వామ్మో జ్వరం!
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:44 AM
ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా జ్వరాల వ్యాప్తి పెరిగింది. జ్వర పీడితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
వాతావరణ మార్పులతో ప్రబలుతున్న జ్వరాలు
ఆస్పత్రికి పెరిగిన పీడితులు
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
ఆంధ్రజ్యోతి, ధర్మవరం(అనంతపురం)
ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా జ్వరాల వ్యాప్తి పెరిగింది. ధర్మవరంలో విజృంభిస్తున్నాయి. జ్వర పీడితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. రోజువారీ ఓపీలో వారే అధికంగా ఉంటున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతోపాటు టైఫాయిడ్ కూడా సోకుతోంది. పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి జ్వర పీడితుల తాకిడి పెరిగింది. ఆస్పత్రి ఓపీ (అవుట్ పేషెంట్)కి రోజూ 700 దాకా వచ్చేవారు. ఇటీవల జ్వర పీడితుల సంఖ్య పెరగడంతో ఓపీ 1200 మంది వస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు. సోమవారం 1,400కి చేరుతోందంటున్నారు. అడ్మిషన్ కూడా ఎక్కువ మంది అవుతున్నారు.
ఆస్పత్రికి క్యూ
ధర్మవరం ఏరియా ఆస్పత్రికి ధర్మవరం పట్టణం, రూరల్ ప్రాంతాలతోపాటు చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి, బత్తలపల్లి మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు కూడా వైద్యసేవల కోసం వస్తుంటారు. వారం రోజులుగా వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రజలుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. కొందరికి టైఫాయిడ్ నిర్ధారణ అవుతోంది. రోజుకు 120-150 మంది రక్తపరీక్షలు చేయించుకుంటున్నారు. జ్వరాల వార్డు నిండిపోయింది.
నివారణ చర్యలు శూన్యం
జ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాంటివేవీ క్షేత్రస్థాయిలో తీసుకోవట్లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాల్సి ఉంది. ప్రధాన రహదారుల్లో మాత్రమే చేస్తున్నారని పట్టణ వాసులు వాపోతున్నారు. మురుగు కాలువలను నిత్యం శుభ్రం చేయాలి. స్ర్పేయింగ్ కూడా చేయాలి. దానిని పూర్తిగా అటకెక్కించారన్న వాదనలున్నాయి. దీంతో జ్వరాల వ్యాప్తికి అడ్డుకట్ట పడట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వైరల్ ఫీవర్ వస్తే ఐదు రోజులపాటు ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం వచ్చిన వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికిగానీ, ఆరోగ్య ఉప కేంద్రానికిగానీ వెళ్లి చికిత్సలు చేయించుకోవాలి. దోమతెరలు వినియోగించాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. వేడిగా ఆహారం తీసుకోవాలి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు భుజించవద్దని వైద్యులు చెబుతున్నారు. జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని స్పష్టం చేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ ఫీవర్, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. తుమ్మేటపుడు, దగ్గేటపుడు నోరు, ముక్కును రుమాలుతోగానీ, మోచేతితోగానీ కప్పుకోవాలి. తగినంత నీరు తాగాలి. పోషకాహారం తీసుకోవాలి. సరిపడా విశ్రాంతి తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వైరల్ ఫీవర్‌ను అరికట్టవచ్చు.
- తిప్పేంద్రనాయక్, సూపరింటెండెంట్, ధర్మవరం ఏరియా ఆస్పత్రి
ఈ వార్తలు కూడా చదవండి:
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే.
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News