Share News

చేయూతకు దరఖాస్తుల స్వీకరణ

ABN , Publish Date - Aug 12 , 2026 | 07:46 AM

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది.. చేయూత పథకం కింద పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది.

చేయూతకు దరఖాస్తుల స్వీకరణ
Telangana, Cheyutha Pension

  • విడతలవారీగా 3 లక్షల నుంచి 3.5 లక్షల పింఛన్ల మంజూరు..

  • మహిళలు, దివ్యాంగులకు అధిక ప్రాధాన్యం

  • దరఖాస్తులకు 31వ తేదీ తుది గడువు

  • ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు చేస్తున్నవారి కుటుంబసభ్యులు అనర్హత పరిధిలోకి

హైదరాబాద్‌: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది.. చేయూత పథకం కింద పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల నుంచి 3.50 లక్షల మందికి విడతలవారీగా కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మహిళలకు, దివ్యాంగులకు, అనారోగ్యంతో ఉన్నవారికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు తుదిగడువు ఆగస్టు 31. కొత్త పింఛన్ల మంజూరులో వితంతువులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్‌ రోగులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులతోపాటు తలసీమియా, సికిల్‌ సెల్‌ అనీమియా, హీమోఫీలియా బాధితులకు కూడా దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించారు.


దివ్యాంగులకు రూ.4,016.. ఇతరులకు రూ.2,016 ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ, డేటా నమోదు, క్షేత్రస్థాయి పరిశీలన, ఇతర డేటాబేస్ లతో ధ్రువీకరణ, జిల్లా కలెక్టర్‌ ఆమోదం వంటి దశలు పూర్తయిన తర్వాత అర్హులైనవారికి మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ పింఛన్ల మంజూరుకు సంబంధించి వయో పరిమితిని ఒక్కో కేటగిరీ వారికీఒక్కోలా నిర్ణయించారు. వితంతు పింఛన్‌కు 18 ఏళ్లు పైబడినవారు అర్హులు. ఇందుకు వారు భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఒంటరి మహిళల కేటగీరీలో దరఖాస్తు చేసుకునేవారు భర్త నుంచి విడిపోయి కనీసం ఏడాది అయి ఉండాలి. విడాకులు, కోర్టు ఉత్తర్వులు, ఇతర ధ్రువీకరణ పత్రాలతోపాటు స్థానిక విచారణ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.


అవివాహిత మహిళలకు సైతం వారి ఆర్థిక స్థితి, కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చేయూత పింఛను ఇవ్వనున్నారు. ఇందుకుగాను గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు నిండినవారు దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పంచాయతీ కార్యదర్శి. వార్డు అధికారి ధ్రువీకరణ అవసరం. దివ్యాంగుల పింఛన్‌కు వయోపరిమితి వర్తించదు. కనీసం 40 శాతం వైకల్యం ఉండాలి. వినికిడి లోపం విషయంలో 51 శాతం వైకల్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. యూడీడీ, సదరం ధ్రువీకరణ ఆధారంగా అర్హత నిర్ధారిస్తారు. వీరితోపాటు.. గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 ఫైలేరియా బాధితులకు కూడా వయోపరిమితి లేకుండా పింఛన్‌ మంజూరుకు అవకాశం కల్పించారు.


సంబంధిత డీఎంహెచ్‌వో ద్వారా నమోదు, ధ్రువీకరణ అవసరం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్‌ చేయించుకుంటున్నవారికి కూడా వయోపరిమితి లేకుండా పింఛన్‌ మంజూరు చేయనున్నారు. ఇందుకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ద్వారా నమోదు, ధ్రువీకరణ అవసరం. ఇక.. 50 ఏళ్లు పైబడిన చేనేత, గీత కార్మికులు చేయూత పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. గీత కార్మికులు సహకార సంఘంలో సభ్యులై ఉండాలి. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ధ్రువీకరణను సమర్పించాలి.


దరఖాస్తు స్వీకరణ, అర్హుల ఎంపిక ఇలా..

కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తు ఫారం చేయూత పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, బిల్‌ కలెక్టర్లు, ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, మండల సమాఖ్యల ద్వారా దరఖాస్తు స్వీకరించి.. వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారుడి అర్హత, కుటుంబ పరిస్థితి, సమర్పించిన వివరాల నిజానిజాలను ధ్రువీకరించుకుని 360 డిగ్రీ డేటాబే్‌సతో వివరాలను సరిపోల్చి ఎంపిక చేస్తారు.


ఏయే పత్రాలు అవసరం?

దరఖాస్తు ఫారం, ఆధార్‌ కార్డు, వయస్సు ధ్రువీకరణపత్రం, రేషన్‌/ఆహార భద్రతకార్డు లేదంటే రెవెన్యూశాఖ జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్‌బుక్‌ మొదటి పేజీ సమర్పించాలి.


వీరంతా అనర్హులే

  • మూడెకరాలకు మించి తడి/నీటి పారుదల భూమి (లేదా) 7.5 ఎకరాలకు మించి పొడిభూమి ఉన్న కుటుంబాల్లోనివారు

  • ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు చేస్తున్నవారి కుటుంబసభ్యులు

  • వైద్యులు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, స్వయం ఉపాధిలో ఉన్న కుటుంబాలవారు

  • వ్యాపార సంస్థలను నిర్వహించే కుటుంబాలు

- ఇప్పటికే ప్రభుత్వ పింఛన్‌, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌ పొందుతున్నవారు

  • 4చక్రాల, భారీవాహనాల యజమానులు

  • కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించి ఉన్నవారు


ఈ వార్తలు కూడా చదవండి:

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

మెట్రో ఫేజ్‌-1 రుణసేకరణ బాధ్యత ఎస్‌బీఐ క్యాప్స్‌దే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 07:46 AM