ఎల్‌నినో కోవిడ్ లాంటి సంక్షోభం.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Oct 15 , 2026 | 08:16 PM
ప్రపంచాన్ని ఎల్‌నినో విపత్తు వణికిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్‌నినో ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉందని అన్నారు. గురువారం హైదరాబాద్‌లో రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.
హైదరాబాద్, అక్టోబర్ 15: ప్రపంచాన్ని ఎల్‌నినో విపత్తు వణికిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్‌నినో ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉందని అన్నారు. గురువారం హైదరాబాద్‌లో రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. 100 దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించిందని గుర్తు చేశారు. దీనివల్ల తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొందని చెప్పారు. అన్ని జీవరాశులపై ఈ ఎల్‌నినో ప్రభావం ఉందని పేర్కొన్నారు.
ఎల్‌నినో ఓ ప్రకృతి విపత్తు..
కోవిడ్ లాంటి సంక్షోభం ఎల్‌నినో అని అభివర్ణించారు. ఈ 75 ఏళ్లలో చాలా సార్లు ఎల్‌నినో వచ్చిందని వివరించారు. ఎల్‌నినో ఓ ప్రకృతి విపత్తు అని అన్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఈ విపత్తును ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రజలతోపాటు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. గ్లోబల్ వార్మింగ్ వల్లే ఎల్‌నినో విపత్తు వచ్చిందని విశదీకరించారు.
చేయిదాటనున్న పరిస్థితులు..
ఎల్‌నినో విషయంలో శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారని తెలంగాణ సీఎం గుర్తు చేశారు. ఎల్‌నినో వల్ల చేయిదాటే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావంపై రైతులను ముందే హెచ్చరించామని పేర్కొన్నారు. ఈ ఎల్‌నినోను ఎదుర్కోవడానికి కార్యాచరణ చేపట్టామని అన్నారు. అలాగే రైతులను ఆదుకునేందుకు చర్యలు కూడా చేపట్టామని వివరించారు.
వేసవి తరహాలో అధిక ఉష్ణోగ్రతలు..
ఎండల తీవ్రత బాగా పెరిగిందని చెప్పారు. వేసవి తరహాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. విద్యుత్‌తో పాటు నీటి అవసరాలు కూడా పెరుగుతున్నాయని వివరించారు. అయినా డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తూ.. రైతులు, పరిశ్రమలకు సరఫరా చేస్తోందని అన్నారు.
ఓ సీజన్ పంట వాయిదా వేసుకోవాలి..
ఎండాకాలం పంటలు వేయడం మానుకోవాలని రైతులకు సీఎం రేవంత్ సూచించారు. ఒక సీజన్ పంటను వాయిదా వేసుకోవాలని వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎవరో చెప్పిన మాటలను నమ్మొద్దంటూ రైతులకు స్పష్టం చేశారు. రైతులతోపాటు రైతు కూలీలకూ కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకున్నాయని వివరించారు. రైతు కూలీలను ఉపాధి హామీ పని ద్వారా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉపాధి కూలీల ద్వారా చెరువులు, కుంటలను వచ్చే వర్షాకాలానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పథకాలతో ఎల్‌నినో విపత్తును ఎదుర్కొందామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
పైశాచిక ఆనందం పొందుతున్న కొందరు..
రాష్ట్ర పరిస్థితిని చూసి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి సీఎం రేవంత్ విమర్శించారు. ఎల్‌నినో పరిస్థితులపై అఖిలపక్షంతో సబ్ కమిటీ చర్చలు జరుపుతుందని తెలిపారు. త్వరలో కేంద్రానికి నివేదికలు అందించి.. సాయం కోరుతామని అన్నారు. అవసరమైన విద్యుత్ కొనుగోలుకు సాయం చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని ఆయన కోరారు. కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్లో కేంద్రాన్ని సాయం కోరుతున్నామని చెప్పారు.
పార్టీలు, పౌరులు ప్రభుత్వానికి సహకరించాలి
కోవిడ్ సమయంలో తాము రాజకీయాలు చేయలేదని వివరించారు. ప్రధాని ఇచ్చిన ప్రతి పిలుపును అమలు చేశామని గుర్తు చేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకు కోవిడ్ విషయంలో జాగ్రత్త పాటించామని తెలిపారు. కోవిడ్ నాటి స్ఫూర్తినే ఇప్పుడు రాజకీయ పార్టీలు చూపాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలు, పౌరులు ప్రభుత్వానికి సహకరించాల్సిన సమయమిదని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తును అందరం కలిసి ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. సాగునీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నోరు లేని మూగ జీవాలను కాపాడుకోవాలని సూచించారు.
దసరా తర్వాత అఖిల పక్ష చర్చలు..
చలికాలంలోనే ఎండాకాలాన్ని మించిన వేడి కనిపిస్తోందని సీఎం రేవంత్ తెలిపారు. సాగు, తాగునీటితోపాటు విద్యుత్ విషయంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. నాడు కాంగ్రెస్ పార్టీ జై జవాన్.. జై కిసాన్ నినాదం తీసుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రైతులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దసరా తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో అఖిలపక్షంతో చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు.
కేంద్రంలోని పెద్దలను కలుస్తాం..
అఖిలపక్షం తర్వాత కేంద్రంలోని పెద్దలను కలుస్తామని పేర్కొన్నారు. ఎల్‌నినోపై నిరంతరం చర్చలకు భట్టి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ నియమించినట్లు చెప్పారు. ఏ రోజుకారోజు వివరాలు తెలిపేందుకు నోడల్ అధికారిని నియమిస్తామని ప్రకటించారు. ఎల్‌నినోపై నోడల్ ఆఫీసర్‌గా మాజీ సీఎస్ కె. రామకృష్ణారావు నియమించినట్లు వెల్లడించారు. నోడల్ ఆఫీసర్ ఇచ్చిందే అధికారిక సమాచారంగా భావించాలని ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంద్రకీలాద్రిపై వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు: దుర్గ గుడి ఈవో
కుప్పంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా వలసలు
For More TG News And Telugu News