Share News

ఇంద్రకీలాద్రిపై వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు: దుర్గ గుడి ఈవో

ABN , Publish Date - Oct 15 , 2026 | 06:25 PM

మూల నక్షత్రం నేపథ్యంలో సరస్వతీ దేవి అలంకారంలో శుక్రవారం దుర్గమ్మ వారు భక్తులకు దర్శనం ఇస్తారని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో శీనా నాయక్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు.

ఇంద్రకీలాద్రిపై వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు: దుర్గ గుడి ఈవో

విజయవాడ, అక్టోబర్15: మూల నక్షత్రం నేపథ్యంలో సరస్వతీ దేవి అలంకారంలో శుక్రవారం దుర్గమ్మ వారు భక్తులకు దర్శనం ఇస్తారని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో శీనా నాయక్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. శక్రవారం సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య అమ్మవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఈ రోజు అర్ధరాత్రి12.30 - 12.45 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తామని అన్నారు. గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయని చెప్పారు.


ఈ రోజు ఐదో రోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం నుంచే ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా పోటెత్తారని వివరించారు. నవరాత్రులు ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 లక్షల మంది భక్తులు దుర్గమ్మవారిని దర్శించుకున్నారని అన్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.


క్యూ లైన్లు, మూడు హోల్డింగ్ ఏరియాల్లో సుమారు 30 వేల మంది భక్తులు వేచి ఉండే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 72 వేల మంది భక్తులు అన్నప్రసాద వితరణ స్వీకరించారని వివరించారు. 8.70 లక్షల లడ్డూ ప్రసాదాలు కొనుగోలు జరిగాయని పేర్కొన్నారు. అయితే ఘాట్ రోడ్డుపై ఫోర్ వీలర్ వాహనాలకు అనుమతి లేదని వాహనదారులకు స్పష్టం చేశారు.


క్యూ లైన్లు, హోల్డింగ్ ఏరియాల్లో మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు, ఆహారం పంపిణీ చేస్తున్నామని వివరించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ ఉత్సవాల విజయవంతానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కుప్పంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా వలసలు

విదేశీ బొగ్గు దిగుమతితో సింగరేణికి మరణశాసనం రాస్తున్న సీఎం రేవంత్: కేటీఆర్
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2026 | 06:36 PM