ఉత్తరాంధ్ర అభివృద్ధికి పోలవరం ఎల్‌ఎంసీ జీవనాడి: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Sep 01 , 2026 | 07:15 PM
ఉత్తరాంధ్ర అభివృద్ధికి పోలవరం ఎల్‌ఎంసీ జీవనాడి అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు పడిందని పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర అభివృద్ధికి పోలవరం ఎల్‌ఎంసీ జీవనాడి అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (AP Minister Nimmala Rama Naidu) వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు పడిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రేపు పోలవరం ఎల్‌ఎంసీ ఫస్ట్ ఫేజ్‌కు నీటి విడుదల చేయబోతున్నామని తెలిపారు. 20 నుంచి 30 ఏళ్లుగా ఉత్తరాంధ్ర ఎదురుచూస్తున్న గోదావరి జలాల కల నెరవేరబోతుందని వెల్లడించారు. ఈరోజు (మంగళవారం) అనకాపల్లి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలవరం ఎల్‌ఎంసీ పనుల్లో రెండేళ్లలోనే కీలక పురోగతి సాధించాం..
పోలవరం ఎల్‌ఎంసీ పనుల్లో రెండేళ్లలోనే కీలక పురోగతి సాధించామని మంత్రి నిమ్మల వెల్లడించారు. ఏలేరు, పంపా, తాండవ, శారద, వరాహ నదులపై నుంచి దాటుకుంటూ ఎల్‌ఎంసీ ద్వారా గోదావరి జలాలు తరలివస్తున్నాయని వివరించారు.11 చోట్ల నేషనల్ హైవేలను క్రాస్ చేస్తూ ఎల్‌ఎంసీ పనులు పూర్తి చేశామని అన్నారు. కుమ్మరిలోవ వద్ద క్లిష్టమైన భూసేకరణ సమస్యను పరిష్కరించామని చెప్పారు. కుమ్మరిలోవలో 100 మీటర్ల లోతు వరకు కొండను కట్ చేసి కాలువ నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు. వేలాది నిర్మాణాలు, అనేక అవాంతరాలను అధిగమించి ఎల్‌ఎంసీ ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేశామని తెలిపారు. జగన్ హయాంలోని 2019 నుంచి 2024 మధ్య ఎల్‌ఎంసీకి ఒక్క తట్ట మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో ఒక్క రూపాయి పని కూడా చేయలేదేని ధ్వజమెత్తారు.
నీరు, పరిశ్రమల రాకతో ఉత్తరాంధ్రలో కొత్త అభివృద్ధి శకం..
విశాఖపట్నం నగరానికి తాగునీరు, స్టీల్ ప్లాంట్‌కు నీటిని ఎల్‌ఎంసీ అందించనుందని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ‘భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు నీటి భద్రతను పోలవరం ఎల్‌ఎంసీ కల్పించనుంది. నీరు, పరిశ్రమల రాకతో ఉత్తరాంధ్రలో కొత్త అభివృద్ధి శకం మొదలవబోతుంది. వలసలు వెళ్లే ఉత్తరాంధ్రకు ఇప్పుడు పరిశ్రమలు, పెట్టుబడులను సీఎం చంద్రబాబు తీసుకొస్తున్నారు. పోలవరం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలిస్తున్నాం. పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాలతో ఎల్‌ఎంసీకి నీటి సరఫరా అందిస్తున్నాం. నాడు జగన్ హయాంలో పురుషోత్తపట్నం, పట్టిసీమ పంపులు పీకేస్తామన్నాడు. జగన్ పీకేస్తామన్న పంపులే నేడు ఉత్తరాంధ్ర దాహం తీరుస్తున్నాయి. పుష్కర లిఫ్ట్ పునర్నిర్మాణానికి రూ.29 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తున్నాం. పుష్కర లిఫ్ట్ పునర్నిర్మాణం పూర్తైతే అదనంగా 700 నుంచి 1500 క్యూసెక్కుల నీరు అందుతుంది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పం’ ’ అని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు.
నేరడి బ్యారేజీ పనులను పట్టాలెక్కిస్తాం..
ఉత్తరాంధ్రలో 11 ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ‘రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై రూ.2,500 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మూడు దశాబ్దాల ఉత్తరాంధ్ర కల నేరడి బ్యారేజీ. నేరడి బ్యారేజీకి అవసరమైన అనుమతులను కూటమి ప్రభుత్వం సాధించింది. 3 నుంచి 4 నెలల్లో నేరడి బ్యారేజీ పనులను పట్టాలెక్కిస్తాం. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమికి ఉత్తరాంధ్ర గుండెకాయ. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నీరు, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కృష్ణా జలాలు తరలించాం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా కృష్ణా, గోదావరి జలాలను సీఎం చంద్రబాబు అందజేస్తున్నారు. అపార భగీరథుడిలా రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు జలాలను మళ్లిస్తున్నారు. నిన్నటి వరకు ఉత్తరాంద్ర నుంచి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. నేడు ఉత్తరాంధ్రకే దేశం నలుమూలల నుంచి వలసలు వచ్చేలా చేస్తున్నాం’ అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్
రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News