ఎకరానికి రూ.10 వేల పరిహారం
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:27 AM
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని రాష్ట్రంలో 11.18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వ యంత్రాంగం తేల్చింది. ఈ నష్టానికి సంబంధించి ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించాలని అధికారులు ప్రభుత్వానికి సూచించారు.
ఇవ్వాలని ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన..
11.18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెల్లడి
పశుసంవర్ధక శాఖ, తాగునీటి ప్రత్యామ్నాయానికి కలిపి మొత్తం 2,170 కోట్లు ఇవ్వాలని అంచనా
ఎల్నినోపై సీఎంకు అధికారుల నివేదిక
7 లక్షల ఎకరాలకు ఒక్క తడికే సాగునీరు
రాష్ట్రంలోని 320 మండలాల్లో వర్షాభావం
117 మండలాల్లో అత్యంత తీవ్ర కరువు
నేడు మంత్రులతో సీఎం ప్రత్యేక భేటీ
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని రాష్ట్రంలో 11.18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వ యంత్రాంగం తేల్చింది. ఈ నష్టానికి సంబంధించి ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించాలని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఇందుకోసం రూ.1,118 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రం కానుందని వాతావరణ శాఖ అంచనాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు, పంటనష్టం, తాగునీరు, సాగునీటి లభ్యతపై ప్రభుత్వ యంత్రాంగం సమగ్ర నివేదిక రూపొందించింది. ఆ నివేదికను ఎల్నినో-దాని ప్రభావం, కరువు పరిస్థితులపై బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్షలో అధికారులు సమర్పించారు.
ఇందులో.. 11.18 లక్షల ఎకరాల్లో రూ.1,118 కోట్ల పంట నష్టపరిహారంతోపాటు విత్తన రాయితీలు, సూక్ష్మ సేద్యం, ఉద్యానవన పంటల ప్రోత్సాహకాలు కలిపి మొత్తం రూ.1,986.89 కోట్ల వ్యవసాయ సహాయ ప్యాకేజీని ప్రతిపాదించారు. అలాగే పశు సంవర్ధక శాఖలో తక్షణ ప్యాకేజీ కింద రూ.42.10 కోట్లు ఇవ్వాలని సూచించారు. ఇందులో రూ.27.10కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలని పేర్కొన్నారు. ఇక గ్రామీణ నీటి సరఫరా పథకం (నాలుగు జిల్లాల కోసం సింగూరు ప్రత్యామ్నాయ ప్రణాళిక) కోసం రూ.84.14కోట్లు, హైదరాబాద్ జలమండలికి (సింగూరు నీటి కొరతను ఎదుర్కొనే 9 ప్రత్యామ్నాయ పనులకు) రూ.57.55 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. అన్నీ కలిపి మొత్తం రూ.2,178.68 కోట్లు అవసరమని అంచనా వేస్తూ నివేదికలో పొందుపరిచారు. ఇందులో భాగంగానే ప్రతి జిల్లా కలెక్టర్కు తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రూ.కోటి చొప్పున కేటాయించాలని పేర్కొన్నారు. ఈ మొత్తానికి గురువారం సచివాలయంలో నిర్వహించబోయే మంత్రుల సమావేశంలో ఆమోదం తెలపాలని సూచించారు.
117 మండలాల్లో తీవ్ర కరువు..
వర్షపాతం లోటు, పంటల పరిస్థితి, భూగర్భ జలాల లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభావిత మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలోని 621 మండలాల్లో 117 మండలాలు మధ్యస్థ, తీవ్రమైన, అత్యంత తీవ్రమైన కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. కరువు ప్రభావిత మండలాల్లో కేంద్ర బృందాలతో పంట నష్టాన్ని అంచనా వేయించి, కేంద్ర ప్రభుత్వ సహాయం కోరాలని ప్రతిపాదించారు. దీనివల్ల బాధిత రైతులకు పరిహారం అందించడంతో పాటు ఉపాధి హామీ పనులు, పశుసంవర్థక సహాయం వంటి కార్యక్రమాలను విస్తరించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఎల్నినోతో మరింత ముప్పు..
ప్రపంచ వాతావరణ సంస్థ ఈ నెల 8న విడుదల చేసిన అంచనాల ప్రకారం.. ఎల్నినో ప్రభావం డిసెంబరు నాటికి తీవ్రం కావొచ్చని సూచించింది. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య భారత ఉపఖండంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ అంచనాలు కాలానుగుణ వాతావరణ అవకాశాలేనని, స్థానిక స్థాయి వర్షపాతానికి ఇవి కచ్చితమైన సూచనలు కావని నివేదిక స్పష్టం చేసింది. అయినప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు తోడు ఎల్నినో ప్రభావం వ్యవసాయం, తాగునీటి వనరులు, విద్యుత్ సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
పత్తి రైతులకే ఎక్కువ నష్టం..
వర్షాభావం ప్రభావం ప్రధానంగా పత్తి పంటపై పడిందని అధికారుల నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 11.18 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. అందులో 8.93 లక్షల ఎకరాలు పత్తి పంటకు సంబంధించినవే. అంటే మొత్తం ప్రభావిత విస్తీర్ణంలో 80 శాతం పత్తి పంటదే. మరో 3.01 లక్షల ఎకరాల్లో పంటలు వాడిపోతుండగా.. 73,300 ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. 7.44 లక్షల ఎకరాల్లో పంటల పరిస్థితి ఎటూ కాకుండా ఉంది. జిల్లాల వారీగా చూస్తే నల్లగొండలో అత్యధికంగా 3.59 లక్షల ఎకరాల్లో పంటలు ప్రభావితమయ్యాయి. జోగులాంబ గద్వాలలో 1.45 లక్షలు, నాగర్కర్నూల్లో 1.42 లక్షలు, రంగారెడ్డిలో 1.29 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం కూడా తగ్గింది. 2025 వానాకాలంలో 139.28 లక్షల ఎకరాల్లో సాగు జరగ్గా.. ఈ ఏడాది 126.06 లక్షల ఎకరాలకు పరిమితమైంది. వరి సాగు విస్తీర్ణం ఏకంగా 18 శాతం తగ్గినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
తాగునీటికే తొలి ప్రాధాన్యం..
రాష్ట్రంలోని ప్రధాన, మధ్యతరహా ప్రాజెక్టుల్లో సాధారణంగా 462.6 టీఎంసీల నీటి నిల్వ ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 210.8 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అంటే సాధారణ నిల్వల్లో 54 శాతమే అందుబాటులో ఉంది. గత ఏడాదితో పోలిస్తే కృష్ణా బేసిన్లో 42 శాతం, గోదావరి బే సిన్లో 38 శాతం తక్కువ నీటి నిల్వలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 44 వేల చెరువుల్లో 40 శాతం చెరువుల్లో పావు వంతు కంటే తక్కువ నీరు మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో 2027 జూలై వరకు తాగునీటి అవసరాల కోసం 85 టీఎంసీల నీటిని ప్రత్యేకంగా కేటాయించాలని అధికారులు సూచించారు. మిషన్ భగీరథకు 50 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 20 టీఎంసీలు, ఇతర పట్టణ, పారిశ్రామిక అవసరాలకు 15 టీఎంసీలు కేటాయించిన తర్వాత మిగీలే నీటిని సాగునీటికి వినియోగించాలని ప్రతిపాదించారు.
నీటి నిల్వలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి విడుదలను పరిమితం చేయాలని అధికారులు సూచించారు. తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాత మిగిలే నీటిలో 47 టీఎంసీలను వినియోగించి సుమారు 7 లక్షల ఎకరాలకు మాత్రమే ఒకసారి తడి అందించాలని ప్రతిపాదించారు. ఇందులో కృష్ణా బేసిన్ పరిధిలో లక్ష ఎకరాలకు, గోదావరి బేసిన్ లో 6 లక్షల ఎకరాలకు నీరు విడుదల చేయాలని సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంట విరామం పాటించాలని, నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే సాగులో ఉన్న, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు మాత్రమే ఒకసారి నీరు అందించాలని పేర్కొన్నారు.
సింగూరు నీటిపై ఆందోళన
తాగునీటి సరఫరా విషయంలోనూ ప్రభుత్వం అప్రమత్తమైంది. సింగూరు జలాశయంలో ప్రస్తుతం 3.924 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నిల్వలు డిసెంబరు 10 వరకు సరిపోతాయని అంచనా. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని 2,395 గ్రామీణ ఆవాసాలు, 19 పట్టణ స్థానిక సంస్థలు సింగూరు, మంజీరా నీటిపై ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగూరు ప్రత్యామ్నాయ ప్రణాళిక కోసం రూ.84.14 కోట్లు కేటాయించాలని, హైదరాబాద్లో నీటి కొరతను అధిగమించేందుకు మరో రూ.57.55 కోట్లతో ప్రత్యామ్నాయ పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు.
రాష్ట్రంలోని 3.26 కోట్ల పశుసంపదకు పశుగ్రాస కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. తక్షణ చర్యల్లో భాగంగా రూ.42.10 కోట్ల ప్యాకేజీని ప్రతిపాదించారు. అదనంగా 64 వేల మెట్రిక్ టన్నుల ఎండుగడ్డిని నిల్వ చేసేందుకు రూ.44.83 కోట్ల ప్రతిపాదనను కూడా సిద్థం చేశారు. కాగా, ఎల్నినో ప్రభావం, రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సీఎం రేవంత్రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయంలో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అధికారులు నివేదికలో చేసిన ప్రతిపాదనలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆ నిర్ణయాలను సీఎం రేవంత్రెడ్డి స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.
రబీ సాగుపైనా ఎఫెక్ట్..
2026 ఖరీ్ఫలో 126.06 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సీజన్లో 139.28 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. అంటే ఈ ఏడాది 9.5 శాతం సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది యాసంగిలోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారుల అంచనా. గత రబీలో 93.19 లక్షల ఎకరాల్లో సాగు జరగ్గా.. ఈసారి 65.89 లక్షల ఎకరాల్లోనే సాగు పరిమితం కావొచ్చని నివేదికలో పేర్కొన్నారు. అంటే యాసంగిలో 29.3 శాతం సాగు విస్తీర్ణం తగ్గుతుందని అంచనా. ఇక వరి సాగు విస్తీర్ణం 65.93 లక్షల ఎకరాల నుంచి 33.74 లక్షల ఎకరాలకు తగ్గవచ్చని అంచనా వేశారు. మరోవైపు వ్యవసాయ పనులు తగ్గితే గ్రామాల్లో ఉపాధి హామీ (జీరామ్జీ) పనులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. అక్టోబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు 11కోట్ల పనిదినాలు కల్పించాలని తెలిపారు.
అధికారుల నివేదికలోని కీలక విషయాలు..
వ్యవసాయం-ఉద్యానవనంలోని పంట నష్టానికి రూ. 1,986.89 కోట్లు
పశు సంవర్ధక శాఖకు తక్షణ ప్యాకేజీ కింద రూ. 42.10 కోట్లు
గ్రామీణ నీటి సరఫరాకు (4 జిల్లాలకు సింగూరు ప్రణాళిక) రూ. 84.14 కోట్లు
హైదరాబాద్ జలమండలికి (9 ప్రత్యామ్నాయ ప్రణాళిక) రూ. 57.55 కోట్లు
మొత్తం రూ. 2,170.68 కోట్లు
ఈ వార్తలు కూడా చదవండి
సింగరేణి కార్మికులకు బోనస్ బొనాంజా
వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Read Latest AP News And Telangana News And International