అదానీకి భారీ ఊరట
ABN , Publish Date - May 19 , 2026 | 02:22 AM
ఆసియా కుబేరుడు, అదానీ గ్రూప్ కంపెనీల అధిపతి గౌతమ్ అదానీకి భారీ ఊరట లభించింది. అమెరికాలో తనతోపాటు గ్రూప్‌పై నమోదైన రెండు కేసుల నుంచి ఒకే రోజు విముక్తి...
అమెరికాలో ఒకే రోజు రెండు కేసుల నుంచి విముక్తి
అదానీపై ఆరోపణలన్నింటినీ ఉపసంహరించుకున్న అమెరికా న్యాయ శాఖ.. కేసు శాశ్వతంగా క్లోజ్
ఇరాన్ నుంచి ఎల్‌పీజీ దిగుమతి చేసుకున్న కేసు రూ.2,645 కోట్లతో సెటిల్‌మెంట్
న్యూఢిల్లీ/న్యూయార్క్: ఆసియా కుబేరుడు, అదానీ గ్రూప్ కంపెనీల అధిపతి గౌతమ్ అదానీకి భారీ ఊరట లభించింది. అమెరికాలో తనతోపాటు గ్రూప్‌పై నమోదైన రెండు కేసుల నుంచి ఒకే రోజు విముక్తి లభించింది. సోలార్ ప్రాజెక్టులకు లంచాల ఆరోపణల కేసు నుంచి గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ బయటపడ్డారు. ఇందుకోసం వారు అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్‌ఈసీ, అమెరికా న్యాయ శాఖకు గత వారం 180 లక్షల డాలర్లు చెల్లించారు. అమెరికా న్యాయ శాఖ సోమవారం ఈ కేసు నుంచి అదానీలను పూర్తిగా విముక్తి చేసింది. ఈ కేసులో అదానీలపై నమోదైన ఆరోపణలను నిరూపించలేమని ప్రాసిక్యూటర్లు చెప్పడంతో న్యూయార్క్‌లోని కోర్టు ఈ కేసును మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులకు 25 కోట్ల డాలర్ల లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మంది వ్యక్తులపై అమెరికాలో కేసు నమోదైంది. లంచాల సొమ్ము పోగేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ తన ప్రాజెక్టుపై తప్పుడు సమాచారమిచ్చి అమెరికా ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించిందని ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం కింద కేసులు నమోదు చేసింది.
మరోవైపు ఆంక్షలు విధించిన ఇరాన్ నుంచి అక్రమంగా ఎల్‌పీజీ దిగుమతి చేసుకున్నందుకు అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (ఓఎ్‌ఫఏసీ) పెట్టిన కేసు నుంచి కూడా అదానీ గ్రూపునకు విముక్తి లభించింది. ఓఎ్‌ఫఏసీకి 27.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.2,645 కోట్లు) చెల్లించి ఈ కేసు సెటిల్ చేసుకున్నట్టు అదానీ గ్రూపు ప్రకటించింది. అమెరికా దర్యాప్తు సంస్థలకు తాము పూర్తిగా సహకరించడంతో ఇది సాధ్యమైందని తెలిపింది. 2023 నవంబరు నుంచి నుంచి గత ఏడాది జూన్ వరకు అదానీ గ్రూపు అమెరికా ఆంక్షలను అతిక్రమించి, ఇరాన్ నుంచి ఎల్‌పీజీ దిగుమతి చేసుకుందని ఆరోపణ. ఈ ఎల్‌పీజీని నేరుగా ఇరాన్ నుంచి గాక ఒక మధ్యవర్తి కంపెనీ ద్వారా ఒమన్, ఇరాక్ నుంచి తప్పుడు పత్రాలతో దిగుమతి చేసుకుంటున్నట్టు ఆరోపించింది. దీంతో అదానీ గ్రూపే నేరుగా అమెరికా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసింది. ఈ దర్యాప్తులో పూర్తిగా సహకరించడంతో అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ సెటిల్‌మెంట్‌కు అంగీకరించినట్టు అదానీ గ్రూపు తెలిపింది. దీంతో అమెరికాలో నమోదైన రెండు ప్రధాన కేసుల నుంచి అదానీలు పూర్తిగా బయట పడ్డట్టయింది.
ఇవి కూడా చదవండి..
సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..
ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..