90 కిలోల కొండచిలువతో యువకుడి భీకర పోరాటం.. వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 16 , 2026 | 08:21 AM
భారీ కొండచిలువతో ఓ వ్యక్తి తలపడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 19 అడుగుల పొడవు, 90 కిలోల బరువు ఉన్న కొండచిలువతో కుస్తీకి దిగాడు ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈ పోరాటంలో పాము అతడిని చుట్టేసి, ఊపిరాడకుండా చేసేందుకు ప్రయత్నించింది. చివరికి..
ఇంటర్నెట్ డెస్క్: భారీ కొండచిలువతో ఓ వ్యక్తి తలపడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 19 అడుగుల పొడవు, 90 కిలోల బరువు ఉన్న కొండచిలువతో కుస్తీకి దిగాడు ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈ పోరాటంలో పాము అతడిని చుట్టేసి, ఊపిరాడకుండా చేసేందుకు ప్రయత్నించింది. చివరికి తన బలాన్నంతా ఉపయోగించిన ఇన్ఫ్లుయెన్సర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మైక్ హోల్స్టన్ ‘ది రియల్ టార్జాన్’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. శారీరకంగా ఎంతో దృఢంగా ఉండే అతను తరచూ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటాడు. తాజాగా, కొండచిలువతో పోరాడుతున్న వీడియోను షేర్ చేయగా, గంటల వ్యవధిలోనే వైరల్గా మారింది. వీడియో ప్రకారం.. మైక్ హోల్స్టన్ భారీ కొండచిలువ దగ్గరకు వెళ్లి దానిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. పాము తలను పట్టుకుని దానిపై కూర్చున్నాడు. మొదట కొండచిలువపై అతను పైచేయి సాధించినట్లు కనిపించింది. ఆ తర్వాత పాము అతడిని చుట్టేసి, ఊపిరాడకుండా చేసేందుకు ప్రయత్నించింది.
మైక్ హోల్స్టన్ కాళ్లను పాము చుట్టేయడంతో కిందపడిపోయాడు. అనంతరం అతని నడుము భాగాన్ని బలంగా చుట్టేసింది. దాని పట్టు నుంచి తప్పించుకునేందుకు మైక్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే, కొండచిలువ భారీగా ఉండటంతో దాని నుంచి తప్పించుకోవడం కష్టంగా మారింది. చివరికి తన బలాన్ని, తెలివిని ఉపయోగించిన ఇన్ఫ్లుయెన్సర్.. దాని పట్టు నుంచి విడిపించుకోగలిగాడు. ఈ అనుభవాన్ని తన జీవితంలో ఎదురైన అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన పోరాటాల్లో ఒకటిగా మైక్ అభివర్ణించాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బోల్తాపడిన ఆయిల్ ట్యాంకర్.. చుక్క మిగల్చకుండా ఎత్తుకెళ్లిన జనం
గుజరాతీ గర్బాకు స్విస్ అంబాసిడర్ మాయా టిస్సాఫి ఫిదా.!