కేరళంలో షాకింగ్ ఘటన.. ప్రియుడిని హత్య చేసేందుకు ప్రియురాలి యత్నం..
ABN , Publish Date - Nov 14 , 2026 | 07:06 AM
కేరళంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడిని వదిలించుకోవాలనే ఉద్దేశంతో అతడిని కిడ్నాప్ చేసి హత్యాయత్నానికి పాల్పడింది ఓ యువతి. స్నేహితుల సహకారంతో ఇద్దరు నేరగాళ్లతో యువకుడిపై దాడి చేయించింది.
తిరువనంతపురం: కేరళంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడిని వదిలించుకోవాలనే ఉద్దేశంతో అతడిని కిడ్నాప్ చేసి హత్యాయత్నానికి పాల్పడింది ఓ యువతి. స్నేహితుల సహకారంతో ఇద్దరు నేరగాళ్లతో యువకుడిపై దాడి చేయించింది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు మహిళలు సహా ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పాలక్కాడ్ జిల్లా పట్టాంబికి చెందిన సఫానా (19) తన ప్రియుడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం స్నేహితుల సహాయం కోరగా.. వారూ అంగీకరించారు. పథకంలో భాగంగా యువకుడిని అర్ధరాత్రి సమయంలో తిరూరుకు రప్పించారు. తన ప్రియురాలిని కలుసుకోవచ్చనే నమ్మకంతో అతడు అక్కడికి వెళ్లాడు. నిందితుల్లో ఒకరు యువకుడిని ద్విచక్రవాహనంపై మరో ప్రాంతానికి తీసుకెళ్లగా.. అక్కడ అప్పటికే మిగతావారు సిద్ధంగా ఉన్నారు. అక్కడికి చేరుకున్న అతడిని బలవంతంగా కారులోకి ఎక్కించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. యువకుడు తీవ్రంగా గాయపడటంతో తిరూరులోని తాళెపాలం నది ఒడ్డున వదిలేసి పారిపోయారు. ఈ క్రమంలో అతడి మొబైల్ ఫోన్‌నూ లాక్కున్నారు.
అయితే, తీవ్ర గాయాలతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో తిరూర్ ఇన్‌స్పెక్టర్ జలీల్ కరుతేడత్ నేతృత్వంలోని పోలీసు బృందం రంగంలోకి దిగింది. బుధవారం తెల్లవారుజామున తాళెపాలం సమీపంలో నిందితులు సఫానా (19) సహా నదియా (20), రబీబా (25), ఇర్షాద్ (28), అజరుద్దీన్ (25)లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తిరూర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా.. వారిని న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
నిందితులు ఇర్షాద్, అజరుద్దీన్‌లపై గతంలోనూ పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హత్యాయత్నం, దాడులకు సంబంధించిన కేసుల్లో వారు నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. గతంలో వారు జైలు శిక్షా అనుభవించారని పేర్కొన్నారు. అయితే, ప్రియుడిని ఎందుకు హత్య చేయాలని యువతి భావించిందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ వార్తలు కూడా చదవండి
నాలుగేళ్ల తర్వాత ఆ ల్యాప్‌టాప్ మీకే..!
మేక్ ఇన్ ఇండియా’ కాదు.. ‘బ్రేక్ ఇన్ ఇండియా’