షుగర్ ముప్పు.. మేల్కోకుంటే తప్పదు మూల్యం
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:10 AM
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో హైదరాబాద్లో మధుమేహంపై ఆందోళన పెరుగుతోంది. తెలంగాణలో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 24.5 శాతం, మహిళల్లో 19.6 శాతం మందికి రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నట్లు లేదా నియంత్రణకు మందులు వాడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. లక్షణాలు లేకున్నా వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మారిన జీవనశైలి.. ఆహారపు అలవాట్లతో ప్రమాదం
హైదరాబాద్లో పెరుగుతున్న మధుమేహ భారం
లక్షణాలు కనిపించకపోయినా పరీక్షలు తప్పనిసరి
నియంత్రణలో ఆహారం, వ్యాయామమే కీలమంటున్న డాక్టర్లు
హైదరాబాద్ సిటీ: చూడటానికి చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంటారు. రోజువారీ పనుల్లోనూ చురుగ్గానే ఉంటారు. ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవడంతో ఆరోగ్య పరీక్షలు ఎందుకు అనే ధోరణి. తీరా నీరసంగా ఉందని హాస్పిటల్కు వెళ్తే... మధుమేహం ఉన్నట్లు తేలుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు చాలాకాలం అదుపులో లేకపోతే అప్పటికే కిడ్నీలు, కళ్లపై ప్రభావం పడే ప్రమాదమూ ఉంటుంది. ఇదిగో ఈ తరహా లక్షణాలు ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కువగానే కనబడుతున్నాయంటున్నారు డాక్టర్లు. అంతేనా, మధుమేహం విషయంలో లక్షణాల కోసం ఎదురుచూడకుండా ముందుగానే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.
జీవనశైలితో పెరుగుతున్న ముప్పు
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మధుమేహం ముప్పును పెంచుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎ్ఫహెచ్ఎ్స-6) గణాంకాలు ప్రకారం తెలంగాణలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పురుషుల్లో 24.5 శాతం మందికి, మహిళల్లో 19.6 శాతం మందికి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నట్లు లేదా మధుమేహ నియంత్రణకు మందులు వాడుతున్నట్లు వెల్లడైంది. ఈ గణాంకాలు మధుమేహంపై అవగాహన, ముందస్తు పరీక్షల అవసరాన్ని గుర్తుచేస్తున్నాయని అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టైల్ లిమిటెడ్లో కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఎరుకులపాటి అన్నారు.
టైప్- 2 మధుమేహ ముప్పును పెంచే ప్రమాద కారకాలుగా అభివర్ణించిన ఆయన, రోజువారీ జీవితంలో చేసుకునే చిన్న చిన్న మార్పులతో బయట పడొచ్చని పేర్కొంటున్నారు. నగరంలోని ఈఎ్సఐసీ ఆసుపత్రి నిర్వహించిన ఒక అధ్యయనంలో టైప్- 2 మధుమేహంతో బాధపడుతున్న 200 మంది రోగుల్లో వ్యాధిపై అవగాహన, స్వీయ నిర్వహణ పద్ధతులను పరిశీలించారు. ఒత్తిడి, ఆహారం, జీవనశైలి వంటి అంశాలను మధుమేహానికి దోహదపడే కారకాలుగా రోగులు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.
లక్షణాల కోసం ఎదురుచూడాలా?
మధుమేహం ప్రారంభ దశలో చాలామందికి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. దాహం ఎక్కువగా వేయడం, తరచూ మూత్ర విసర్జన, అలసట, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపించినా వాటిని ఇతర కారణాలుగా భావించి నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. అందుకే లక్షణాలు కనిపించినప్పుడే పరీక్షలు చేయించుకోవాలనే ధోరణి సరికాదని వైద్యులు చెబుతున్నారు. వయసు, బరువు, కుటుంబంలో మధుమేహ చరిత్ర వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వైద్యుల సూచన మేరకు రక్తంలో చక్కెర స్థాయులను పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
రంగారెడ్డి డీఎంహెచ్వో హెల్త్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News