Share News

వెల్‌కమ్‌ టు భోగాపురం

ABN , Publish Date - Aug 18 , 2026 | 09:00 AM

‘‘వెల్‌కమ్‌ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు’’ అంటూ వచ్చిన ప్రకటన ప్రయాణికులకు ప్రత్యేకమైన మధురానుభూతి కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

వెల్‌కమ్‌ టు భోగాపురం

  • అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు స్వాగతం

  • ఉదయం 6-45కు ల్యాండయిన తొలి విమానం

  • సంప్రదాయబద్ధంగా వాటర్‌ క్యానన్‌ సెల్యూట్‌

  • ప్రయాణికులకు స్వయంగా స్వాగతం పలికిన

  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

  • వారికి ఏటికొప్పాక బొమ్మలతో పాటు సర్టిఫికెట్లు

  • మొదటి రోజు మొత్తం 26 విమానాల రాకపోకలు

  • దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు సర్వీసులు

  • ఎయిర్‌పోర్టు చాలా బాగుందన్న ప్రయాణికులు

‘‘వెల్‌కమ్‌ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు’’ అంటూ వచ్చిన ప్రకటన ప్రయాణికులకు ప్రత్యేకమైన మధురానుభూతి కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

విజయనగరం/విశాఖపట్నం/భోగాపురం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ‘‘వెల్‌కమ్‌ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు’’ అంటూ వచ్చిన ప్రకటన ప్రయాణికులకు ప్రత్యేకమైన మధురానుభూతి కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇక్కడి నుంచి స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం సింగపూర్‌ బయలుదేరి వెళ్లింది. అయితే ల్యాండ్‌ అయిన తొలి విమానం మాత్రం ఇండిగో సంస్థకు చెందినది. 177 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆ విమానం సోమవారం ఉదయం 6-45గంటలకు ఎయిర్‌పోర్టులో దిగింది. ఆ విమానంలో వచ్చిన వారు ల్యాండింగ్‌ సమయంలో భోగాపురం పరిసరాల్లోని ప్రకృతి అందాలను చూసి పులికించిపోయారు. భోగాపురం వినువీధుల నుంచి రయ్‌మంటూ వచ్చిన విమానాన్ని చూసి స్థానిక ప్రజలు కూడా ఉబ్బితబ్బిబ్బ య్యారు. కొత్త విమానాలు వచ్చినప్పుడు విమానాశ్రయాల్లో వాటికి అగ్నిమాపక శకటాలతో నీటిని విరజిమ్ముతూ స్వాగతం పలుకుతారు.


భోగాపురంలో తొలిగా దిగిన ఇండిగో విమానానికి జీఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది వాటర్‌ క్యానన్‌ సెల్యూట్‌తో ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం ల్యాండయిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్‌ ఇండియా, స్కూట్‌ (సింగపూర్‌), ఇండియా వన్‌ విమానాలకూ ఈ గౌరవం లభించింది. హైదరాబాద్‌ నుంచి తొలి ఇండిగో విమాన ప్రయాణికులకు చిన్న ఏటికొప్పాక బొమ్మలు, చాక్లెట్లు ఉన్న గిఫ్ట్‌ హ్యాంపర్‌తో పాటు గులాబీలు అందించి స్వాగతం పలికారు. వీటితో పాటు ప్రతి ప్రయాణికుడికి ‘ఫస్ట్‌ పాసింజర్‌’ అంటూ ముద్రించిన సర్టిఫికెట్లను పౌర విమానయాన మంత్రి కె.రామ్మెహన్‌నాయుడు, జీఎంఆర్‌ యాజమాన్య ప్రతినిధులు స్వయంగా అందజేశారు. విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా కేక్‌ కట్‌చేశారు. ప్రయాణికులకు స్వయంగా బోర్డింగ్‌ పాసులను కూడా అందించారు. కార్యక్రమంలో విజయనగరం కలెక్టర్‌ ఎస్‌.రామసుందర రెడ్డి, ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా పాల్గొన్నారు. కాగా, మన్యం వీరుడు చిత్రం దర్శకుడు, నటుడు ఆర్‌వీవీ సత్యనారాయణ అల్లూరి వేషధారిగా వచ్చి ఆకట్టుకున్నాడు.


తొలిరోజు 26 విమానాలు..

విశాఖపట్నం విమానాశ్రయానికి రోజుకు 23 నుంచి 24 విమానాలు వచ్చి వెళ్లేవి. అంటే రాకపోకలు (ఎయిర్‌ ట్రాఫిక్‌ మూవ్‌మెంట్స్‌-ఏటీఎమ్స్‌) 46 నుంచి 48 ఉండేవి. భోగాపురం విమానాశ్రయం తొలిరోజే ఈ సంఖ్యను అధిగమించింది. మొదటి రోజు సోమవారం 26 విమానాలు రాగా, 52 ఏటీఎమ్స్‌ రికార్డయ్యాయి. అబుధాబీ నుంచి ఇండిగో విమానం వచ్చి, తిరిగి వెళ్లగా, సింగపూర్‌ నుంచి స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌ వచ్చి తిరిగి సింగపూర్‌కు వెళ్లిందని జీఎంఆర్‌ విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (జీవీఐఏఎల్‌) సీఈవో కన్వర్‌బీర్‌సింగ్‌ తెలిపారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అవసరమైన వసతులు కల్పించామన్నారు. ఎయిర్‌పోర్టులో రోజుకు 30 వరకు విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. వీటిలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రె్‌సకు చెందిన 5, ఇండిగోకు చెందిన 12, ఎయిర్‌ ఇండియాకి చెందిన ఒక విమానం, మిగతా సంస్థలకు చెందిన విమానాలు నిరంతరం రాకపోకలు సాగించనున్నాయి. తొలిరోజు 52 ఏటీఎంలతో విమానాశ్రయం ప్రయాణికులతో సందడిగా మారింది. సుమారు 7 వేల మంది రాకపోకలు సాగించినట్టు విమానాశ్రయ వర్గాల అంచనా.


ఉత్తరాంధ్ర ఆశలకు జీవం: రామ్మోహన్‌

ఉత్తరాంధ్ర ప్రజల ఆశలకు జీవంగా, ఈ ప్రాంత చరిత్రకు సాక్ష్యంగా భోగాపురం విమానాశ్రయం నిలస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. సోమవారం ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి తొలి పౌర విమానయాన సేవలను ప్రారంభించారు. ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు విమానాల రాకపోకలకు ఆ విమానాశ్రయాన్ని వినియోగించడంతో పాటు భవిష్యత్తులో సీఎం చంద్రబాబు దిశా నిర్దేశంలో మరింత అభివృద్ధి, విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులకు మరోసారి కృతజ్ఞతలు చెప్పారు. భవిష్యత్తులో విమానాశ్రయాన్ని మరింత విస్తరిస్తామన్నారు. ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ పెంచేందుకు ఏడు రహదారులను విస్తరిస్తున్నామన్నారు. విశాఖ నుంచి జాతీయ రహదారికి ఈ రోడ్లను అనుసంధానం చేస్తున్నామని, వీటితో పాటు బీచ్‌కారిడార్‌ ద్వారా రహదారి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు.


విశాఖకు నితిన్‌ నబీన్‌

విశాఖపట్నం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ సోమవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. భోగాపురం విమానాశ్రయంలో రాత్రి పది గంటలకు దిగిన ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా నితిన్‌ విశాఖపట్నం వచ్చారు. బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో ఆయన బస చేశారు. మంగళవారం ఉదయం సింహాచలం వెళ్లి వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకుంటారు. తర్వాత మధురవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు హాజరుకావడం ఇదే తొలిసారి.


ఎయిర్‌పోర్టు బాగుంది

ఎక్కడా లేని విధంగా ఎయిర్‌పోర్టు నిర్మించారు. విమానంలో వచ్చినప్పుడు ఈ ప్రాంతం, సముద్రతీరం అంతా చాలా ఆహ్లాదాన్ని, మంచి అనుభూతిని ఇచ్చాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చాను. శ్రీకాకుళంలో ఓ పరిశ్రమకు వెళ్తున్నాను.

- సాయివికాస్‌, హైదరాబాద్‌


భోగాపురం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): భోగాపురం(అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం తొలి విమానం ల్యాండింగ్‌ కావడాన్ని పురస్కరించుకొని మన్యం వీరుడు చిత్రం దర్శకుడు, నటుడు ఆర్‌వీవీ సత్యనారాయణ అల్లూరి వేషధారిగా వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. అల్లూరి పాటలు పాడుతూ ప్రయాణికులను ఆశ్చర్యపరిచాడు. అతనితో ఫొటోలు తీసుకొనేందుకు అభిమానులు ఎగబడ్డారు.


వార్తలు కూడా చదవండి...

నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం

అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 09:01 AM