రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ABN , Publish Date - Nov 14 , 2026 | 03:35 AM
మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, భారత్ సమ్మిట్ వంటి ప్రభుత్వ నిర్ణయాలను బీజేపీ, బీఆర్‌ఎస్ అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాజకీయ విభేదాలను తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అడ్డంకిగా మార్చొద్దని కేటీఆర్, కిషన్‌రెడ్డి, రామచందర్‌రావులకు హితవు పలికారు.
మీ కడుపులో విషం ప్రజలపై చూపొద్దు
కేటీఆర్, కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావుపై సీఎం రేవంత్ ఫైర్
ప్రభుత్వ నిర్ణయాల్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్
రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వాటి వ్యవహారం
ప్రధాని మోదీ ఏది చేసినా కరెక్టు.. రాహుల్ చేస్తే తప్పా!?
బీఆర్‌ఎస్ అవయవ దానం చేస్తేనే కిషన్‌రెడ్డి గెలిచారు
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కిషన్‌రెడ్డి రాజకీయాలు
భారత్ సమ్మిట్‌కు వచ్చే విదేశీ ప్రతినిధుల వీసాల
తిరస్కరణకు బీజేపీ సర్కారు మూల్యం చెల్లించక తప్పదు
ట్యాపింగ్ కేసులో ఆశ్చర్యకర విషయాలు బయటికొస్తాయ్
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘‘మూసీ ప్రక్షాళన.. మెట్రో విస్తరణ.. రీజనల్ రింగ్ రోడ్డు.. తుమ్మిడిహెట్టి.. భారత్ సమ్మిట్.. ప్రజల కోసం ప్రభుత్వం ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా ముందుకెళ్లకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ కూడబలుక్కుని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నాయి. కేటీఆర్, కిషన్ రెడ్డి, రామచందర్‌రావులకు కడుపులో విషం ఉండొచ్చు. కానీ, దాన్ని తెలంగాణ ప్రజలపై చూపొద్దు’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజ్ఞత ప్రదర్శించాలని హితవు పలికారు. భారత్ సమ్మిట్‌ను భారత వ్యతిరేక సమ్మిట్ అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు.. సమ్మిట్‌తో ప్రయోజనం లేదంటూ కేటీఆర్ విమర్శించిన నేపథ్యంలో బోధి పెవిలియన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమని ప్రపంచానికి చాటిచెప్పేందుకే సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబరులో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు సన్నాహకంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, ఇప్పటికే ఢిల్లీ, చెన్నై, బెంగళూరుల్లో నిర్వహించామని, ముంబై, అహ్మదాబాద్‌ల్లో త్వరలో నిర్వహించనున్నామని వెల్లడించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశాల్లో జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ ప్రతినిధిగా ప్రతిపక్ష నేత అయిన వాజ్‌పేయీని పంపి మంచి సంప్రదాయం నెలకొల్పారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా కలిగిన రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వస్తుంటే బీజేపీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు.
‘‘ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి సదస్సులు నిర్వహిస్తారు. పాకిస్థాన్‌కు వెళ్లి నవాజ్ షరీఫ్ ఇంట్లో బిర్యానీ తింటారు. బీజేపీ నేతలకు మోదీ ఏది చేసినా కరెక్టు.. రాహుల్ గాంధీ చేస్తే తప్పా!?’’ అని నిలదీశారు. ఇది బీజేపీ నియంతృత్వ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గ్లోబల్ సమ్మిట్ సన్నాహక కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించినప్పుడు తమ ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వచ్చారని, దానిని బీజేపీ నేతలూ స్వాగతించారని, మరి, భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ వస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. బీజేపీ నేతలు ఈ ద్వంద్వ వైఖరి వీడాలన్నారు. ‘‘వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి దేశానికి రాహుల్ ప్రధాని అవుతారన్న భయం ఆ పార్టీ నేతలకు ఉండొచ్చు. వారి రాజకీయాల కోసం రాహుల్ తెలంగాణ పర్యటనను వ్యతిరేకించడం తగదు’’ అని వ్యాఖ్యానించారు.
సదస్సుకు కిషన్ రెడ్డిని ఆహ్వానించకపోవడంపై స్పందిస్తూ.. ఢిల్లీలో సన్నాహక కార్యక్రమానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను ఆహ్వానించినా హాజరు కాలేదని, ఎల్‌నినోపై అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించినా రాలేదని, అందుకే వారు తెలంగాణ లెక్కల్లో లేరని భావించామని దుయ్యబట్టారు. కిషన్ రెడ్డికి చేతనైతే భారత్ సమ్మిట్‌లో జరిగే చర్చల్లో పాల్గొనవచ్చునని, ఆయన సానుకూలంగా ఉంటే ఆహ్వానించడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పంపుతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ప్రజలైతే.. కిషన్ రెడ్డికి ఎంపీ పదవి ఇచ్చింది కేసీఆర్ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ అవయవదానం చేస్తే కిషన్‌రెడ్డి గెలిచారన్నారు.
వీసాల తిరస్కరణ సరికాదు
‘‘సదస్సుకు 70 దేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరిలో చాలా మందికి మొదట వీసాలు ఇచ్చిన కేంద్రం.. తర్వాత రద్దు చేసింది. వారిలో నార్వే జర్నలిస్టూ ఉన్నారు. ప్రశ్నించడం జర్నలిస్టు బాధ్యత. ప్రధాని మోదీని ప్రశ్నించినందుకు వీసా తిరస్కరణ సరికాదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సదస్సుకు వచ్చే ప్రతినిధుల పట్ల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యవహార శైలి ప్రపంచం మొత్తం చూసిందని, దీనికి ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. విదేశీ ప్రతినిధులకు హైదరాబాద్ నగరాన్ని ప్రత్యక్షంగా చూపించి, పెట్టుబడులకు ఎలాంటి అనుకూల విధానాలు ఉన్నాయో వివరించేందుకు భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, సదస్సులో ప్రజాస్వామిక విలువల బలోపేతంపైనా చర్చ పెట్టామని, దీనిపై కిషన్ రెడ్డి, రాంచందర్ రావు, కేటీఆర్‌లకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. సదస్సుకు వచ్చిన ప్రతి అతిథి తెలంగాణలో పెట్టుబడులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ప్రమోట్ చేస్తారన్నారు.
పెట్టుబడులు రాకుండా కిషన్ రెడ్డి కుట్రలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుజరాత్‌కు గులాంలా వ్యవహరిస్తున్నారని, కేవలం ప్రధాని మోదీని సంతృప్తి పరిచేందుకే ఆయన మాట్లాడుతున్నాడని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పెట్టుబడులు వస్తే గుజరాత్‌కు రావాలి కానీ.. తెలంగాణకు రాకూడదన్నది ప్రధాని మోదీ విధానమని, అందుకే తెలంగాణకు పెట్టుబడులు రాకుండా కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మాని.. కేంద్ర మంత్రిగా తెలంగాణకు కేంద్రం నుంచి ఎంతో కొంత తీసుకురావాలని హితవు పలికారు. సదస్సుకు వంద కోట్లు ఖర్చు పెడుతున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయనకు గడ్డం పెరిగాక తలకాయ లేకుండా పోయిందని, ఆయన వ్యాఖ్యలను సీరియ్‌సగా తీసుకోవాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు.
పాతికేళ్ల తర్వాత బీజేపీ ఉండబోదు
ఒకరు విమర్శించినంత మాత్రాన రాహుల్ గాంధీ ప్రతిష్ఠ ఏమీ తగ్గబోదని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో జరుగుతున్న వివిధ ర్యాలీల్లో ఆయన్ను ప్రజలు ఎలా ఆదరిస్తున్నదీ.. మోదీ ఎలా తప్పుకుని తిరుగుతున్నదీ అందరూ చూస్తున్నారన్నారు. ‘‘రాహుల్ భారత్ జోడో యాత్ర భారతీయుల ఆత్మ. దానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రతినిధి. రాహుల్ గాంధీ ప్రజల హృదయాల్లో ఉన్నారు. భారత్ సమ్మిట్ ద్వారా ఆయన్ను లాంచ్ చేయాల్సిన అవసరం లేదు’’ అని వివరించారు. దేశంలో ఉన్న అనేక పార్టీల్లో బీజేపీ ఒకటని, 50 ఏళ్ల కిందట పుట్టిన ఆ పార్టీ.. పాతికేళ్ల తర్వాత ఉండబోదని జోస్యం చెప్పారు. స్వాతంత్రానికి మునుపే పుట్టిన కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఉందని, ఇక ముందూ కొనసాగుతుందని అన్నారు.
బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే మా లక్ష్యం: సీఎం
రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్‌అన్నారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం నివాళులర్పించి, రాష్ట్రంలోని బాలబాలికలందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆశ్చర్యకర విషయాలు బయటికి..
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పూర్తి కావస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడబోతున్నాయని చెప్పారు.
రాహుల్ చేతుల మీదుగా గిగ్ వర్కర్లకు పాలసీ
రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు గిగ్ వర్కర్లను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఒక పాలసీని రూపొందించిందని, దానిని గిగ్ వర్కర్లకు అంకితం ఇచ్చేందుకు రాహుల్ గాంధీని ఆహ్వానించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్ గాంధీ.. గిగ్ వర్కర్లను కలిసి ఆ పాలసీని వారికి అంకితం ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే భారత్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో సందేశాన్నీ ఇస్తారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘సర్’ పేరుతో మైనారిటీలు, దళితులు, పేదల ఓట్లను మోదీ సర్కార్ తొలగిస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో మైనర్‌కు వంచన
ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News