మూసీ పునరుజ్జీవానికి ముందడుగు
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:32 AM
మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టుకు ముందడుగు పడింది. ప్రాజెక్టు మొదటి దశ పనులకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి క్లియరెన్స్ వచ్చింది. దీంతో.. మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో..
టెండర్లు ఆహ్వానించిన ఎంఆర్‌డీసీఎల్
2 ప్యాకేజీల్లో పనులు చేపట్టేలా చర్యలు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టుకు ముందడుగు పడింది. ప్రాజెక్టు మొదటి దశ పనులకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి క్లియరెన్స్ వచ్చింది. దీంతో.. మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో.. మొదటి దశలో 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు రెండు ప్యాకేజీల్లో చేపట్టేందుకు టెండర్లను పిలిచారు. గురువారం నుంచి టెండర్ డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. టెండర్ దాఖలుకు తుదిగడువు నవంబరు 26. నవంబరు నెలాఖరుకల్లా.. అర్హత కలిగిన సంస్థలను ఎంపిక చేసే అవకాశాలున్నాయి.
కాగా.. రెండు ప్యాకేజీల్లో భాగంగా మూసీనది ప్రక్షాళన, బఫర్ జోన్ సుందరీకరణ పనులను చేపట్టడంతోపాటు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు గల ఈసా నదిపై 9.8కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్ -1ఏ కింద.. అలాగే గండిపేట నుంచి బాపుఘాట్ వరకు గల 11.2 కిలోమీటర్ల మూసీనది ప్రాంతాన్ని జోన్ 1బీ కింద అభివృద్ధి చేయనున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును వీ ఆకారంలో చేపట్టనున్నారు. మొదటి దశ పనులకు రూ.7,345 కోట్ల దాకా (ప్యాకేజీ-1 పనులకు రూ.3,232.01 కోట్లు, ప్యాకేజీ-2 పనులకు రూ.4,113.11 కోట్లు) ఖర్చవుతుందని అంచనా.
జోన్ -1ఏ పనుల్లో భాగంగా.. నదిని శుభ్రం చేయడం, వరద నివారణ పనులు, రిటైనింగ్ గోడలు, రీవర్ ఎంబ్యాంక్‌మెంట్ల నిర్మాణం, రోడ్లు, బ్రిడ్జిలు, యుటిలిటీ కారిడార్, వర్షపునీటి డ్రైనేజీ, సీడీ పనులు, ట్రంక్ సీవర్ మెయిన్ లైన్లు, రబ్బర్ డ్యామ్స్ పనులు చేపట్టడంతో పాటు ఐదేళ్ల పాటు ఆపరేషనల్ మెయింటెనెన్స్ నిమిత్తం టెండర్లను ఆహ్వానించారు. జోన్ 1బీలో.. ప్యాకేజీ-1 మాదిరిగా పనులు చేపట్టడంతో పాటు ఐదేళ్లపాటు ఆపరేషనల్ మెయింటనెన్స్ బాధ్యతలు నిర్వహించాలి. అదనంగా ఔటర్‌పై ఐకానిక్ కేబుల్ స్టేడ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
రైతు డిస్కంకు ఆస్తులు, ఉద్యోగుల బదిలీ
ఆర్టీసీకి దసరా కళ.. ప్రయాణికుల రద్దీ ప్రారంభం
Read Latest AP News And Telangana News And International