ఒంగోలు మైనింగ్ లంచం కేసు.. మాజీ మంత్రి శిద్ధా కుటుంబ సభ్యులపై కేసు
ABN , Publish Date - Aug 26 , 2026 | 11:32 AM
ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనింగ్ శాఖ డీడీఎంఎస్ శివశంకర్ లంచం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రకాశం జిల్లా, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనింగ్ శాఖ డీడీఎంఎస్ శివశంకర్ లంచం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 17వ తేదీన ఒంగోలులోని కేబీ రెసిడెన్సీలో మైనింగ్ సేఫ్టీ విభాగం డీడీఎంఎస్ శివశంకర్‌కు.. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుటుంబ సభ్యులు రూ.2 లక్షల లంచం ఇచ్చినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.
ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన సీబీఐ అధికారులు డీడీఎంఎస్ శివశంకర్‌ను పట్టుకున్నారు. ఈ కేసులో మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్‌ను A1గా సీబీఐ చేర్చింది. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుమారుడు సుధీర్ కుమార్‌ను A2గా, శిద్ధా రాఘవరావు అన్న కుమారుడు శిద్ధా వెంకట సురేశ్ కుమార్‌ను A3గా పేర్కొంది. ప్రైవేటు సర్వేయర్ ఏ. శుభాష్కర్ రెడ్డిని A4గా, వాసవి గ్రానైట్స్ మేనేజర్ వై. సురేంద్రను A5గా చేర్చింది. అలాగే మరికొందరు గుర్తుతెలియని ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులను A6గా ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.
సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం.. జూన్ 25వ తేదీన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుటుంబానికి చెందిన వాసవి గ్రానైట్ క్వారీలో రాయి పడి ఓ కార్మికుడు మృతిచెందాడు. ఈ ప్రమాద ఘటనపై క్వారీ యాజమాన్యానికి అనుకూలంగా నివేదిక ఇప్పించేందుకు మైన్స్ డిప్యూటీ డైరెక్టర్‌కు లంచం ఇచ్చినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ వ్యవహారంలో రూ.2 లక్షల లంచం చెల్లించినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్‌లో వెల్లడించింది.
ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 7A, 8తో పాటు బీఎన్‌ఎస్ సెక్షన్ 61(2) కింద సీబీఐ కేసు నమోదు చేసింది. డీడీఎంఎస్ శివశంకర్‌తో పాటు శిద్ధా వెంకట సురేశ్, మరో ఇద్దరు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. మరోవైపు శిద్ధా రాఘవరావు కుమారుడు శిద్ధా వెంకట సుధీర్ పరారీలో ఉన్నాడు.
మైనింగ్ క్వారీలో జరిగిన కార్మికుడి మృతి ఘటనకు సంబంధించిన నివేదికను ప్రభావితం చేసేందుకు లంచం ఇచ్చారనే ఆరోపణలు ప్రస్తుతం కేసులో కీలకంగా మారాయి. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, లంచం వ్యవహారంలో మరింత మంది ప్రమేయం ఉందా అనే కోణాల్లో సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్
బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం
వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News