పీవోకేలో పాకిస్థాన్ చర్యలపై నివేదిక ఇవ్వండి.. ఐక్యరాజ్యసమితిని కోరిన భారత్..
ABN , Publish Date - Oct 15 , 2026 | 10:46 AM
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై భారత్ మరోసారి అంతర్జాతీయ వేదికపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై భారత్ మరోసారి అంతర్జాతీయ వేదికపై ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ జరిగిన మరణాలపై విచారణ, ఇంటర్నెట్ ఆంక్షల తొలగింపు, నిర్బంధించిన నాయకులకు న్యాయపరమైన హక్కులు కల్పించడం వంటి అంశాలపై పాకిస్థాన్ తీసుకున్న చర్యలను తెలియజేస్తూ నివేదిక విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల విభాగాన్ని భారత్ కోరింది (PoK human rights).
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మూడో కమిటీ 81వ సమావేశంలో భాగంగా బుధవారం జరిగిన చర్చలో భారత శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి అనుజ్ స్వరూప్ ఈ అంశాలను ప్రస్తావించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం గతంలో వ్యక్తం చేసిన ఆందోళనలను ఆయన గుర్తుచేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనల సమయంలో జరిగిన మరణాలపై నిష్పాక్షికంగా, సమగ్రంగా విచారణ జరపాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం గతంలో పిలుపునిచ్చింది.
భద్రతా బలగాల చర్యల్లో మరణాలు సంభవించినట్లు వచ్చిన నివేదికలపై పారదర్శక దర్యాప్తు అవసరమని ఐరాస సూచించింది. అలాగే నిర్బంధంలో ఉన్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకులకు న్యాయవాదులను, కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కల్పించాలని, చట్ట ప్రకారం న్యాయమైన విచారణ జరగాలని కోరింది. ఈ అంశాలపై పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఐక్యరాజ్యసమితి ఎప్పుడు నివేదిక ఇస్తుందని అనుజ్ స్వరూప్ ప్రశ్నించారు (UN human rights office).
మానవ హక్కుల అంశాలపై ఐరాస హైకమిషనర్ కార్యాలయం వ్యవహరిస్తున్న తీరుపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది (Restrictions in PoK). హింసాత్మక చర్యలపై తగిన స్థాయిలో స్పందించకపోవడం వల్ల అంతర్జాతీయ సంస్థలపై విశ్వాసం తగ్గుతుందని అనుజ్ స్వరూప్ వ్యాఖ్యానించారు. మానవ హక్కుల అంశాల్లో ఎంపిక చేసుకుని స్పందించే ధోరణి కాకుండా, అన్ని సందర్భాల్లో ఒకే విధమైన ప్రమాణాలను పాటించాలని భారత్ కోరింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగంతో పూర్తిగా కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
చైనా విడిభాగాలతో హూతీల క్షిపణులు.. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాకు ముప్పు తప్పదా..
మరికొంచెం తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..