మన కులపోళ్ల ఓట్లెన్ని?
ABN , Publish Date - Feb 09 , 2026 | 09:51 AM
మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారం పతాక స్థాయికి చేరింది. సోమవారం సాయంత్రానికి అధికారికంగా ప్రచారం ముగించాల్సి ఉండడంతో మునిసిపాలిటీల్లో ప్రచార సభలు జోరందుకున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యే, పార్టీల అధ్యక్షులు ఆదివారం ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లును ఓట్లు అభ్యర్థించారు..
సామాజికవర్గాల వారీగా మంతనాలు
గంపగుత్తగా వేసుకునేందుకు ప్రయత్నాలు
కుల పెద్దలతో నేతల సంప్రదింపులు
ముందస్తు హామీలు.. నజరానా ప్రకటన
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం (Municipal Polls) ఉధృతమవుతోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న తరుణంలో నేతలు వారి అనుచరులను రంగంలోకి దింపుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించడంలో మునిగి తేలుతున్నారు.
(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ అర్బన్)
సామాజికవర్గాలవారీగా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు మంతనాలు మొదలుపెట్టారు. కులపెద్దలను రహస్యంగా సంప్రదింపులు చేస్తున్నారు. వార్డులవారీగా ఓటర్లలో ఎక్కువ ప్రాబల్యం కలిగిన సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. అభ్యర్థులు ఆయా సామాజికవర్గాలను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఓటరు జాబితాలో ఏఏ సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయో పరిశీలిస్తున్నారు.
ప్రత్యేక టీంల ఏర్పాటు
గెలుపోటములను నిర్ధారించే సామాజిక అంశాలపై అభ్యర్థులు దృష్టి కేంద్రీకృతం చేశారు. సామాజికవర్గాల వారీగా బలమైన ఓటుబ్యాంక్, నాలుగుకంటే ఎక్కువ ఓట్లుకలిగిన కుటుంబాలను గుర్తించేందుకు ప్రత్యేక టీమ్‌లను తయారు చేసుకున్నారు. ఆయావర్గాలకు తాయిలాలు ముట్టజెప్పేందుకు సర్వం ఏర్పాట్లు పూర్తిచేసుకుంటున్నారు. మరో ప్రత్యేక టీమ్‌ను తయారు చేసుకొని తీసివేతలు, కూడికలు మొదలుపెట్టారు. గెలుపు బాటలో పయనించాలంటే అనుసరించాల్సిన మార్గాలు, మంతనాలపై సమాలోచనలు చేస్తున్నారు. పోల్ మేనేజ్‌మెంట్‌ను శాసించే సామాజికవర్గాల మద్దతు కూడగట్టుకుంటే విజయం సునాయాసంగా వర్తిస్తుందనే భావనలో రాజకీయపక్షాలున్నాయి. పార్టీ ఓటుబ్యాంక్‌కు బలమైన సామాజికవర్గాల మద్దతు తోడైతే గెలుపు తథ్యమన్న ఆలోచనలో అభ్యర్థులు పడ్డారు. అయితే ఇప్పటికే పలు రాజకీయ పక్షాలకు అనుకూలంగా వ్యవహరించే ఓటర్లను మినహాయించి తటస్థంగా ఉన్న ఓటర్లపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆయా ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు నజరానాలు ముట్టజెప్పుకుంటున్నారు.
సామాజిక ఓట్లపై ప్రత్యేక నజర్
ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 18 మునిసిపాలిటీల పరిధిలోని 407 వార్డులకు కౌన్సిలర్లు పోటీపడుతున్నారు. దాదాపు అన్ని వార్డుల్లో త్రిముఖ పోటీనెలకొనగా, మరికొన్ని చోట్ల నలుగురుకంటే ఎక్కువ మంది ఆశావాహులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరంతా గెలుపే లక్ష్యంగా తమ శక్తికొద్దీ తాయిలాలు సమర్పించుకునేందుకు సర్వసిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక వర్గాలవారీగా ఓట్లు పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 6,68,454మంది ఓటర్లుండగా, పురుషులు 3,23613, మహిళలు 3,44,841 మంది ఓటర్లున్నారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ, హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల మునిసిపాలిటీల పరిధిలో 162 వార్డులో 3,09,097 మంది ఓటర్లుంటే అందులో పురుష ఓటర్లు 1,49,925 మంది ఉండగా, మహిళా ఓటర్ల సంఖ్య1,59,172మంది ఉన్నారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 98,911, ఓసీలు 80,635, ఎస్సీలు 55,637, ఎస్టీలు 33731, మైనార్టీ ఓటర్లు 40183మంది ఉన్నట్లు అంచనా. అదేవిధంగా సూర్యాపేట జిల్లా పరిధిలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మునిసిపాలిటీల్లో 141 వార్డుల పరిధిలో 2,26,646 మంది ఓటర్లుంటే అందులో పురుష ఓటర్లు 1,08,763 మంది ఉండగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,17,883గా ఉంది. ఈ జిల్లాలో సామాజికవర్గాల వారీగా బీసీ ఓటర్ల సంఖ్య 72,526, ఓసీలు 58,928, ఎస్సీలు 40,796, ఎస్టీలు 24,932, మైనార్టీ ఓటర్లసంఖ్య 29,464 మంది ఉన్నట్లు సమాచారం. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి, మోత్కూరు, చౌటుప్పల్ మునిసిపాలిటీలతో కలుపుకొని 104 వార్డులున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు మునిసిపాలిటీల పరిధిలో 1,32,711మంది ఓటర్లుంటే వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 67,257 ఉండగా, మహిళా ఓటర్లు 65,454మంది ఉన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 42,468 మంది, ఓసీలు 34,506, ఎస్సీలు 23,887, ఎస్టీలు 14,598, మైనార్టీ ఓటర్లు 17,252మంది ఉన్నట్లు అంచనా. ఓటర్లజాబితాలో ఓటర్ల శాతానికి అనుగుణంగా సామాజికవర్గాలను ఆకర్షించేందుకు అభ్యర్థులు అంకెల గారడీతో కుస్తీపడుతూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎలక్షన్ సమయం దగ్గరపడుతున్నా కొద్దీ ప్రజాక్షేత్రంలో రాజకీయ ఎత్తుగడలు మరింతగా పదునెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణ రాజకీయం మరింత రంజుగా మారుతుంటే గెలుపోటములపై ఎవరి ధీమా వారిదేగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సామాజికవర్గాల వారీగా రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి గొంతమ్మ కోర్కెలు ఇట్టే తీర్చేస్తున్నారు.
కులపెద్దలతో మంతనాలు
ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కులాలు, మతాలవారీగా ఓటర్లను గుర్తిస్తున్నారు. ఆయా వర్గాలకు చెందిన పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఆయావర్గాల ఓట్లన్నీ గంపగుత్తగా దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వార్డులవారీగా ఉన్న కుల, మతపెద్దలు, కాలనీలో పేరున్న వ్యక్తుల ఫోన్‌నెంబర్లను తమ అనుచరగణంతో సేకరించి సమయం దొరికినప్పుడల్లా ఫోన్‌చేసి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. తమ గెలుపుకోసం సహకరించాలని కోరుతూ భవిష్యత్‌లో వారికిచ్చే ప్రాధాన్యతను వివరించి ప్రాథేయపడుతున్నారు. ఇదే సమయంలో స్థానికంగా నెలకొన్న సమస్యలు, భవిష్యత్‌లో చేపట్టాల్సి అభివృద్ధి పనులను అభ్యర్థులతో ప్రస్తావిస్తున్నారు. గెలిచిన వెంటనే వాటన్నింటికి తొలి ప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తామంటూ హామీలిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ అవసరాలను గుర్తిస్తున్న స్థానిక ఓటర్లు ఎన్నికల సమయంలోనే సమస్యల పరిష్కారానికి పునాదిపడాలని భావించి తమ ఇబ్బందులు తొలగించే వారికే తమ ఓటేస్తామంటూ తెగేసి చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అభ్యర్థులు కాలనీ పెద్దల సమక్షంలో ముందస్తు హామీపత్రాలు సైతం రాసిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పాడి గేదెల పేరుతో భారీ మోసం.. పశువులను ఇంటికే పంపిస్తామంటూ..
రేవంత్‌రెడ్డి పాలనలో.. బస్సు తప్ప అన్నీ తుస్సే.. హరీశ్‌రావు సెటైర్లు
Read Latest Telangana News And AP News And Telugu News