Share News

మధుమేహం.. నగరవాసి కలవరం

ABN , Publish Date - Nov 14 , 2026 | 08:10 AM

మారుతున్న జీవన శైలిలో భాగంగా ప్రస్తుతం ప్రతిఒక్కరిని మధుమేహం(షుగర్‌) ముప్పు కలవరపెడుతోంది.

మధుమేహం.. నగరవాసి కలవరం
World Diabetes Day

  • సైలెంట్‌ కిల్లర్‌గా డయాబెటిక్‌ ముప్పు

  • రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు

  • నేడు అంతర్జాతీయ డయాబెటిక్‌ దినోత్సవం

హైదరాబాద్‌ సిటీ: మారుతున్న జీవన శైలిలో భాగంగా ప్రస్తుతం ప్రతిఒక్కరిని మధుమేహం(షుగర్‌) ముప్పు కలవరపెడుతోంది. డయాబెటిస్‌ వల్ల ప్రాణానికి హాని కాకపోయినా జీవన విధానానికి ఆటంకం. వేగంగా మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు ఇలా అనేక కారణాలు మధుమేహం రావడానికి కారణమవుతున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితం.. గంటల తరబడి కూర్చుని పనిచేయడం.. శారీరక శ్రమ తగ్గిపోవడం.. ఆహారపు అలవాట్లలో మార్పులు.. వెరసి నగర జీవనశైలిలో మధుమేహం విస్తరిస్తుంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ రుగ్మత ఇప్పుడు యువతను వేధిస్తోంది.


దేశంలోనే హైదరాబాద్‌లో అత్యధిక మంది మధుమేహంతోనే బాధపడుతున్న వారు ఉన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో అనుమానంతో వచ్చే బాధితుల్లో నలుగురిలో ఒకరికి తప్పని సరిగ్గా మధుమేహం ఉంటుందని చెప్పారు. ఈ నెల 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ‘ఎర్లీ యాక్షన్‌ ఆన్‌ డయాబెటిస్‌’ (మధుమేహంపై ముందస్తు చర్యలు) అనే అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. షుగర్‌ వ్యాధిని ముందుగానే గుర్తించడం, సరైన వైద్యసేవలు అందించడం, సమస్యలపై అవగాహన పెంచడం ముఖ్యమని నిపుణులు సూచించారు.


city3.2.jpg25 శాతం యువతలో గుర్తింపు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆస్పత్రులకు వచ్చే వారిలో 25 శాతం మించి మధుమేహ రోగులున్నట్లు వైద్యుల అంచనా వేస్తున్నారు. గతంలో ఓ ఫార్మా కంపెనీ నిర్వహించిన సర్వేల్లో కూడా యువతలో ఎక్కువగా మధుమేహం ఉన్నట్లు తేలింది. 1,900 మందికి నిర్వహించిన ఈ సర్వేలో యువత 25 శాతానికి మించి ఈ రుగ్మతతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. 43 శాతం మంది మధుమేహగ్రస్తులు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. తొమ్మిది శాతం మందికి తమకు జబ్బు ఉన్న విషయమే తెలియదు. 13 నుంచి 19 మధ్య వయస్సు గల వారిలో 20 శాతం, 20-30 ఏళ్ల వారిలో 30 శాతం, 30-40 ఏళ్ల వారిలో 40 శాతం, 40 కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో 50 శాతం కంటే మించి మధుమేహంతో బాధపడుతున్నారు. 19 ఏళ్లలోపు వయస్సున్న సుమారు 2.3 లక్షల నుంచి 2.8 లక్షల మంది టైప్‌-1 డయాబెటిస్ తో బాధపడుతుండగా, తెలంగాణలోనూ సుమారు 10 వేల నుంచి 15 వేల మందికిపైగా చిన్నారులు, యువత ఈ వ్యాధితో జీవిస్తున్నట్లు అంచనా.


గాయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు

చెప్పు కాటు, బొబ్బలు, పాదాల పగుళ్లు, చిన్న కోతలతోనే సమస్య మొదలవుతుంది. నరాల దెబ్బతినడం వల్ల నొప్పి తెలియక చాలామంది పట్టించుకోరు. ప్రారంభంలోనే గాయాన్ని పరీక్షించి, ఇన్ఫెక్షన్‌ను నియంత్రించడం, సరైన డ్రెస్సింగ్‌ చేయడం, గాయంపై ఒత్తిడి తగ్గించడం ముఖ్యం. ప్రతి మధుమేహ బాధితుడు రోజూ రక్తంలో చక్కెర స్థాయులను పర్యవేక్షించినట్లే పాదాలను కూడా పరిశీలించుకోవాలి. చెప్పులు లేకుండా నడవకూడదు. 40 ఏళ్ల వయస్సు దాటిన వారు ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. నిత్యం వ్యాయమం చేయాలి.

  • డాక్టర్‌ రాధిక మలిరెడ్డి, సీనియర్‌ ప్లాస్టిక్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ, డయాబెటిక్‌ ఫుట్‌ సర్జరీ, కేర్‌ ఆస్పత్రి, బంజారాహిల్స్‌


జీవనశైలిలో మార్పులే కీలకం

మధుమేహాన్ని సకాలంలో గుర్తించి నియంత్రించకపోతే గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం, కంటి చూపు దెబ్బతినడం, నరాల సమస్యలు, పాదాలకు పుండ్లు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయులపైనా శ్రద్ధ వహించాలి. వైద్యుల సూచనల మేరకు కంటి, మూత్రపిండాల పనితీరు పరీక్షలు చేయించుకోవాలి. నిత్యం నడక లేదా ఇతర వ్యాయామాలు చేయాలి. పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, సంపూర్ణ ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. చక్కెర పదార్థాలు, శీతల పానీయాలు, అధిక కొవ్వు పదార్థాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. తగినంత నిద్రపోవడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం.

  • డాక్టర్‌ కృష్ణారెడ్డి తాడురి, ఎండోకైన్రాలజిస్టు, కిమ్స్‌ ఆస్పత్రి, కొండాపూర్‌


ఈ వార్తలు కూడా చదవండి:

ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం

వికారాబాద్‌లో మహిళా క్రికెటర్‌ మృతి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 08:10 AM