షెడ్లో డబుల్ డెక్కర్.. నిలిచిన సేవలు
ABN , Publish Date - Oct 17 , 2026 | 10:14 AM
గ్రేటర్ హైదరాబాద్‌లోని డబుల్ డెక్కర్ బస్సులు నిలిచిపోయాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఎంతో మంది సందర్శకులకు ఉపయోగపడిన ఈ బస్సులు షెడ్‌కు పరిమితమయ్యాయి.
పండుగ సెలవుల్లో సందర్శకుల ఇబ్బందులు
టూరిజానికి అప్పగించిన హెచ్ఎండీఏ
నిర్వహణ చేపట్టడంలో పర్యాటక శాఖ విఫలం
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ హైదరాబాద్‌లోని డబుల్ డెక్కర్ బస్సులు నిలిచిపోయాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఎంతో మంది సందర్శకులకు ఉపయోగపడిన ఈ బస్సులు షెడ్‌కు పరిమితమయ్యాయి. గత నెల పర్యాటక దినోత్సవం నుంచి నిర్వహణ చేపడుతామని ప్రకటించిన టూరిజం డిపార్ట్మెంట్ ఆ దిశగా చర్యలు చేపట్టడంలో విఫలమైంది. దాంతో నెల రోజులుగా డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కడం లేదు. పండుగ సెలవుల్లో నగరాన్ని సందర్శించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ డబుల్ డెక్కర్ బస్సులు తప్పా.. మిగతావి తిరగవు. వాటిని కూడా నిలిపివేయడంతో రవాణా మార్గాలు లేక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు.
రూ.12.96కోట్ల వ్యయంతో..
చారిత్రక నేపథ్యం కలిగిన మహా నగరంలో డబుల్ డెక్కర్ బస్సులకు ప్రాధాన్యత ఉన్నది. నిజాం కాలం నుంచి 2013 వరకు ఇవి అందుబాటులో ఉండేవి. పాత వాటికి పర్మిట్ తీరడంతో నాలుగేళ్ల క్రితం హెచ్ఎండీఏ ఆరు ఎలక్ర్టికల్ డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చింది. ఒక్కో బస్సుకు రూ.2.16కోట్ల చొప్పున మొత్తం రూ.12.96కోట్ల మేర వెచ్చించింది. ఆ బస్సుల నిర్వహణను ఏడేళ్ల పాటు విక్రయించిన సంస్థయే చేపట్టనుంది. ఒక్కో బస్సులో డైవర్‌తో పాటు 65మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉన్నది.
నగరంలోని పర్యాటక స్థలాలైనా ట్యాంక్‌బండ్, అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్, నాంపల్లి రైల్వేస్టేషన్, మోజాంజాహీ మార్కెట్, ఎంజీబీఎస్, ఉస్మానియా హాస్పిటల్, చార్మినార్, మక్కా మసీదు, ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు బస్సులు నడిచేవి. ఐటీ కారిడార్, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల సందర్శనకు వీలుగా డబుల్ డెక్కర్ బస్సులను మూడు మార్గాల్లో తిప్పేవారు. వీటిలో ప్రయాణికులు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. హెచ్ఎండీఏ నిర్వహణలో మెరుగ్గానే డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి.
టూరిజం శాఖకు అప్పగించడంతో..
డబుల్ డెక్కర్ బస్సులు హుస్సేన్‌సాగర్ తీరాన గల సంజీవయ్య పార్కు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక షెడ్లో ఉంటాయి. అక్కడే చార్జింగ్ పెడతారు. వీటి నిర్వహణను ఇటీవల హెచ్ఎండీఏ నుంచి టూరిజం శాఖ తీసుకున్నది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని గత నెల 27 నుంచి హెచ్ఎండీఏకు చెందిన ఆరు డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని టూరిజం శాఖ అధికారులు ప్రకటించారు. డబుల్ డెక్కర్ బస్సులకు ప్రస్తుతమున్న ఎరుపు రంగును మార్పు చేసి హైదరాబాద్ మహా నగర అందాల స్టిక్కర్లు అంటించారు. హైదరాబాద్ పర్యాటక విశిష్టతను తెలియజేసేవిధంగా తీర్చిదిద్దారు. కానీ వరల్డ్ టూరిజం డే రోజున బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చి పర్యాటకులను అలరిస్తాయనుకుంటే ఒక్కటీ రోడ్డెక్కలేదు. సంజీవయ్య పార్కు వద్ద షెడ్లోనే డబుల్ డెక్కర్ బస్సులు పరిమితమయ్యాయి.
నిర్వహణలో విఫలం
ఎలాంటి వ్యయ ప్రయాసలు లేని డబుల్ డెక్కర్ బస్సులను రోడ్డెక్కించడంలో పర్యాటక శాఖ విఫలమైంది. గత నెల 27న పర్యాటక దినోత్సవం కాగా.. డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకురాలేదు. సాధారణంగా అక్టోబర్ నెల నుంచే పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తుంటారు. బతుకమ్మ, దసరా ఉత్సవాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలకు ఈ నెల 10వ తేదీ నుంచి సెలవులు ప్రకటించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలవారు నగరాన్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరగాని భావించినవారికి నిరాశ ఎదురవుతోంది. బస్సులు లేకపోవడంతో సందర్శకులకు వ్యయ భారాలవుతున్నాయి. సచివాలయం నుంచి అతిపెద్ద జాతీయ జెండా గల సంజీవయ్య పార్కుకు వెళ్ళేందుకు నలుగురు కలిగిన కుటుంబానికి రూ.400 నుంచి రూ.600 వరకు ఖర్చవుతున్నాయి. సెలవుల నేపథ్యంలో ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
రంగారెడ్డి డీఎంహెచ్‌వో హెల్త్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News