Share News

యువత నిరసనలపై నివేదిక.. ఐక్యరాజ్యసమితికి భారత్ కౌంటర్..

ABN , Publish Date - Oct 17 , 2026 | 09:54 AM

మానసిక ఆరోగ్యం, లింగ సమానత్వం గురించి పోరాడుతున్నందుకు భారత్‌లో యువత వివక్ష ఎదుర్కొంటున్నట్లు నివేదిక సమర్పించిన యూఎన్‌ ప్రతినిధి గినా రొమెరోకి భారత్ కౌంటర్ ఇచ్చింది.

యువత నిరసనలపై నివేదిక.. ఐక్యరాజ్యసమితికి భారత్ కౌంటర్..
Anuj Swarup, Gina Romero

ఇంటర్నెట్ డెస్క్: మానసిక ఆరోగ్యం, లింగ సమానత్వం గురించి పోరాడుతున్నందుకు భారత్‌లో యువత వివక్ష ఎదుర్కొంటున్నట్లు నివేదిక సమర్పించిన యూఎన్‌ ప్రతినిధి గినా రొమెరోకి భారత్ కౌంటర్ ఇచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు సమర్పించిన, ధ్రువీకరించని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని భారత దౌత్యవేత్త అనుజ్ స్వరూప్ పేర్కొన్నారు. ఆ నివేదికను 'ఐక్యరాజ్యసమితి నివేదిక రూపంలో ఉన్న పుకార్లు'గా అభివర్ణించారు. అక్టోబర్ 16న న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం మూడో కమిటీ చర్చల్లో భారత్ ఈ అభ్యంతరాలను వ్యక్తం చేసింది (India rejects UN report).


ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి, కొలంబియాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త జీనా రొమెరో తాజాగా ఓ నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో భారత్‌లో యువత ఎదుర్కొంటున్న పరిస్థితులపై ప్రస్తావన ఉంది. మానసిక ఆరోగ్యం, లింగ న్యాయం వంటి అంశాలపై చర్చించిన యువత ప్రతీకార చర్యలు లేదా సామాజిక వివక్షను ఎదుర్కొన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ఆ నివేదికపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత రాజ్యాంగంలోని 19వ అధికరణం పౌరులకు భావప్రకటన స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కులతో పాటు ఇతర స్వేచ్ఛలను కల్పిస్తుందని అనుజ్ స్వరూప్ గుర్తుచేశారు (Youth protests India).


భారత్‌లో యువత తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, రాజకీయ ఉద్యమాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయని అనుజ్ పేర్కొన్నారు. యువత ఏర్పాటు చేసిన వ్యంగ్య రాజకీయ వేదిక ‘కాక్రోచ్ జనతా పార్టీ’ గురించి ప్రస్తావించారు. ఈ వేదికకు చెందిన ప్రతినిధులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని, అనంతరం కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ నాయకులతో చర్చలు జరిపారని గుర్తుచేశారు. అలాగే పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలపై ప్రభుత్వం స్పందించి వారితో చర్చలు జరిపిందని అనుజ్ స్వరూప్ తెలిపారు (Anuj Swarup United Nations).


నివేదికలు రూపొందించే సమయంలో సమాచారాన్ని ధ్రువీకరించడం, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరమని భారత్ స్పష్టం చేసింది (Indian youth rights). గుర్తుతెలియని వ్యక్తులు సమర్పించిన సమాచారంతో 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలోని పరిస్థితులపై నిర్ణయాలకు రావడం సరికాదని అనుజ్ స్వరూప్ అన్నారు. ఈ నివేదిక పూర్తిగా పుకార్లను ఆధారంగా చేసుకుని రూపొందిందని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


ఐదు రోజులకే పదవి పోయింది.. ట్రంప్ సంచలన నిర్ణయం!

Updated Date - Oct 17 , 2026 | 11:14 AM