Share News

చూసుకో పదిలంగా..

ABN , Publish Date - Sep 29 , 2026 | 01:31 PM

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, ఒత్తిడి, పొగతాగడం, మద్యం సేవించడం వంటి కారణాలతో చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి.

చూసుకో పదిలంగా..
World Heart Day

  • కరీంనగర్‌లో పెరుగుతున్న గుండె జబ్బుల బాధితులు

  • చిన్న వయసులోనే ముప్పు..

  • జీవనశైలిలో మార్పులతోనే రక్షణ

  • నేడు ప్రపంచ హృదయ దినోత్సవం

కరీంనగర్: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, ఒత్తిడి, పొగతాగడం, మద్యం సేవించడం వంటి కారణాలతో చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఒకప్పుడు 50 నుంచి 60 ఏళ్ల వయసులో ఎక్కువగా కనిపించే గుండె జబ్బులు ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల వారిలోనూ గుర్తి స్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుండెను కాపాడుకోవాలంటే ముందస్తు జాగ్రత్తలే కీలకమని సూచిస్తున్నారు.


ప్రతి ఏడాది సెప్టెంబరు 29న వరల్డ్‌ హార్ట్‌ డే నిర్వహిస్తా రు. గుండె సంబంధిత వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పిం చడం, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. కరీంనగర్‌ జిల్లాలోనూ గుండె సమస్యలతో ఆసుపత్రులను ఆశ్రయించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గంటల తరబడి కూర్చోవడం, వ్యా యామానికి సమయం కేటాయించకపోవడం, ఫాస్ట్‌ఫుడ్‌, అధిక ఉప్పు, కొవ్వు పదార్థాలు తీసుకోవడం, నిద్రలేమి వంటి అంశాలు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


అన్ని వయసుల వారికి గుండె జబ్బులు

  • డాక్టర్‌ అనిష్‌ పబ్బా, కార్డియాలజిస్ట్‌, మెడికవర్‌ హాస్పిటల్స్‌, కరీంనగర్‌

గుండె సంబంధిత వ్యాధులు వయసుతో మాత్రమే ముడిపడి ఉండవు. ప్రస్తుతం చిన్న వయసులోనూ అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌, ఊబకాయం, ఒత్తిడి వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ గుండెపై ప్రభావం చూపే ప్రధాన కారకాలు. ముఖ్యంగా ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయ కూడదు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు రక్తపోటు, షుగర్‌, కొలె స్ట్రాల్‌ను నియంత్రణలో ఉం చుకోవాలి. గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని, అవ సరమైనప్పుడు ముందస్తుగా వైద్యులను సంప్రదించడం ద్వారా అనేక సమ స్యలను నివారించ వచ్చు.


గుండె జబ్బులకు ప్రధాన కారణాలు..

- అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌, అధిక బరువు, ఊబకాయం,పొగతాగడం, పొగాకు ఉత్పత్తుల వినియోగం

- మద్యం అధికంగా సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, ఆందోళన, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర


heart1.jpgగుండెను పదిలంగా ఉంచుకోవాలంటే..

రోజువారీ జీవితంలో శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇవ్వాలి. నడక, వ్యాయామాన్ని అలవాటుగా చేసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, నూనె, కొవ్వు పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తిగా మానేయాలి. మద్యానికి దూరంగా ఉండడంతో పాటు తగినంత నిద్రపోవాలి. ఒత్తిడిని నియంత్రించుకోవాలి.


ఏటా ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి..

గుండె జబ్బులు వచ్చే వరకు వేచి చూడకుండా ముందు గానే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం.

30 ఏళ్లు దాటిన వారు రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి.


లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు...

ఛాతిలో అకస్మాత్తుగా నొప్పి లేదా బిగుతుగా మారడం, ఎడమ చేయి లేదా దవడ వైపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, విపరీతమైన చెమటలు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం పొందాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి.. అధిష్ఠానానికి ఆరుగురి పేర్లు

సచివాలయ ఉద్యోగులకు 15వేలకు పైగా ప్రమోషన్లు ఇచ్చాం: మంత్రి డోలా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 29 , 2026 | 01:31 PM