ప్రారంభానికి సిద్ధంగా వెలిగొండ ప్రాజెక్టు.. సీఎం కీలక పోస్టు
ABN , Publish Date - Aug 30 , 2026 | 08:02 PM
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోస్టు పెట్టారు.
ప్రకాశం జిల్లా, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ‘మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు..’ అంటూ ఎక్స్ వేదికగా సీఎం కీలక పోస్ట్ చేశారు సీఎం. ‘మూడు జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు. మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల.. కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోంది. కరువుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి రేపు ప్రారంభించే అవకాశం రావడం నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. నా మనసుకు ఎంతో సంతోషానిస్తోంది. వెలిగొండ అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు.. కరవుతో పోరాడిన రైతన్నకు భరోసా...ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రత... వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై భవిష్యత్తు... పేదరికంలో మగ్గిన ప్రాంతానికి ప్రగతి మార్గం. మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఈ మహాయజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి దూసుకువచ్చే కృష్ణమ్మ జలాలు.... ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయి. అందుకే రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు...అభివృద్ధికి రెక్కలు. రేపు వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం!’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని
తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News