Share News

వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క

ABN , Publish Date - Aug 25 , 2026 | 01:35 PM

రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.

వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
Telangana Minister Seethakka

హైదరాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) సంబంధిత అధికారులను ఆదేశించారు. వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈరోజు (మంగళవారం) రాష్ట్ర సచివాలయంలో గ్రామీణ అభివృద్ధి శాఖపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో కమిషనర్ దివ్య, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, జిల్లా సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవో, అడిషనల్ డీఆర్డీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పనులు, పంట కుంటల నిర్మాణం, మహిళా సంఘ భవనాల నిర్మాణం, నూతన చేయూత పెన్షన్ల మంజూరుపై సమీక్షించారు. ఇప్పటివరకు ఇచ్చిన టార్గెట్‌లో 86శాతం మొక్కలు నాటామని తెలిపారు. 6.18 కోట్ల మొక్కలు నాటి లక్ష్యాన్ని నిర్దేశించుకుని 5.32 కోట్ల మొక్కలను నాటినట్లు వెల్లడించారు.


ప్రతి మొక్కను సంరక్షించాలి..

మొక్కలు నాటిన విధంగానే.. నాటిన మొక్కల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రతి మొక్కను సంరక్షిస్తూ వందశాతం మనుగడ సాధించాలని చెప్పారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, విద్యార్థులు, యువతను భాగస్వాములను చేయాలని దిశానిర్దేశం చేశారు. మొక్కలకు రక్షణ కంచెలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. అవెన్యూ ప్లాంటేషన్లలో ఫెన్సింగ్ పటిష్ఠంగా ఉండేలా చూడాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని తెలిపారు.


NMMS హాజరును ప్రతిరోజూ పర్యవేక్షించాలి..

పనికి సిద్ధంగా ఉన్న ప్రతి కూలీకి పని అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. కూలీలకు వారి నివాస ప్రాంతానికి సమీపంలోనే ఉపాధి కల్పించాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో తగినంత పనుల షెల్ఫ్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. NMMS హాజరును ప్రతిరోజూ పర్యవేక్షించాలని మార్గనిర్దేశం చేశారు. కూలీల సమీకరణ బాధ్యతను క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టంగా అప్పగించాలని నిర్దేశించారు. మంజూరైన అన్ని ఫార్మ్ పాండ్ల పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.


ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..

ఉపాధితో పాటు నీటి సంరక్షణకు శాశ్వత ఆస్తులుగా అభివృద్ధి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. తక్కువ పనితీరు ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఉపాధి పనులతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఆదివాసి గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాముల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్దేశించారు. ఫార్మ్ పాండ్లు, ఇతర నీటి సంరక్షణ పనులను వేగంగా ప్రారంభించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, నీటి సంరక్షణ, జీవనోపాధి ఆస్తుల సృష్టి ఏకకాలంలో జరగాలని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై నివేదిక సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ

సీఎంసీ ఫిర్యాదుతో హైడ్రా యాక్షన్.. ప్రమాదకర భవనం తొలగింపు

చికెన్ వ్యర్థాలపై అధికారుల చర్యలు.. 100 టన్నుల స్వాధీనం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 25 , 2026 | 02:04 PM