ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:41 AM
హైదరాబాద్ నగర శివారులోని ఓఆర్‌ఆర్‌పై కాల్పుల ఘటన కలకలం రేపింది. నల్గొండ సీసీఎస్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీకాంత్‌ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన బొంగులూరు గేట్ సమీపంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్, జులై 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర శివారులోని ఓఆర్‌ఆర్‌పై కాల్పుల ఘటన కలకలం రేపింది. నల్గొండ సీసీఎస్ (CCS) పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీకాంత్‌ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన బొంగులూరు గేట్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల సమాచారం మేరకు.. నల్గొండ సీసీఎస్ పోలీసులు చాలాకాలంగా పరారీలో ఉన్న ఓ నేరస్థుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతడిని గుర్తించిన పోలీసులు బొంగులూరు గేట్ వద్ద అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూసిన నిందితుడు తప్పించుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతడిని అదుపులోకి తీసుకునే క్రమంలో కాల్పులు జరిపారు.
అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సంఘటన స్థలానికి అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నియంత్రించారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. చోరీలు, దోపిడీలు, ఇతర నేర కార్యకలాపాలకు సంబంధించిన కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఓఆర్‌ఆర్ వంటి అత్యంత రద్దీ రహదారిపై కాల్పులు జరగడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. ఘటన సమయంలో అటువైపు వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఈ కాల్పులు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
నిందితుడు శ్రీకాంత్‌పై వందకు పైగా కేసులు..
పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ నిందితుడు శ్రీకాంత్‌కి వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతడిపై హత్య, చోరీలు, దోపిడి, వందకు పైగా కేసులు ఉన్నాయి. ఏపీలో 2007లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన కానిస్టేబుల్ హత్య కేసులో ఏ2గా శ్రీకాంత్ ఉన్నాడు. అతనితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొంగులూరు గేట్ ఎగ్జిట్ నంబర్- 12 దగ్గర ఓ డీసీఎం వాహనంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు వెళ్లగా నల్గొండ సీసీఎస్ పోలీసులపై వారు కత్తితో దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం గాల్లోకి పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత కంట్రోల్ కోసం నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ ఘటనలో సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. శ్రీకాంత్ అరెస్టుతో పాటు పాత కేసులు, ఇతర నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోల కలకలం
విద్యార్థులకు ఊరట.. ఫీజువసూళ్లపై హైకోర్టు స్టే కొనసాగింపు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News