ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు పాత ఫీజులే ఖరారు
ABN , Publish Date - Aug 12 , 2026 | 08:04 AM
తెలంగాణలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూసే విద్యార్థులకు సర్కారు ఊరటనిచ్చింది.
2026-29 బ్లాక్ పీరియడ్‌కు నోటిఫికేషన్ విడుదల..
గత మూడేళ్ల మాదిరిగానే ఇకపైనా అమలు
ప్రైవేట్, మైనారిటీ, ఆర్మీ డెంటల్ కాలేజీలకు వర్తింపు
హెల్త్ యూనివర్సిటీ కీలక ప్రకటన
హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూసే విద్యార్థులకు సర్కారు ఊరటనిచ్చింది. 2026-29 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ కాళోజీ హెల్త్ యూనివర్శిటీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.98 ప్రకారం.. రాబోయే నాలుగేళ్ల కాలానికి పాత ఫీజులే కొనసాగుతాయని స్పష్టం చేసింది. 2023-26 బ్లాక్ పీరియడ్ కోసం గతంలో జీవో నం. 106,132 ద్వారా నిర్ణయించిన ఫీజులే ఈ కొత్త కాలానికి కూడా వర్తిస్తాయని యూనివర్సిటీ రిజిస్ర్టార్ వెల్లడించారు.
కాగా తెలంగాణ విద్యా సంస్థల చట్టం 1983లోని సెక్షన్ 7 ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సె్‌సలోనూ ఇవే ఫీజులు అమలులో ఉంటాయి. ఒకవేళ 2026-29 మధ్య కాలంలో ఏదైనా కొత్త కాలేజీలకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తే, ఆ సంస్థలో అప్పటికే అమల్లో ఉన్న కనిష్ట ఫీజును మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించింది. రాష్ట్రంలో మొత్తం 27 ప్రైవేటు కాలేజీలున్నాయి.
వీటిల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సులో ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా (కేటగీరీ-ఎ) కింద ఏడాదికి రూ.60 వేలు ఫీజును ఖరారు చేశారు. మేనేజ్‌మెంట్ కోటా (కేటగీరీ-బి) కింద వివిధ కళాశాలల్లో రూ.11.55 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఉండాలని నిర్ణయించారు. అపోలో, చల్మెడ, కామినేని నార్కెట్‌పల్లి, కామినేని హైదరాబాద్, మల్లారెడ్డి, ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరి కింద రూ.13 లక్షలుగా నిర్దేశించారు. ఎస్వీఎస్, దక్కన్‌లో రూ.12.50 లక్షలు, ఆయాన్, వీఆర్కే ఉమెన్స్, మమత ఖమ్మం, మమత బాచుపల్లి, మల్లారెడ్డి ఉమెన్, మెడిసిటీ, ప్రతిమ, ఆర్వీఎమ్, షాదన్ వైద్య కళాశాలల్లో రూ.12 లక్షలు, మిగిలిన కాలేజీల్లో రూ.11.55 లక్షలుగా ఫీజు ఉంది.
ఇక ఈ కాలేజీలన్నింటిలోనూ ఎన్‌ఆర్‌ఐ కోటా (కేటగీరీ-సి) కింద మేనేజ్‌మెంట్ కోటా ఫీజుకు రెండు రెట్ల వరకు వసూలు చేసే అవకాశం కల్పించారు. బీడీఎస్ కోర్సు విషయానికి వస్తే కన్వీనర్ కోటాలో రూ.45 వేలు, మేనేజ్‌మెంట్ కోటాలో రూ.4.20 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఫీజులు ఉండనున్నాయి. ఫీజుల వసూళ్ల విషయంలో ప్రభుత్వం కఠిన నిబంధనలను విధించింది. ఏ కళాశాలైనా విద్యార్థుల నుంచి క్యాపిటేషన్ ఫీజు లేదా డొనేషన్ల రూపంలో అదనంగా ఒక్క పైసా కూడా తీసుకోకూడదని హెచ్చరించింది. అలా వసూలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేసింది. మొత్తం కోర్సు ఫీజును ఐదు వాయిదాల్లో, ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో వసూలు చేయాలని ఆదేశించింది. ఒకసారి చేరిన విద్యార్థికి కోర్సు పూర్తయ్యే వరకు అదే ఫీజు కొనసాగుతుందని, మధ్యలో పెంచడానికి వీల్లేదని నిబంధన విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
మెట్రో ఫేజ్-1 రుణసేకరణ బాధ్యత ఎస్‌బీఐ క్యాప్స్‌దే
Read Latest AP News And Telangana News And International News And Telugu News