నోట్లో పేలిన నాటు బాంబు.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
ABN , Publish Date - Nov 14 , 2026 | 07:53 AM
ఓ వ్యక్తి నోట్లో నాటు బాంబు పేలి మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్నేహితుడు ఇచ్చిన బాంబును రసగుల్లా అనుకుని కొరకడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
మధ్యప్రదేశ్: ఓ యువకుడి నోట్లో నాటు బాంబు పేలి మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్నేహితుడు ఇచ్చిన బాంబును రసగుల్లా అనుకుని కొరకడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో చోటుచేసుకోగా.. స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాంబు ఇచ్చిన వ్యక్తితో పాటు మరొకరిని అరెస్టు చేశారు.
రాజేంద్ర బరోటియా అనే వ్యక్తి దిండోరి జిల్లా పడరియా ఛాంతాలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. చలికాలం కావడంతో నవంబర్ 10న రాత్రి తన ఇంటి ఆవరణలో చలిమంట వేసుకున్నాడు. దీంతో ఇరుగుపొరుగు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన రాంభగత్ బరోటియా అక్కడికి వెళ్లాడు. అందరూ సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో రాజేంద్రకు రాంభగత్ రసగుల్లా అని చెప్పి ఓ వస్తువును అందించాడు. దీంతో అతను వెంటనే దానిని తినేందుకు ప్రయత్నించాడు. దానిని కొరికిన వెంటనే అది నోట్లోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో యువకుడి ముఖం, దవడ భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆటోలో దిండోరి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
అయితే, చికిత్స పొందుతూ రాజేంద్ర ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అది స్వీటు కాదని, అడవి పందులను చంపేందుకు ఉపయోగించే నాటు బాంబుగా తేల్చారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు అడవి పందులను వేటాడేందుకు ఇలాంటి బాంబులను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, రాంభగత్‌కు ఈ బాంబును మరో వ్యక్తి ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో రాంభగత్ బరోటియాతో పాటు బాంబు ఇచ్చిన వ్యక్తినీ అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే, రాజేంద్రకు బాంబును సరదాగా ఇచ్చారా? లేక అతడిని హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశారా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఈ మేరకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మేక్ ఇన్ ఇండియా’ కాదు.. ‘బ్రేక్ ఇన్ ఇండియా’
కేరళంలో షాకింగ్ ఘటన.. ప్రియుడిని హత్య చేసేందుకు ప్రియురాలి యత్నం..