Kodi Pandalu: సంక్రాంతి వేడుకల పేరిట జూదం, కోడిపందేల హవా
ABN , Publish Date - Jan 17 , 2026 | 07:29 AM
ఉయ్యూరు మండల పరిధిలో మూడు రోజుల పాటు కోడిపందేలు, పేకాట, కాయ్ రాజా కాయ్‌లు పెద్దఎత్తున జరిగాయి. పెదఓగిరాల సెంటర్ సమీపాన, ఆకునూరు, కాటూరులో భారీగా బరులు ఏర్పాటు చేసి పెద్దఎత్తున కోడి పందేలు వేశారు.
బరి తెగించారు!
భారీగా కోడి, పొట్టేళ్ల పందేలు, జూదం
తెలంగాణా నుంచి వచ్చిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు
రూ.500 నోట్ల కట్టలతో పందేలు కాసిన వీక్షకులు
ఉయ్యూరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి) : ఉయ్యూరు మండల పరిధిలో మూడు రోజుల పాటు కోడిపందేలు (Kodi Pandalu), పేకాట, కాయ్ రాజా కాయ్‌లు పెద్దఎత్తున జరిగాయి. పెదఓగిరాల సెంటర్ సమీపాన, ఆకునూరు, కాటూరులో భారీగా బరులు ఏర్పాటు చేసి పెద్దఎత్తున కోడి పందేలు వేశారు. పెదఓగిరాల బరిలో పెద్ద టెంట్లు వేసి తెలంగాణా నుంచి వచ్చిన వారు జూదం ఆడేందుకు హైటెక్ ఏర్పాట్లు చేశారు. పొట్టేళ్ల పందేలు, ఎడ్ల పూటీ లాగుడు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కోడి పందేలు తిలకించేందుకు మహిళలు, యువతులు తరలివచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి సందడి చేశారు. లక్షల్లో కోడిపందేలు నిర్వహించి ఎక్కువ పందేలు గెలిచిన వారికి కారు, బుల్లెట్ మోటార్ సైకిళ్లు బహుమతులు ఇచ్చారు.
చేతులు మారిన నోట్లకట్టలు
హనుమాన్ జంక్షన్ రూరల్: సంక్రాంతి సంబరాల్లో భాగంగా బాపులపాడు మండల వ్యాప్తంగా తొడగొట్టిన కోడిపందేలు (కత్తులతో జరిగే పందాలు) అత్యంత ఆహ్లాదకరంగా జరిగాయి. బరిలో దిగిన కోడిపుంజులు పౌరుషంతో ప్రత్యర్థి కోడి పడిపోయినా పోరాటం ఆపలేదు. ఎత్తుడు, దింపుడు పందాల జోరులో రూ.500 నోట్లకట్టలు చేతులు మారాయి. పందెపురాయుళ్లతో పాటు వీక్షకులు కూడా తగ్గేదేలా అంటూ భారీగా పందాలు కట్టారు. తిప్పనగుంట, వేలేరు, సింగన్నగూడెం, బిళ్లనపల్లి తదితర గ్రామాల్లో నిర్వహించిన పందెల్లో లక్షల్లో బెట్టింగులు జరిగాయి. వీఐపీలు, సామాన్యుడు అనే తేడా లేకుండా పందెల్లో భారీగా పాల్గొన్నారు.
సర్వీసు రోడ్డుపై ట్రాఫిక్
ఉయ్యూరు: విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారిలో పెదఓగిరాల సెంటర్ సమీపాన కోడి పందేలకు వచ్చిన వారి వాహనాలు నిలపడంతో సర్వీసు రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పెద ఓగిరాల వద్ద సర్వీసు రోడ్డును అనుకుని పొలంలో భారీగా కోడిపందేల బరి ఏర్పాటు చేశారు. పందేలకు వచ్చే వారి వాహనాలు బరివద్ద ఖాళీస్థలంలో నిలిపేందుకు కార్లు, మోటార్ సైకిళ్లకు వందల రూపాయలు పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. దీంతో బరివద్ద పొలంలో వాహనాలు పార్కింగ్ చేయకుండా ఎక్కువమంది సర్వీసు రోడ్డుకు రెండువైపులా నిలపడంతో విజయవాడ నుంచి ఉయ్యూరు వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది.
మద్యం ధర పెంచారంటూ గోల
బాటిల్‌కు రూ.10 పెంచి అమ్ముతున్నారంటూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక మద్యం దుకాణాల వద్ద పండుగ రోజు రూ.10 పెంచి కనుమ రోజు తగ్గించేశారని, అనధికారికంగా నిర్వహించే బెల్ట్‌షాపుల్లో మాత్రం పెంచిన ధరే అమ్ముతూ జేబులు కొల్లగొడుతున్నారంటూ మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
సంక్రాంతి పండుగ రోజు చోరీ.. కేవలం ఒక్కరోజులోనే..
Read Latest AP News And Telugu News