సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:59 PM
రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ దిశగా సంజీవని వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కనెక్టివిటీ పెంచేందుకు కూడా మారుమూల ప్రాంతాల్లో సెల్ టవర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
అల్లూరి జిల్లా , ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ దిశగా సంజీవని వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. కనెక్టివిటీ పెంచేందుకు కూడా మారుమూల ప్రాంతాల్లో సెల్ టవర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పిల్లలు భారం కాదని.. పిల్లలే మన సంపద అని తెలిపారు. ఈరోజు (శనివారం) అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గన్నెలలో సంజీవిని ప్రాజెక్ట్‌ను, ఆరోగ్య రథాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అల్లూరి జిల్లాలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నామని తెలిపారు.
‘థింసా’తో గిరిజన బిడ్డలు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు..
గతంలోనే ఆయుర్వేద వైద్యాన్ని గిరిజనులకు అల్లూరి సీతారామరాజు అందించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి మహనీయుడిని నిత్యం స్మరించుకునేందుకు కొత్తగా నిర్మించిన ఎయిర్ పోర్టుకు అల్లూరి పేరు పెట్టామని వెల్లడించారు. థింసా డాన్స్‌తో గిరిజన బిడ్డలు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారని ప్రశంసించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికీ నాణ్యమైన వైద్యం అందాలని సూచించారు. యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలను కూడా ప్రోత్సహించి ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. కొండ ప్రాంతాల్లోని వారికి వైద్య సేవల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండకూడదనేది తన సంకల్పమని ఉద్ఘాటించారు. దీని కోసమే సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు.
తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్ ద్వారా గర్భిణులకు వైద్యసేవలు..
ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. సంజీవని కార్యక్రమం రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఓ గేమ్ చేంజర్‌గా మారుతుందని ఉద్ఘాటించారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి రోగుల రక్త నమూనాలను పెద్ద ఆస్పత్రికి డ్రోన్ల ద్వారా తరలించి పరీక్ష చేసి చికిత్స అందించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్ ద్వారా గర్భిణులకు వైద్యసేవలందించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. 104 వాహనాల ద్వారా సంచార వాహనాలు వైద్య పరీక్షలు నిర్వహిస్తాయని తెలిపారు. గిరిజనులతో పాటు రాష్ట్రంలో ప్రతీ పౌరుడి ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఏ కుటుంబమూ పేదరికంలో ఉండకూడదు..
గిరిజన ప్రాంతాల్లో ఏ కుటుంబమూ పేదరికంలో ఉండకూడదన్నదే తమ ఆలోచన అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేలా జీఓ నంబర్- 3 మేమే తీసుకువచ్చాం. గత పాలకులు నిర్లక్ష్యంతో సుప్రీంకోర్టు దానిని రద్దు చేసింది. ఈ అంశంపై అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయాన్ని త్వరలోనే తీసుకువస్తాం. ఐదు సూత్రాలతో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు చేశాం. అడవితల్లి బాట పేరుతో రూ.1000 కోట్లతో 900 కిలోమీటర్ల రహదారులు వేశాం. 1.60 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా నీరు, సోలార్ రూఫ్ టాప్‌ను కూడా ఏర్పాటు చేస్తాం. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి పెరిగేలా అరకు కాఫీని మరో లక్ష ఎకరాల్లో సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాం. అరకు ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరిగింది. హోం స్టేల ద్వారా ఆతిథ్యం ఇస్తే గిరిజన కుటుంబాలకు ఆదాయం వస్తుంది. మన ప్రాంతానికి వచ్చే పరిశ్రమల్లో గిరిజన యువత ఉద్యోగాలు సాధించేలా నైపుణ్యాభివృద్ధి కల్పిస్తాం’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ప్రతి గిరిజన బిడ్డ అందరిలా ఆరోగ్యంగా ఎదగాలి..
వచ్చే మూడేళ్లలో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ కల్పించాలన్నదే తమ ఆలోచన అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘అత్యవసర వైద్య సేవలను అందించేందుకు జిల్లాలో 150 వాహనాలతో ఎమర్జెన్సీ లైఫ్‌లైన్ నెట్‌వర్క్ ఉంది. కొండ ఎంత దూరంలో ఉన్నా... వైద్యం మీ దగ్గరకు రావాలి. మంచి వైద్యం అందాలి. ప్రతి గిరిజన బిడ్డ అందరిలా ఆరోగ్యంగా ఎదగాలి.. అందుకే సంజీవని తీసుకువచ్చాం. గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. అదే నిజమైన అభివృద్ధి. గిరిజన ప్రాంతాలకు మంచి వైద్య సేవలు అందేలా రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీషన్ మిషన్ తెస్తున్నాం. సికిల్ సెల్, తలసేమియా బాధితులకు నెలకు రూ.10,000 పెన్షన్ అందిస్తున్నాం. గిరిజన బిడ్డలు దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో చదవాలి. అందుకే IIT మద్రాస్‌తో ఒప్పందం చేసుకున్నాం. IIT, NEET వంటి పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందిస్తున్నాం. గిరిజన రైతులు తమ ఉత్పత్తితో ప్రపంచ స్థాయి బ్రాండ్ సృష్టించాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
గర్భిణులకు అందుతున్న వైద్య సేవలపై సీఎం ఆరా..
గన్నెల పంచాయతీ ఆర్కే(రామకృష్ణ) నగర్‌లో ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలు, ఇతర అంశాలపై మాటామంతీలో మొత్తం 16 మందితో సీఎం మాట్లాడారు. గర్భిణులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ గ్రామంలో 47 ఇళ్లు, 189 జనాభా ఉండగా.. ఇక్కడ పాపులేషన్ మేనేజ్‌మెంట్ బాగుందని.. దానికి గల విధానాలను అడిగి తెలుసుకున్నారు. మరొక మహిళ తన కుమార్తె నీట్ కోచింగ్‌లో ఉందని తెలుపగా.. శెభాష్ అని సీఎం ప్రశంసించారు. అందరూ ఇదే స్ఫూర్తితో పిల్లలను చదివించాలని సూచించారు.
సీఎం కుశల ప్రశ్నలు..
‘నీకు నీట్ కోసం తెలుసా అమ్మా.. అని సీఎం ఓ తల్లిని అడగ్గా డాక్టర్ కోర్స్ తెలుసు సార్’ అని సమాధానం ఇచ్చింది. ఇంకా మిగిలిన మహిళలతో సీఎం మాట్లాడారు. పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నారు.. ఏం చేయబోతున్నారని కుశల ప్రశ్నలు వేశారు. అందరి యోగక్షేమాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు గర్భిణులతో ప్రత్యేకంగా మాట్లాడి.. వైద్యపరమైన సేవలు, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
పథకాలు ఇక్కడి వరకు చేరుతున్నాయా..?
ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు ఇక్కడి వరకు చేరుతున్నాయా..? అని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఒకప్పటితో పోలిస్తే ఈ గ్రామంలో జనాభా బాగా తగ్గారని.. ఎందుకని సీఎం అడిగారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని ఆర్కేనగర్ మహిళలు, చిన్నారులు థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, గుమ్మిడి సంధ్యారాణి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
జగన్‌కు స్థానిక ఎన్నికలు జరగడం ఇష్టం లేదు: సీఎం చంద్రబాబు
ఏపీ అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: రామ్మోహన్
పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telangana News And National News
And Telugu News