నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:43 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ -1 అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ -1 అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. ఈరోజు (సోమవారం) ఏపీ అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సీఎం చిట్‌చాట్ చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదని వ్యాఖ్యానించారు. ఆ కుంభకోణంలో ఎంతోమంది మెరిట్ విద్యార్థులు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
డీఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువమంది ఉన్నారు..
ఎల్లుండి సభలో అన్ని విషయాలు చర్చిస్తామని సీఎం పేర్కొన్నారు. డీఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువమంది ఉన్నారని ప్రస్తావించారు. నిన్న (ఆదివారం) విజయవాడలో ఉపాధ్యాయులు నిర్వహించిన ఆందోళనలో వారు బాగా మాట్లాడారని తెలిపారు. ఆత్మాభిమానంతోనే ఆత్మగౌరవం కాపాడుకునేందుకు అంతమంది టీచర్లు వచ్చారని అన్నారు. వారి ఆత్మగౌరవాన్ని వైసీపీ నేతలు దెబ్బతీస్తోండటంతో సహించలేక రోడ్డు ఎక్కారని చెప్పారు. మహిళా టీచర్లకు డీఎస్సీతో, ఆ ప్రక్రియతో ఓ ఎమోషనల్ బాండింగ్ ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.