Share News

ఫలానా కారులో ఉన్నా.. రండి!

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:50 AM

లంచాల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ బైరి సుదర్శన్‌ రెడ్డిది ఓ ప్రత్యేక పంథా! ఎవరికీ అనుమానం రాకుం డా ఉండేందుకు తన కారులోనే కూర్చుని వసూళ్లు చేయడం అతని పద్ధతి.

ఫలానా కారులో ఉన్నా.. రండి!
Sudarshan Reddy , Srinivasulu

  • ఆఫీస్‌ బయట కార్లోనే లావాదేవీలు

  • లంచాల వసూలులో అబ్దుల్లాపూర్‌మెట్‌

  • తహసీల్దార్‌ సుదర్శన్‌ రెడ్డి కొత్త పద్ధతి

హయత్‌నగర్‌/అబ్దుల్లాపూర్‌మెట్‌/చంపాపేట, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): లంచాల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ బైరి సుదర్శన్‌ రెడ్డిది ఓ ప్రత్యేక పంథా! ఎవరికీ అనుమానం రాకుం డా ఉండేందుకు తన కారులోనే కూర్చుని వసూళ్లు చేయడం అతని పద్ధతి. ఆఫీసు బయట పార్కింగ్‌ స్థలంలో వివిధ పనుల మీద వచ్చేవారి కార్లు 50కి తక్కువ కాకుండా ఉంటుంటాయి. వాటి మధ్యలో తన కారును పార్క్‌ చేస్తాడు. ఎవరికి తనతో పని ఉందో వాళ్లకి మాత్రమే ఫలానా కారులో ఉన్నానని, ఒక్కరే రమ్మని పిలిపించుకుని పని చక్కపెడతాడని పలువురు బాధితులు తెలిపారు. పసుమాములలోని సర్వే నంబర్‌ 137లో వెంచర్‌ లేఅవుట్‌ సర్వే చేయడానికి రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ సుదర్శన్‌ రెడ్డి, సర్వేయర్‌ శ్రీనివాసులు సోమవారం ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే.


రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి రూ.30 లక్షలు లంచం డిమాండ్‌ చేసి.. రూ.20 లక్షలకు ఒప్పుకున్నారు. వ్యాపారులు పెద్దఅంబర్‌పేట్‌ లక్ష్మారెడ్డిపాలెం వద్ద సర్వేయర్‌కు లంచం సొమ్ము ఇవ్వగా.. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న ఏసీబీ అధికారులు అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకే డబ్బులు తీసుకున్నట్లు సర్వేయర్‌ చెప్పాడు. దాంతో హస్తినాపురంలోని సుదర్శన్‌రెడ్డి ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. కార్యాలయంలో అర్ధరాత్రి 12 గంటల వరకు, అతని ఇంట్లో మంగళవారం ఉదయం వరకు సోదాలు నిర్వహించారు.


ఈ క్రమంలో సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాసులు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారని సమాచారం. పూర్తి వివరాలను రెండు మూడు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు.. మంగళవారం విజిలెన్స్‌, మైనింగ్‌, ఇరిగేషన్‌ శాఖల అధికారు లు పసుమాములలోని సర్వే నంబర్‌ 137లోని 10 ఎకరాల భూమిని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కేవలం జాయింట్‌ సర్వే రిపోర్టు కోసం ఇంత పెద్ద మొత్తంలో లంచం డిమాండ్‌ చేసేందుకు రికార్డుల్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేపట్టినట్లు తెలిసింది.


కాసులు కురిపిస్తున్న జాయింట్‌ సర్వే రిపోర్టు

సుదర్శన్‌రెడ్డి ఉమ్మడి హయత్‌నగర్‌ మండలంలో వీఆర్‌ఓగా, తర్వాత ఆర్‌ఐగా పనిచేసి పదోన్నతిపై అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌గా వచ్చాడు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల లొసుగులు తెలిసిన అతని అవినీతికి అడ్డులేకుండా పోయిందన్న ఆరోపణ లు ఉన్నాయి. ముఖ్యంగా మండలంలో లేఅవుట్‌ చేసేందుకు హెచ్‌ఎండీఏ అడిగే జాయింట్‌ సర్వే రిపోర్టులు కాసులు కురిపిస్తున్నాయి. ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖలు ఈ రిపోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది.


పసుమాములలో వెంచర్‌కు ఇరిగేషన్‌ శాఖ రిపోర్టు ఇవ్వగా.. సుదర్శన్‌ రెడ్డి రూ.30 లక్షలు డిమాండ్‌ చేశాడు. ఇదే తరహాలో వ్యాపారుల దరఖాస్తులను తిరస్కరించి బేరాలు మొదలుపెట్టడం, అదేమంటే అందులో ప్రభుత్వ భూమి ఉందని హెచ్చరించడం రివాజుగా మారింది. ఈ వ్యవహారంలో ఎకరాకు రూ.10 నుంచి 15 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వివాదాస్పద సర్వే నంబర్లు ఉండగా.. ఈ విషయంలో సుదర్శన్‌ రెడ్డి జోక్యం చేసుకుని వాటిని 22ఏలో పెట్టించాడు. ఆ తరువాత వాటిని తొలగించడానికి లక్షల్లో డబ్బు డిమాండ్‌ చేస్తున్నాడని తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

అల్పాహారంపై పిల్లలు హ్యాపీ!

మూసీ పునరుజ్జీవానికి ముందడుగు

ఆ ఐఏఎస్‌ అక్రమాలపై సీఎంవో నిఘా!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 04:50 AM