ఆ మైనింగ్ డాన్‌కు అడ్డెవ్వరు
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:28 AM
ఆయన కడప జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతకు ప్రధాన అనుచరుడు. జిల్లా కాని జిల్లాకు, ఊరుకాని ఊరుకు వచ్చాడు. ఇక్కడ మైనింగ్ లీజు పొందాడు. అయితే లీజు పొందింది ఒకచోట అయితే, తవ్వేది మరోచోట. నాడు ముఖ్య నేతకు అనుచరుడు కావడం, మైనింగ్ అధికారుల సహకారం దండిగా ఉండటంతో, వైసీపీ హయాంలో మైనింగ్ డాన్‌గా అవతరించాడు.
గనుల లీజు ఓ చోట.. తవ్వేది మరోచోట
అక్రమంగా తీసిన రాయి రాచబాటలో మార్కెట్‌కు
దీనికోసం రాయల్టీ బిల్లులు దుర్వినియోగం
కడప ముఖ్య నేత అనుచరుడి బాగోతం
కూటమి పాలనలోనూ మైనింగ్ దందా
ముడుపుల మత్తులో అధికారులు
(బి.కోడూరు - ఆంధ్రజ్యోతి): ఆయన కడప జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతకు ప్రధాన అనుచరుడు. జిల్లా కాని జిల్లాకు, ఊరుకాని ఊరుకు వచ్చాడు. ఇక్కడ మైనింగ్ లీజు పొందాడు. అయితే లీజు పొందింది ఒకచోట అయితే, తవ్వేది మరోచోట. నాడు ముఖ్య నేతకు అనుచరుడు కావడం, మైనింగ్ అధికారుల సహకారం దండిగా ఉండటంతో, వైసీపీ హయాంలో మైనింగ్ డాన్‌గా అవతరించాడు. ‘ఈ కొండంతా నాదే. ఎక్కడైనా తవ్వుకుంటా. నన్ను అడిగేదెవర్రా..’ అన్న తీరుగా వ్యవహరిస్తున్నాడు. జగన్ జమానాలో దందాలు చేసిన ఆయన, కూటమి ప్రభుత్వంలోనూ మైనింగ్ మాఫియాను నడిపిస్తుండటం విస్మయం కలిగిస్తోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా బి.కోడూరు తహసీల్దారు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే కొండమోటుపల్లె గ్రామం ఉంది. ఈ గ్రామానికి పై భాగాన ఉత్తరం, దక్షిణం కొండ ఉంది. అనంతపురం నుంచి పులివెందులకు వచ్చిన ఆ ముఖ్య అనుచరుడు వైసీపీ హయాంలో ఎస్.పాపనపల్లె రెవెన్యూ పొలం సర్వేనం.1లో 16 ఎకరాలను మైనింగ్ కోసం 20 సంవత్సరాల లీజుకు తీసుకున్నాడు. అయితే ఇక్కడో మతలబు ఉంది. ఆయన లీజు పొందిన చోట రాయే లేదు. దీంతో చెన్న కేశవాపురం గ్రామ పొలంలో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నాడు. అక్కడ తీసిన రాయిని ఎస్.పాపనపల్లె రెవెన్యూ పొలంలో ఉండే రాయల్టీ బిల్లులతో మార్కెట్‌కు పంపుతున్నట్లు సమాచారం.
ఈ దందాను అరికట్టాల్సిన మైనింగ్ అధికారులు ముడుపుల మత్తులో మునిగి తేలుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి అధికారి ఏడీ బాలసుబ్రహ్మణ్యం.. ముఖ్య అనుచరుడి దందాపై వేటు వేశారు. దాదాపు రూ.2కోట్ల పెనాల్టీ విధించారు. అయితే, రాజకీయ పలుకుబడిని వాడి రూ.20లక్షలు మాత్రమే కట్టి ఆయన చేతులు దులుపుకొన్నట్లు సమాచారం. మైనింగ్ దందాపై జిల్లా మైనింగ్ అధికారులకు ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య తమ్ముడు శశికుమార్ పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా, ఫలితం లేదని చెబుతున్నారు. మైనింగ్ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించి ఆయన ఇచ్చిన ముడుపులు తీసుకుని వెళ్లారని ఆరోపిస్తున్నారు.
రాయల్టీ ఇన్‌స్పెక్టర్ అండదండలను ఆయన పుష్కలంగా పొందుతున్నారని కూడా ఆరోపణలున్నాయి. టన్నుకు దాదాపు రూ.3వేలు చొప్పున ప్రభుత్వం నిర్నయించిన రాయల్టీని మైనింగ్ చేస్తున్న కాంట్రాక్టర్ ట్రెజరీలో చెల్లించాలి. ఈ రాయల్టీ బిల్లులు ఎక్కడైతే లీజుకు కేటాయించారో అక్కడ తీసిన రాయికి మాత్రమే ఉపయోగపడతాయి. అయితే ఆయన వేరేచోట తవ్విన రాయిని పగలు రాయల్టీ బిల్లులతో, రాత్రివేళల్లో బిల్లులే లేకుండా మార్కెట్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.
చర్యలు తీసుకుంటాం
‘తనకు కేటాయించిన స్థలంలోనే కాంట్రాక్టర్ మైనింగ్ చేపడుతున్నారని అనుకున్నాం. వేరే చోట తవ్వుతున్న విషయం తెలియదు. దీనిపై పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటాం.’
- ఎం.సుబ్రహ్మణ్యం, జిల్లా మైనింగ్ డీడీ
ఇవి కూడా చదవండి
జిలెటిన్ స్టిక్స్ కట్టుకుని పేల్చుకున్న తండ్రి