Share News

సచివాలయ ఉద్యోగులకు 15వేలకు పైగా ప్రమోషన్లు ఇచ్చాం: మంత్రి డోలా

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:16 PM

ఏపీలో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎటువంటి సర్వీస్ రూల్స్ లేకుండా 1.24 లక్షల మందిని నియమించి నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

సచివాలయ ఉద్యోగులకు 15వేలకు పైగా ప్రమోషన్లు ఇచ్చాం: మంత్రి డోలా
Dola Bala Veeranjaneya Swamy

అమరావతి, సెప్టెంబర్ 29: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎటువంటి సర్వీస్ రూల్స్ లేకుండా 1.24 లక్షల మందిని నియమించి నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సచివాలయ వ్యవస్థను, ఉద్యోగుల సర్వీసులను స్ట్రీమ్‌లైన్ చేస్తున్నామని వెల్లడించారు. సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 15,000కు పైగా ప్రమోషన్లు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 6 సంవత్సరాల స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్‌కు అనుమతి ఇచ్చామని.. దీనివల్ల ప్రభుత్వంపై రూ.150 కోట్ల ఆర్థిక భారం పడుతోందని చెప్పారు.


ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (AAS), వేగవంతమైన క్యాజువల్ లీవ్ (CL) మంజూరు విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతినెల 2, 4వ బుధవారాల్లో డైరెక్టర్ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన సేవలు అందించడమే జీవో 11 ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తున్నప్పటికీ ధర్నాలు చేయడం, అమానవీయంగా వ్యవహరించడం వెనుక ఉన్న శక్తులు ఎవరని ప్రశ్నించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ప్రభుత్వ నిర్ణయాలను, పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని తెలిపారు.


ఉద్యోగులను రెచ్చగొడుతూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలోనే ప్రమోషన్ ఛానల్స్, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, సెలవుల సదుపాయాలు కల్పించామన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్, కేడర్ మార్పులపై గతంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై ఇప్పటికే చర్చలు జరిపి పలు అంశాలను పరిష్కరించామని తెలిపారు. విపత్తులు, అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవ చేయడం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత అని అన్నారు. విజయవాడ ధర్నా సందర్భంగా బందోబస్తులో ఉన్న సీఐ విధుల్లో చనిపోతే కడప జిల్లాకు చెందిన ఉద్యోగుల వాట్సాప్ అకౌంట్లో కొందరు మాట్లాడిన మాటలు అమానవీయంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆ వాట్సాప్ ఎకౌంట్ చాట్‌ను మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మీడియా ముందు ప్రదర్శించారు.


ఇవి కూడా చదవండి...

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి.. అధిష్ఠానానికి ఆరుగురి పేర్లు

ఏపీ SIRలో 99.96 శాతం నోటీసుల విచారణ పూర్తి.. ఇంకా 1,665 పెండింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 29 , 2026 | 12:23 PM