Shocking Theft: సంక్రాంతి పండుగ రోజు చోరీ.. కేవలం ఒక్కరోజులోనే..
ABN , Publish Date - Jan 16 , 2026 | 02:04 PM
గాజువాకలోని వైజాగ్ షాపింగ్ మాల్‌లో జరిగిన చోరీని 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. మాల్‌లో సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితుడి వాహనాన్ని ట్రాక్ చేసిన పోలీసులు.. ఒక్కరోజులోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం, జనవరి 16: సంక్రాంతి పండుగ రోజున గాజువాకలో చోరీ జరిగింది. ఈ చోరీని 24 గంటల్లోనే గాజువాక క్రైమ్ పోలీసులు ఛేదించారు. సంక్రాంతి సందర్భంగా వైజాగ్ షాపింగ్ మాల్‌లో ఏ వస్తువైనా రూ.180కే అంటూ భారీ సేల్‌ను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో ఓ మహిళ షాపింగ్ మాల్ లోపలికి వెళ్లే సమయంలో తన బ్యాగ్‌ను సెక్యూరిటీ వద్ద ఉంచింది. అయితే.. ఓ గుర్తు తెలియని వ్యక్తి తన బ్యాగ్‌తో పాటు సెక్యూరిటీ వద్ద ఉంచిన మరో బ్యాగ్‌నూ దొంగలించాడు. ఆ బ్యాగ్‌లో రూ.50 వేల నగదుతో పాటు 11 తులాల బంగారం ఉన్నట్టు గుర్తించిన సదరు వ్యక్తి.. దాన్ని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు.
తన బ్యాగ్ కనిపించకపోవడంతో వెంటనే ఆ మహిళ గాజువాక క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వైజాగ్ షాపింగ్ మాల్‌లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఉపయోగించిన వాహనాన్ని ట్రాక్ చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. దొంగలించిన బ్యాగ్‌ను శ్మశానవాటికలో దాచినట్లు విచారణలో తెలిపాడు నిందితుడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్‌లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు అలాగే ఉన్నట్లు గుర్తించారు.
అనంతరం.. బాధితురాలికి తిరిగి బ్యాగ్‌ను అప్పగించారు గాజువాక క్రైమ్ పోలీసులు. పండుగ పూట బంగారం, నగదును గుర్తుతెలియని వ్యక్తి దొంగలించడంతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురైంది. చివరకు పోలీసులు ఎంతో చాకచక్యంగా కేసును చేధించి.. బ్యాగ్‌ను తిరిగి అప్పగించడంతో బాధితురాలు హర్షం వ్యక్తం చేసింది. ఈ విధంగా సమర్థవంతంగా కేసును ఛేదించిన గాజువాక క్రైమ్ పోలీసుల ప్రతిభకు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఆ కుక్కకు ఏమైంది.. నాలుగు రోజులుగా దేవతల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు
వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
Read Latest AP News And Telugu News