Share News

ఉన్నత విద్యారంగం బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి లోకేశ్

ABN , Publish Date - May 15 , 2026 | 07:57 AM

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం మరో ముందడుగు వేస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

ఉన్నత విద్యారంగం బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, మే15: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం మరో ముందడుగు వేస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 19 యూనివర్సిటీలు, ఆర్జీయూకేటీ (RGUKT) వర్సిటీల్లో 1,523 ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన వివరించారు. అందుకు సంబంధించిన నియామకాల నోటిఫికేషన్‌ ఈ రోజు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 1,020.. అసోసియేట్‌ ప్రొఫెసర్లు 334 పోస్టులు.. ప్రొఫెసర్లు 63, లెక్చరర్లు 104 సహా 279 బ్యాక్‌ లాగ్‌ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వివరించారు.


ఈ నియామకాల్లో కాంట్రాక్ట్‌ ఫ్యాకల్టీకి అదనపు వెయిటేజ్‌ వర్తింప చేస్తామని లోకేశ్ తెలిపారు. మే 18వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగం బలోపేతానికి మరో ముందడుగు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 4,343 పోస్టులకు గాను ప్రస్తుతం 972 మంది మాత్రమే సేవలు అందిస్తున్నారని ఆయన సోదాహరణగా వివరించారు.


అకడమిక్ ఎక్సలెన్స్, రీసెర్చ్, ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఎన్ఎఎసీ, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదల లక్ష్యంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. పారదర్శక, ప్రతిభ ఆధారంగా ఈ నియామక ప్రక్రియ చేపడతామని వివరించారు. apuniversitiesrecruitment.apcfss.inలో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.


మరిన్ని వివరాలు naipunyam.ap.gov.in/job-calendarలో ఉంటాయని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. యువత భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశమిదేనని ఆయన అభివర్ణించారు. సమయ పాలనతో ఈ నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ తన ఎక్స్ ఖాతా వేదికగా వివరాలను వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

For More AP News And Telugu News

Updated Date - May 15 , 2026 | 09:00 AM