Share News

విభేదిస్తే దేశ ద్రోహులంటారా?

ABN , Publish Date - Nov 14 , 2026 | 03:48 AM

మోదీయిజంపై క్రమంగా భ్రమలు తొలగిపోతున్నాయని, ఆయన ఐదేళ్ల క్రితం నాటి మోదీ కాదని విదేశాంగ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ వ్యాఖ్యానించారు.

విభేదిస్తే దేశ ద్రోహులంటారా?
Salman Khurshid

  • ప్రగతిశీల శక్తుల్ని ఏకం చేసే సదస్సు ఇది..

  • మోదీయిజంపై భ్రమలు తొలగిపోతున్నాయి

  • న్యాయంపై ఆధారపడే కొత్త వ్యవస్థ రావాలి

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మోదీయిజంపై క్రమంగా భ్రమలు తొలగిపోతున్నాయని, ఆయన ఐదేళ్ల క్రితం నాటి మోదీ కాదని విదేశాంగ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభ తగ్గిపోయిందని, రాహుల్‌ గాంధీ ఏమిటన్నది ప్రజలకు అర్థమవుతోందని అన్నారు. రాహుల్‌పై జీవిత కాలంపాటు బీజేపీ వాళ్లు చేసిన ప్రచారం ఇక కాలం చెల్లే స్థితిలో ఉందని, దానిని వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. భారత్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..


ఇది భారత్‌ సమ్మిట్‌ కాదు.. భారత వ్యతిరేక సమ్మిట్‌ అని బీజేపీ విమర్శిస్తోంది?

విపక్ష నేతల ఐక్యత కోసమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల, ఉదారవాద శక్తులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నమే భారత్‌ సమ్మిట్‌. రైట్‌ వింగ్‌ రాజకీయాలకు మేం విరుద్ధం. వ్యవస్థలో కొద్దిమందికే చోటు.. కొంతమందికి అసలు చోటే లేదన్న బీజేపీ బహిష్కరణ సిద్ధాంతానికి మేం వ్యతిరేకం. అందరినీ కలిపేసుకుని వెళ్లేదే మా విధానం. ప్రజాస్వామ్యంలో విభిన్న ఆలోచనలు, సిద్ధాంతాలు ఉండడం సహజం. ఒకరితో విభేదించినంత మాత్రాన వారిని దేశద్రోహులు అంటారా? రేపు మేం అధికారంలోకి వచ్చాక బీజేపీ వారిని దేశద్రోహులంటామా? ప్రభుత్వ విధానాలతో, నాయకులతో విభేదించినంత మాత్రాన వారిని దేశద్రోహులు అనడం అత్యంత దురదృష్టకరం.


కొత్త ప్రపంచ వ్యవస్థ (న్యూ వరల్డ్‌ ఆర్డర్‌) అంశంపై చర్చలో మీరు పాల్గొన్నారు. అదెలా ఉండాలి? దాని ఏర్పాటులో అతి పెద్ద సవాల్‌ ఏమిటి? భారత్‌ సమ్మిట్‌ ఎలాంటి వ్యవస్థను ప్రతిపాదిస్తోంది?

ఇప్పుడున్న ప్రపంచ వ్యవస్థ మారాలి. అధికారం ఒకటి, రెండు దేశాల రాజధానుల్లో, దేశాధినేతల దగ్గర ఉండకూడదు. ఏక ధ్రువ నుంచి బహుళ ధ్రువ ప్రపంచంవైపు వెళ్లాలి. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు తమ గొంతు వినిపించాలి. ఈ మార్పును సంఘర్షణ లేకుండా.. చర్చలతో, అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ తీసుకురావాలి. ఇందుకు అతి పెద్ద సవాలు ప్రపంచ దేశాలకు పరస్పరం నమ్మకం లేకపోవడమే. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. సంస్థలు, దేశాల మధ్య పరస్పర నమ్మకం కలిగించేలా వ్యవస్థను పునర్నిర్మించాలి. లేకపోతే ఏ వ్యవస్థా పనిచేయని అరాచకత్వం ప్రబలుతుంది. కేవలం అధికారం మీద కాకుండా న్యాయం మీద ఆధారపడిన ప్రపంచ వ్యవస్థను భారత్‌ సమ్మిట్‌ ప్రతిపాదిస్తోంది. పెద్దదైనా, చిన్నదైనా ప్రతి దేశం గొంతు వినిపించే వ్యవస్థ రావాలంటోంది. అదే వసుధైక కుటుంబం.


విదేశాంగ మంత్రిగా మీ అనుభవాన్ని బట్టి.. నెహ్రూ కాలంలోని అలీన విధానం మంచిదా? లేకుంటే ఎక్కువ దేశాలున్న ఒక కూటమితో కలిసే మల్టీ అలైన్‌మెంట్‌ విధానం మంచిదా?

మనం నిర్దిష్ట కూటమిలో చేరాలని నిర్ణయించుకుంటే దానికి సంబంధించిన నిబంధనలకు తలొగ్గాల్సి వస్తుంది. అనేక దేశాలతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ పరిమితమవుతుంది. మరోవైపు, అలీన విధానం అన్నది ఏ కూటమిలోనూ ఉండలేక.. బలవంతంగా తీసుకున్న విధానమని కొందరు అంటుంటారు. అయితే, భారతదేశం చేపట్టిన అలీనోద్యమం బలవంతం కాదు. అదో నైతిక ఎంపిక. దీనివల్లే దేశానికి తన విదేశీ విధానంలో పూర్తి స్వాతంత్య్రం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి లభించాయి. కొన్నిసార్లు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా చివరకు దేశం గొప్ప విజయాలు సాధించింది. అలీన విధానానికి నిజమైన అర్థం ఏంటంటే.. కేవలం ఒకే బృందానికి, దేశాల సముదాయానికి కట్టుబడి ఉండడం కాకుండా నైతిక విలువలను కోల్పోకుండా ఇతరుల ప్రయోజనాలను అర్థం చేసుకుంటూ స్వతంత్ర నిర్ణయాధికారాన్ని కలిగి ఉండడమే.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష

మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో మైనర్‌కు వంచన

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 03:48 AM