ఆగస్టులోనూ అంతంతే
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:47 AM
నైరుతి రుతుపవనాల సీజన్ మొదలై రెండున్నర నెలలు అవుతోంది. జూన్, జూలై నెలల్లో సరైన వర్షాలు కురవలేదు. వరుస అల్పపీడనాలు ఏర్పడడంతో ఆగస్టులోనైనా పరిస్థితి మారుతుందని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వారి ఆశలన్నీ ఆవిరవుతున్నాయి.
అల్పపీడనాలు.. అయినా నిరాశే
రాష్ట్రంలో 49.3శాతం లోటు వర్షపాతం
దైవాధీనంగా ఖరీఫ్ సాగు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
వాయుగుండంగా బలపడే చాన్స్
ఏపీకి ఉపయోగం లేదు: నిపుణులు
విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల సీజన్ మొదలై రెండున్నర నెలలు అవుతోంది. జూన్, జూలై నెలల్లో సరైన వర్షాలు కురవలేదు. వరుస అల్పపీడనాలు ఏర్పడడంతో ఆగస్టులోనైనా పరిస్థితి మారుతుందని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వారి ఆశలన్నీ ఆవిరవుతున్నాయి. అడపాదడపా వాతావరణ అనిశ్చితితో తప్ప.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే పరిస్థితి కనిపించడం లేదు. విస్తారంగా వర్షాలు కురవాల్సిన సమయంలో వేసవి మాదిరి ఎండలు కాస్తున్నాయి. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దగ్గరగా నమోదవుతున్నాయి. రిజర్వాయర్ల కింద తప్ప మిగిలినచోట్ల ఖరీఫ్ పంటల సాగు దైవాధీనంగా మారింది. ఎండలకు పొలాలు ఎండిపోతున్నాయి.
28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతం
అరేబియా సముద్రం మీదుగా వీస్తున్న రుతుపవన గాలులు బలహీనంగా ఉండడంతో పశ్చిమ కనుమలు దాటి దక్షిణ భారతానికి రావడం లేదు. దీంతో కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకే రుతుపవన వర్షాలు పరిమితమవుతున్నాయి. దక్షిణాదిలో మిగిలినచోట్ల రుతుపవనాలు ప్రభావం చూపడం లేదని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమధ్య రేఖకు ఆనుకుని పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో బలపడడం వల్ల ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రం నుంచి వెచ్చని గాలులు రావడంతో రుతుపవనాలు బలహీనంగా మారుతున్నాయని విశ్లేషించారు. దీంతో దక్షిణాదిలో వర్షాభావం కొనసాగుతుందని.. కోస్తాంధ్ర, రాయలసీమల్లో దుర్భిక్షం నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. నైరుతి సీజన్‌లో జూన్ 1 నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో 323.5 మిల్లీమీటర్లకు గాను 163.9 మి.మీ. వర్షపాతమే (సాధారణం కంటే 49.3 శాతం తక్కువ) నమోదైంది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతం నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ నెలలో మూడో అల్పపీడనం
పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఆగస్టు నెలలో ఏర్పడిన మూడో అల్పపీడనం ఇది. అయితే ఇది రాష్ట్రానికి చాలా దూరంలో ఉండడంతో ప్రభావం ఏమీ ఉండదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది బుధవారం రాత్రికి తీవ్ర అల్పపీడనంగా, గురువారం ఉదయానికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటి పశ్చిమ వాయవ్యంగా పయనించి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా జార్ఖండ్ వైపు వెళ్లనుంది. ఆ తర్వాత ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు పయనించి ఈశాన్యంగా దిశ మార్చుకుని బిహార్ వైపు వెళ్లనుంది. దీని ప్రభావంతో తూర్పు, మధ్య, ఈశాన్య భారతంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల ఆకస్మిక వరదలు సంభవించవచ్చని వాతావరణ నిపుణుడొకరు పేర్కొన్నారు. బుధవారం నాటి అంచనా మేరకు అల్పపీడనం నాలుగైదు రోజులపాటు కొనసాగనుందని వివరించారు. దీంతో ఇప్పటివరకు ఉత్తరాదిలో ఉన్న రుతుపవన ద్రోణి మరో నాలుగు రోజులు అదే ప్రాంతంలో కొనసాగి ఆ తర్వాత హిమాలయాల వైపు వెళ్లనుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న రోజున వాతావరణ అనిశ్చితితో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి తప్ప రుతుపవనాలు బలపడే అవకాశం లేదన్నారు. ప్రస్తుత అల్పపీడనం బలహీనపడిన తర్వాత మరో అల్పపీడనం రావడానికి వారం పడుతుందని చెప్పారు. అది కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వస్తేనే రాష్ట్రానికి ఉపయోగం ఉంటుందని, లేదంటే ఆగస్టులో నిరాశే మిగులుతుందని వాతావరణ అధికారి పేర్కొన్నారు. వచ్చే వారమైనా రుతుపవనాలు పుంజుకుంటాయని ఆశిద్దామని చెప్పారు.
వార్తలు కూడా చదవండి...
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం
నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News