Share News

కాంగ్రెస్‌ను ఈసీ గెలిపించాలా?

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:06 AM

కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజల మద్దతు పొందలేక, ఎన్నికల్లో గెలవలేక.. ఎన్నికల కమిషన్‌పై నిందలు వేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీకి ప్రజలు ఓటేయకపోతే ఎన్నికల కమిషన్‌, సుప్రీంకోర్టు బాధ్యత వహించాలా? ఎన్నికల కమిషనర్‌ కాంగ్రెస్‌ను గెలిపించాలా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ను ఈసీ గెలిపించాలా?
Kishan Reddy

  • ప్రజలు ఓట్లేయకపోతే సీఈసీని, సీజేఐని బాధ్యులను చేస్తారా?

  • ఢిల్లీలో కాంగ్రెస్‌ డ్రామాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు

  • దేశ ప్రతిష్ఠను మంటగలిపేందుకు ఇండియా కూటమి ప్రయత్నం

  • రాహుల్‌గాంధీ తన స్థాయిని మరిచి దిగజారి వ్యవహరిస్తున్నారు

  • రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడంలేదు

  • కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే శివుడు, రాముడి ప్రస్తావన లేదు

  • ఇక వారు శివతాండవం ఎలా చేస్తారు?: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజల మద్దతు పొందలేక, ఎన్నికల్లో గెలవలేక.. ఎన్నికల కమిషన్‌పై నిందలు వేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీకి ప్రజలు ఓటేయకపోతే ఎన్నికల కమిషన్‌, సుప్రీంకోర్టు బాధ్యత వహించాలా? ఎన్నికల కమిషనర్‌ కాంగ్రెస్‌ను గెలిపించాలా? అని ప్రశ్నించారు. గత వారం రోజులుగా కాంగ్రెస్‌, ఆ పార్టీ మిత్రపక్షాలు ఢిల్లీలో నిరసనల పేరిట చేస్తున్న డ్రామాలను దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను దేశంలో అరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు.


దేశ చరిత్రలో ఇంతవరకు రాజకీయ పార్టీలేవీ వేలాది మందితో సుప్రీంకోర్టుకు ఊరేగింపుగా వెళ్లి ప్రధాన న్యాయమూర్తిపై, న్యాయమూర్తులపై ఒత్తిడి తేవడం, బెదిరించే ప్రయత్నం చేయడం జరగలేదన్నారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమకు అనుకూలంగా తీర్పులు రానందున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా గద్దె దిగాలని కాంగ్రెస్‌ అంటోందని మండిపడ్డారు. దేశం ఏమైనా సోనియా ఫ్యామిలీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రాపర్టీయా? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ తన స్థాయిని మరిచి దిగజారి వ్యవహరిస్తున్నారని, వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు.


దేశంలో కాంగ్రెస్‌ రాచరికం నడవదు..

మోదీ సర్కారును గద్దె దించాలని ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ భావించడంలో తప్పులేదని, కానీ.. దాని కోసం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరించడం దారుణమని కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలో కాంగ్రెస్‌ రాచరికం సాగదని, రాహుల్‌గాంధీ, విదేశీ శక్తులు చెప్పినట్టు దేశంలో వ్యవస్థలు నడవవని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపులో తప్పులుంటే.. గుర్తించి, సరిదిద్దాల్సిన బాధ్యత అందరిదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్‌ బూత్‌ వారీగా కాంగ్రె్‌సకు బీఎల్‌ఏలు ఉన్నారని గుర్తుచేశారు. సర్‌ ద్వారా దేశంలో 2.8 కోట్ల మంది ఓటర్లు చనిపోయినట్లు తేలిందని, వారి ఓట్లను ఉంచితే ఎవరు వచ్చి ఓటు వేస్తారని ప్రశ్నించారు.


6.3 కోట్ల మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారని, వారు ఉంటున్న ప్రాంతంలోనే వారికి ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. మరో కోటి మందికి రెండు చోట్ల ఓట్లున్నాయని, 3 కోట్ల మంది ఓటర్లు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ శివతాండవం అంటున్నారని, అసలు కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే రాముడు, శివుడి గురించి లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘‘పేదల, ఆదివాసీల, దళితుల, మైనారిటీల ఓట్లు తీసేస్తున్నారంటూ రేవంత్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ధర్నా చేయాలని చూస్తే రేవంత్‌ ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేస్తోంది. ఢిల్లీలో మాత్రం ధర్నాలు చేస్తూ.. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఒక నీతి.. ఢిల్లీలో మరో నీతా?’’ అని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతులు నీళ్లులేక, పరిశ్రమలు, ప్రజలు కరెంట్‌ కోతలతో ఇబ్బందులు పడుతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి వారానికోసారి ఢిల్లీకి వచ్చి రాహుల్‌గాంధీని పొగిడి వెళ్తున్నారని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఫలానా కారులో ఉన్నా.. రండి!

ఎమ్మెల్సీ బరిలో మళ్లీ రాంచందర్‌రావు?

జనవరిలో విజయవాడ హైవే విస్తరణ

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 05:07 AM