అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. మంత్రి సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం
ABN , Publish Date - Aug 17 , 2026 | 01:17 PM
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల ప్రారంభంలో మంత్రుల మధ్య జరిగిన సరదా సంభాషణ ఆసక్తికరంగా మారింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ గురించి మంత్రి నారా లోకేశ్ సరదాగా చమత్కరించారు.
అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల (AP Assembly Session) ప్రారంభంలో మంత్రుల మధ్య జరిగిన సరదా సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్.. బీజేపీ కండువాతో శాసనసభలోకి వచ్చారు. ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సరదాగా స్పందించారు. ‘సత్యగారూ.. మీకెందుకండి ప్రత్యేకంగా పార్టీ కండువా? మీరు బీజేపీ అని లోకమంతా తెలుసు కదా!’ అంటూ సరదాగా లోకేశ్ చమత్కరించారు.
లోకేశ్ వ్యాఖ్యలకు సీనియర్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా సరదాగా జత కలిశారు. ‘అవును సర్.. జాతీయ స్థాయిలో ప్రముఖ నేతల్లో సత్యగారు కూడా ఒకరు’ అంటూ సత్యకుమార్‌ను ప్రశంసించారు. దీంతో అక్కడి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది.
అనంతరం లోకేశ్ మరోసారి సత్యకుమార్‌ను చమత్కరించారు. ‘మా పార్టీ వారికి కూడా క్రమశిక్షణ గురించి నేర్పించండి’ అంటూ సత్యకుమార్‌ను ఉద్దేశించి లోకేశ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సమయంలో పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ‘పార్టీ ఫస్ట్, సర్!’ అని స్పందించారు. దీనికి సత్యకుమార్ యాదవ్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. ‘నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. సెల్ఫ్ లాస్ట్!’ అని ఆయన పేర్కొన్నారు. సత్యకుమార్ చెప్పిన ఈ మాటలు అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలను ఆకట్టుకున్నాయి. దీంతో శాసనసభ ప్రాంగణంలో నవ్వులు పూశాయి.
ఈ సరదా సంభాషణలో రాజకీయ పార్టీల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం, నేతల మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపించింది. బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ రాజకీయ ప్రాధాన్యాన్ని అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. అయితే, లోకేశ్ తనదైన శైలిలో చమత్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ముఖ్యంగా ‘నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. సెల్ఫ్ లాస్ట్!’ అనే సత్యకుమార్ వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. శాసనసభ సమావేశాలు సాధారణంగా రాజకీయ చర్చలు, విధానపరమైన అంశాలతో సాగుతుండగా, ఈ సమయంలో చోటుచేసుకున్న ఈ సరదా సంభాషణ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య నవ్వులు తెప్పించింది.
వార్తలు కూడా చదవండి...
ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్
నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్‌మెంట్‌కు దాతలు ముందుకు రావాలి: పెమ్మసాని చంద్రశేఖర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News