చరిత్ర పుటల్లోకి ఉపాధి హామీ!
ABN , Publish Date - Jul 01 , 2026 | 10:59 AM
కూలీలకు అన్నంపెట్టిన ఉపాధి హామీ కనుమరుగు కానుంది. పథకం పేరు మారనుంది.
నేటితో ముగింపు
రేపట్నుంచి వీబీజీ రామ్‌జీ అమలు
తగ్గనున్న కేంద్రం వాటా
రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం
వేతనం ఆలస్యమైతే పరిహారం
శింగనమల(అనంతపురం): కూలీలకు అన్నంపెట్టిన ఉపాధి హామీ కనుమరుగు కానుంది. పథకం పేరు మారనుంది. వీబీజీరామ్‌జీ పేరుతో రెండో తేదీ నుంచి అమలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించి ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2006లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టుంది. మరో 24 గంటల్లో ఈ పథకం కాలం ముగియనుంది. నింబంధనలు మార్చి కేంద్రం ప్రభుత్వం వీబీజీరామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవిక మిషన్) పేరుతో అమలు చేయనుంది. ఉపాధి హామీ పథకానికి కేంద్రం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను సమకూర్చేవి. వీబీజీరామ్‌జీకి కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించనున్నాయి. ఈలెక్కన రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం అదనంగా భరించాల్సి ఉంటుంది.
రేపు ప్రారంభం
ఉపాధి హామీ పథకం అమలుతో వలసలు తగ్గాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. వీబీజీరామ్‌జీ పేరుతో దేశవ్యాప్తంగా బుధవారం అమలులోకి రానుంది. రాష్ట్రంలో మాత్రం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జూలై 2వ తేదీన పథకాన్ని తిరుపతిలో ప్రారంభించనున్నారు. అదేరోజు జిల్లాలో కొత్త పథకం అమలులోకి రానుంది.
వేతనం ఆలస్యమైతే పరిహారం
ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనాలు ఆలస్యమయ్యేవి. ఒక్కోసారి నెలలు గడిచినా డబ్బులు జమయ్యేవి కావు. నూతన పథకంలో వేతనాలు ఆలస్యమైతే కూలీలకు పరిహారం చెల్లించనున్నారు. పనిచేసిన తరువాత 15 రోజుల్లో కూలీల బ్యాంకు ఖాతాల్లో వేతనం జమ చేయనున్నారు. అలస్యమైతే పరిహారం ఇవ్వనున్నారు. గతంలో కాకుండా ప్రతి కుటుంబానికి 125 రోజులు పని దినాలు కల్పించనున్నారు.
మూడుగా విభజించి...
వీబీజీరామ్‌జీ పథకాన్ని మూడుగా విభజించారు. ఏ, బీ, సీగా అమలు చేయనున్నారు. పనుల్లో పారదర్శకత పెంచడడంతోపాటు అరు నెలలకోసారి సామాజిక తనిఖీలు చేయనున్నారు. వేతనాల చెల్లింపు వివరాలను బహిరంగంగా వెల్లడించనున్నారు. ఫిర్యాదుల స్వీకరణకు సరికొత్త వ్యవస్థలను వినియోగంలోకి తీసుకురానున్నారు.
కూలీలకు మేలు: భాగ్యలక్ష్మి, ఏపీవో, శింగనమల
వీబీజీరామ్‌జీతో ఉపాధి కూలీలకు మేలు చేకూరనుంది. పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచారు. రెండో తేదీ నుంచి పథకం అమలులోకి రానుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే.
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News