కోస్గీ, బొంరాసిపేట, దోమ, దౌల్తాబాద్, దుద్యాల, కొడంగల్, కుల్కచర్ల, పరిగి, తాండూరు, యాలాల్ మండలాల్లోని బడుల్లో అల్పాహార పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ ఆలోచన మేరకు కొడంగల్‌లోని సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా హరే కృష్ణ మూమెంట్ (హెచ్‌కేఎం) చారిటబుల్ ఫౌండేషన్ అమలు చేస్తున్న అల్పాహారం పథకంపై థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ సర్వే నిర్వహించి.. ఓ నివేదికను రూపొందించింది.
ఈ సర్వేలో 1,153 మంది విద్యార్థులు, 575 మంది తల్లిదండ్రులు, 176 మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. సర్వే నివేదిక ప్రకారం అల్పాహార పథకం ప్రారంభించిన తర్వాత 60 పాఠశాలల్లో 1,525 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. 99.9శాతం మంది విద్యార్థులు పాఠశాలల్లో అందించే అల్పాహారం తింటున్నారు. 99.7శాతం మంది తల్లిదండ్రులకు పాఠశాలలో అల్పాహారం, పాలు అందిస్తున్న విషయం తెలుసని నివేదిక పేర్కొంది. పథకం అమలుపై ఉపాధ్యాయుల్లోనూ సానుకూల అభిప్రాయం వ్యక్తమైందని, 98.9శాతం మంది నిర్వహణ సజావుగా సాగుతోందని, 97.7శాతం మంది సమయానికి అల్పాహారం అందుతోందని చెప్పినట్లు వెల్లడించింది.
గత విద్యా సంవత్సరంతో పోలిస్తే విద్యార్థుల హాజరు సగటున 20-22 శాతం పెరిగిందని, ఆకలి ఫిర్యాదులు 98.3శాతం తగ్గాయని నివేదిక పేర్కొంది. అల్పాహారం నాణ్యత బాగుందని 92.7 శాతం, రుచి బాగుందని 91.3 శాతం, పరిమాణం సరిపోనూ ఉందని 84.6 శాతం మంది విద్యార్థులు చెప్పినట్లు వెల్లడించింది. ఉపాధ్యాయుల అభిప్రాయాల ప్రకారం రుచి, పరిమాణం అంశాల్లో మెరుగుదల అవసరమని తేలింది. 76.5శాతం మంది ఉపాధ్యాయులు రుచికి, 76.7 శాతం మంది పరిమాణానికి మాత్రమే మంచి రేటింగ్ ఇచ్చారు. నాణ్యత మెరుగుపరచాలని 43.6శాతం మంది, ఇతర సదుపాయాలను మెరుగుపరచాలని 33.1శాతం మంది సూచించారు.
ప్రధానంగా బోండా-చట్నీ, దోశ-చట్నీ టిఫిన్స్‌ను 95శాతంపైగా విద్యార్థులు తింటున్నారని, మిల్లెట్‌తో తయారు చేసిన ఇడ్లీ- సాంబార్‌ను 93.6శాతం మంది ఆసక్తిగా తింటున్నారని తెలిపింది. పాలు 92 శాతం, ఇడ్లీ-సాంబార్ 89.7 శాతం, పూరీ-ఆలూ కుర్మా 88 శాతం మంది విద్యార్థుల ఆదరణ పొందాయి. ఉప్మా-చట్నీకి 75 శాతం మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు. కొత్తగా వడను మెనూలో చేర్చా లని 29.2 శాతం మంది విద్యార్థులు కోరినట్లు నివేదిక పేర్కొంది. మెనూలో వడను సైతం చేర్చాలని 29.2 శాతం మంది విద్యార్థులు కోరినట్లు వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ చార్జీల పునఃపరిశీలన
రైతు డిస్కంకు ఆస్తులు, ఉద్యోగుల బదిలీ
ఆర్టీసీకి దసరా కళ.. ప్రయాణికుల రద్దీ ప్రారంభం
Read Latest AP News And Telangana News And International