Share News

కొత్తగా 158 ఆవాసాలకు రహదారి సౌకర్యం

ABN , Publish Date - Aug 12 , 2026 | 07:28 AM

రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకూ అభివృద్ధి ఫలాలు చేరాలన్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ‘అడవితల్లి బాట’ పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఎన్నో గిరిశిఖర గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించారు.

కొత్తగా 158 ఆవాసాలకు రహదారి సౌకర్యం

  • పీఎం సడక్‌ యోజన కింద రూ.422 కోట్లు

  • అమల్లోకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ ప్రణాళికలు

అమరావతి: రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకూ అభివృద్ధి ఫలాలు చేరాలన్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ‘అడవితల్లి బాట’ పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఎన్నో గిరిశిఖర గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించారు. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోని మారుమూల పల్లెలు, ఆవాసాలకు రోడ్లు వేసేందుకు ఉపముఖ్యమంత్రి రూపొందించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చనున్నాయి.


158 మారుమూల గ్రామాలకు అనుసంధాన రహదారులు నిర్మించేందుకు పరిపాలన అనుమతుల మంజూరు ప్రక్రియ పూర్తయింది. దీనిలో భాగంగా 347 కిలోమీటర్ల పొడవున 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. పలు జిల్లాల్లో ఇంతవరకు రహదారి సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి అంచనాలు రూపొందించారు. ఈ గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన పథకం కింద రూ.422 కోట్లు మంజూరయ్యాయి.


ఐదేళ్లపాటు ఈ రోడ్ల నిర్వహణకు మరో రూ.24.47 కోట్లు విడుదలయ్యాయి. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఈ రోడ్ల నిర్మాణ చేపట్టనుంది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ 158 ఆవాసాలకు తొలిసారి రోడ్డు సౌకర్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రోడ్ల నాణ్యతలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ రోడ్లు, వంతెనల నిర్మాణంతో ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడి.. విద్య, వైద్యం, మార్కెటింగ్‌ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

Updated Date - Aug 12 , 2026 | 07:31 AM