పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్ ?
ABN , Publish Date - May 15 , 2026 | 08:54 AM
హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన కౌకూర్ భారీ చోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
జవహర్‌నగర్ కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ సరిహద్దులో పట్టుబడిన నిందితులు?
చోరీ సొత్తు రికవరీ అయినట్లు సమాచారం
త్వరలో మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం
హైదరాబాద్: నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన కౌకూర్ భారీ చోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ ప్లేవ్ కాలనీలో రిటైర్డ్ దంపతుల ఇంట్లో దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ సభ్యులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారన్న వార్త స్థానికంగా ఉత్కంఠ రేపుతోంది.
జూబ్లీహిల్స్‌లో మాజీ ఐపీఎస్ అధికారి భార్యను హతమార్చిన ఘటనతో పాటు ఈ నెల 11న మత్తుమందు ఇచ్చి రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమోహన్ ఇంట్లో నేపాలీ గ్యాంగ్ చేసిన దోపిడీ ఘటనలు నగరంలో సంచలనం సృష్టించాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మల్కాజిగిరి సీపీ సుమతి స్వయంగా రంగంలోకి దిగారు. ఎస్‌ఓటీ, జవహర్‌నగర్ పోలీసుల, ఐటీ, ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
నేపాల్ వెళ్లే లోపే..
సీసీ కెమెరాలు, కాల్‌డాటా ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు వారు ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్నట్లు గుర్తించారు. సరిహద్దు దాటి నేపాల్ వెళ్లే ప్రయత్నంలో ఉన్న దోపిడీ ముఠాను చాకచక్యంగా అరెస్ట్ చేసినట్లు సమాచారం. దోపిడీ చేసిన బంగారు, వెండి, నగదు మొత్తం రికవరీ అయినట్లు సమాచారం. పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు. నిందితులను ఉత్తరప్రదేశ్‌లోని స్థానిక కోర్టులో హాజరుపరిచిన అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిసింది. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News