Nominated Posts: పొలిటికల్ పండగెప్పుడు..
ABN , Publish Date - Jan 17 , 2026 | 09:23 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఏలూరు జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులకు, కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న వారికి నామినేటెడ్ పదవులు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు, వేధింపులు ఎదుర్కొన్న తమకు ఇప్పుడు న్యాయం జరగడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు.
పదవుల కోసం టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల ఎదురుచూపు
మౌనముద్రలో కూటమి నేతలు.. జనసేనలోనూ అసంతృప్తులు
నిరాశలో మాజీ ఎమ్మెల్యేలు ఘంటా మురళి, ముద్దరబోయిన.. నేతలు శీలం, శేషు, మండవ, మేఘాలదేవి
ఏలూరు, ఆంధ్రజ్యోతి: 'పార్టీకి దీర్ఘకాలంగా వెన్నంటే నడిచాం. అప్ప టి వైసీపీ(YSRCP) ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టి వేధించినా వెనకడుగు వేయలేదు. భవిష్యత్‌పై ఆశతో ముందుకే నడిచాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పదవులు కల్పిస్తారని భావించాం. కానీ, ఏడాదిన్నర గడిచినా పట్టించుకోవడం లేదు. కూటమి ధర్మం అంటూ మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో(Nominated Posts) ఎప్పుడు నియమిస్తారు. మా రాజకీయ జీవితాల్లో సంక్రాంతులు ఇంకెప్పుడు వస్తాయి' అంటూ ఏలూరు జిల్లాకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు, ముఖ్య కేడర్ తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తోంది.
జిల్లావ్యాప్తంగా నామినేటెడ్ పదపులను అశించినా ఇప్పటికి అధిష్ఠానం ఎందుకు కినుక వహిస్తుందో తెలియడం లేదంటూ టీడీపీ సీనియర్ నేతలతోపాటు జనసేనలోను పలుపురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవులు అందుకున్న వారితో కొంత మెరుగ్గా ఉన్నాయి. మండల స్థాయిలో నామినేటెడ్ పదవుల్లో కొంతమేర సమతూకం పాటించినా ఆలయ కమిటీల్లో టీడీపీకే పైచేయిగా ఇచ్చారన్న విమర్శలున్నాయి.
ముద్దరబోయిన ఆశలు ఫలించేవా...
నూజివీడులో మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు చాలాకాలంగా నామినేటెడ్ పోస్టు ఆశిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లను కలిశారు. అంతకుముందు దుర్గ గుడి ఛైర్మన్ పదవి వస్తుందని అనుకున్నారు. తీరా అది బాలయ్య కోటాలో రాధాకృష్ణను వరించింది. రాబోయే కాలంలో భర్తీ చేసే నామినేటెడ్ కోటాలోనైనా పదవి దక్కుతుందని భావిస్తున్నారు.
చింతలపూడి, పోలవరంలలో..
నామినేటెడ్ పదవులు ఆశించినా.. ఇప్పటివరకు రాలేదని మదనపడే నియోజకవర్గాల్లో చింతలపూడి, పోలవరంలో ఎక్కువ మంది టీడీపీ నేతలే ఉన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ పార్టీ స్థాపించిన కాలం నుంచి పార్టీ వెంటే నడుస్తున్న జంగారెడ్డిగూడెంకు చెందిన మండవ లక్ష్మణరావు అగ్రస్థానంలో నిలుస్తారు. పార్టీ పదవులతో సరిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. పార్టీ కష్టం కాలంలో నిస్వార్థంగా పనిచేసిన ఇలాంటి నేతలకు పదవులు ఇవ్వకపోవడంపై ఈ ప్రాంతంలో చర్చ సాగుతోంది.
చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ ఇటీవల టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి రేసులో నిలిచినా.. ఆయనకు అవకాశం దక్కలేదు. మంత్రి కొలుసుకు సన్నిహితంగా ఉంటున్న ఆయనకు కీలకమైన నామినేటెడ్ పదవి ఇంకా వరించలేదు. కాంగ్రెస్ హయాంలో ఏపీఐడీసీ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. టీడీపీలో చేరి పదేళ్లవుతున్నా తనకు సరైన న్యాయం దక్కలేదని చెబుతున్నారు. జిల్లా స్థాయిలో కీలకమైన నామినేటెడ్ పదవి అడుగుతున్నా అధిష్ఠానం మొగ్గు చూపకపోవడంపై ఆయన కొంత ఆసంతృప్తితో ఉన్నారు. జిల్లా వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా చేసిన షేక్ ముస్తఫా, బీసీ నేత, అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌చంద్రశేషు, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అబ్బిన దత్తాత్రేయ పదవులు ఆశించిన వారి జాబితాలో ఉన్నారు. పోలవరం నియోజకవర్గంలో టి.నర్సాపురం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శీలం వెంకటేశ్వరరావు, జయవరపు శ్రీరామమూర్తి(మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్), కొయ్యలగూడెంకు చెందిన మాజీ తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు గంగిరెడ్డి మేఘలాదేవి కీలకమైన పదవి కావాలని కోరుతున్నా.. అధిష్ఠానం కనీసం కన్నెత్తి చూడలేదన్న విమర్శలున్నాయి.
ఏలూరులో ఇదీ పరిస్థతి..
ఏలూరులో టీడీపీ నుంచి ఎక్కువమంది నామినేటెడ్ పదవులను అందుకోవడంతో జనసేనలో అంతర్మథనం మొదలైంది. ఇక్కడ సీటు త్యాగం చేసిన రెడ్డి అప్పలనాయుడు ఒక్కరినే విజయవాడ ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పదవి వరించింది. నగర పాలక సంస్థ ఎన్నికల్లో 50 డివిజన్లలో జనసేన పోటీ చేస్తుందని ఇటీవల ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఆయనను నమ్ముకుని పార్టీ వెంట తిరిగిన వారికి పదవులు దక్కడం లేదు. ఇటీవల ఆయన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) కార్యాలయానికి దాదాపు వందమంది శ్రేణులతో కలిసి వెళ్లి ఆయనతో చర్చించారు. ఇటీవల జిల్లా అధ్యక్ష పగ్గాలు అందుకున్న బడేటి చంటికి ఈ వ్యవహారం కొంత ఇబ్బందికరంగా పరిణమించింది. రాబోయే పదవుల్లో సర్దుబాటు చేస్తామని తెలిపినట్టు సమాచారం. జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీలో తన పార్టీకి చెందిన మహిళకు ఇవ్వాలని కోరినా.. దాన్నీ పట్టించుకోలేదని టీడీపీకే కట్టబెట్టారని అప్పలనాయుడు ప్రశ్నించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ పదవుల్లో రెండింటిని జనసేన ఇవ్వగా, ఇంకా లైన్ క్లియర్ రాలేదని సమాచారం.
మరోవైపు.. ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్‌కు టీడీపీ నగర అధ్యక్ష పదవి, అంతకుముందే కో-ఆప్షన్ పదవి, ఇటీవలే రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. తామంతా సీనియర్లం కాదా అంటూ కొందరు పార్టీలో అంటీ ముట్టనట్లు తిరుగుతున్నారు.
ఇవి కూడా చదవండి...
సంక్రాంతి వేడుకల పేరిట జూదం, కోడిపందేల హవా
సంక్రాంతి ప్రయాణికులకు అలర్ట్.. 500 స్పెషల్ సర్వీసులు
Read Latest AP News And Telugu News