‘విచారణ పూర్తయ్యే వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలి’.. జగన్ కేసులపై సోమిరెడ్డి
ABN , Publish Date - Oct 17 , 2026 | 01:42 PM
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ రాజకీయాల్లోనే జగన్ అత్యంత రేర్ పీస్ అంటూ వ్యాఖ్యానించారు.
నెల్లూరు, అక్టోబర్ 17: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ రాజకీయాల్లోనే జగన్ అత్యంత రేర్ పీస్ అంటూ వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీకి సమయం చాలనంతగా దేశంలోనే అనేక కేసుల్లో నిందితుడిగా జగన్ ఉన్నారన్నారు. కల్తీ నెయ్యితో తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన పాపం వారిదని... ఈడీ విచారణతో కల్తీ నెయ్యి గుట్టు అంతా బయటపడుతోందని తెలిపారు. సీబీఐ కోర్టు రోజువారీ విచారణతో జగన్ ఇక నిత్యం కోర్టులోనే అని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేసుల విచారణ పూర్తయ్యేంత వరకూ రాజకీయాలకు దూరంగా ఉండాలని డిమాండ్ చేశారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.43 వేల కోట్ల అక్రమాస్తులు సంపాదించిన కేసులో సీబీఐ కోర్టు రోజువారీ విచారణ జరిపే పరిస్థితి వచ్చిందని సోమిరెడ్డి అన్నారు. కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలకు చెందిన రూ.130 కోట్ల ఆస్తులని ఈడీ అటాచ్ చేసిందని తెలిపారు. చిన్నాయన హత్య కేసులో రూ.40 కోట్ల వ్యవహారంపైనా ఈడీ సీరియస్గా ఉందని... ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ముఖ్యనేతలందరూ ఈడీ విచారణకు హాజరవుతున్నారని చెప్పారు.
రూ.3500 కోట్ల కల్తీ మద్యం కుంభకోణంతో, 30 వేల మందికిపైగా అమాయకుల ప్రాణాలని బలితీసుకున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. సీబీఐ కోర్టులో రోజువారి ట్రైల్ మొదలైతే వందలాది మంది సాక్షులని విచారించాలని.. జగన్ రోజూ కోర్టుకి వెళ్లాలన్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇలాంటి పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి ఉండదేమో అని అన్నారు. ఇలాంటి ఘటనలు, పరిస్థితులని చూసిన తర్వాత రాజకీయాలంటేనే విరక్తి పుట్టే పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారని.. విచారణ పూర్తయ్యేంత వరకు ఎంపీ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాకే తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి..
78వ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్.. ఓవరాల్ టాపర్గా గౌరవ్ ఉప్పల్
పుంగనూరులో వైసీపీ దాడులపై బోండా ఉమ ఫైర్.. మిథున్ రెడ్డి అరెస్ట్కు డిమాండ్
Read Latest AP News And Telugu News