ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. చైనాలో ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ..
ABN , Publish Date - Nov 14 , 2026 | 07:24 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే వారం చైనాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (ఏపీఈసీ) సదస్సు సందర్భంగా ఒకే వేదికపై సమావేశం కానున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే వారం చైనాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (ఏపీఈసీ) సదస్సు సందర్భంగా ఒకే వేదికపై సమావేశం కానున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ దేశాలకు నాయకత్వం వహిస్తున్న ఈ ముగ్గురు నేతల భేటీ అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. చైనాలోని షెన్‌జెన్ నగరంలో నవంబర్ 18, 19 తేదీల్లో ఏపీఈసీ నేతల సదస్సు జరగనుంది (Trump Jinping Putin meeting).
ఈ సదస్సు సందర్భంగా నవంబర్ 19న ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ త్రైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు నేతలు ఒకేసారి సమావేశం కావడం అరుదైన పరిణామంగా భావిస్తున్నారు. అణ్వాయుధాల నియంత్రణ, వాటి సంఖ్యను తగ్గించడం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా దేశాల మధ్య అణ్వాయుధాల విషయంలో పరస్పర అవగాహన పెంపొందించుకోవడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా, రష్యా వద్ద ఐదువేలకుపైగా అణ్వాయుధాలు ఉండగా, చైనా వద్ద 600కు పైగా ఉన్నట్లు అమెరికా రక్షణ శాఖ అంచనాలు చెబుతున్నాయి (APEC Summit 2026).
ఈ మూడు దేశాల మధ్య అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించి ఒక ఒప్పందం కుదరాలని ట్రంప్ ఆసక్తి చూపుతున్నారు (Nuclear Weapons). ఇక, ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. జిన్‌పింగ్, పుతిన్‌లతో జరిగే సమావేశంలో ఇరాన్ యుద్ధాన్ని ముగించే అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలిపారు. అయితే ఉక్రెయిన్ యుద్ధం గురించి ఈ ముగ్గురు నేతలు చర్చిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. తమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ భాగస్వామ్యం లేకుండా చర్చలు జరగకూడదని ఉక్రెయిన్ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష