ఆలయాల ఆగమ విధానాల్లో జోక్యం చేసుకోవద్దు.. అధికారులకు మంత్రి ఆనం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Feb 08 , 2026 | 01:32 PM
శైవక్షేత్రాల్లో మూలస్థానేశ్వరస్వామి ఆలయం చాలా ప్రతిష్ట కలిగిన దేవాలయమని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నూతన పాలక మండలి సమష్టి కృషితో పనిచేయాలని సూచించారు.
నెల్లూరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): శైవక్షేత్రాల్లో మూలస్థానేశ్వరస్వామి ఆలయం చాలా ప్రతిష్ట కలిగిన దేవాలయమని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (AP Minister Anam Ramanarayana Reddy) వ్యాఖ్యానించారు. నూతన పాలక మండలి సమష్టి కృషితో పనిచేయాలని సూచించారు. పదవిని బాధ్యతగా భావించి భక్తులకి సేవలు అందించాలని కోరారు. ఆలయ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేయాలని మార్గనిర్దేశం చేశారు. నెల్లూరు జిల్లాలోని మూలపేట శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. స్వామిని దర్శించుకొని మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రుల సమక్షంలో చైర్మన్ పుట్టా అజయ్ కుమార్ రెడ్డి, పది మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు.
ఆలయాల్లో సామాన్య భక్తులకి పెద్దపీట..
ఆలయాల్లో సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలన్నది సీఎం చంద్రబాబు నిర్ణయమని చెప్పుకొచ్చారు. ఆలయాల ఆగమ విధానాల్లో దేవదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు. ఆగమ పండితుల సూచనలు, సలహాలతో అధికారులు ముందుకెళ్లాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
పాలకమండలి మంచి పేరు తెచ్చుకోవాలి: మంత్రి నారాయణ

భక్తులకి సేవలు అందించి పాలకమండలి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి నారాయణ సూచించారు. ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మార్గనిర్దేశం చేశారు. 2018లో ఈ ఆలయ కోనేరు అభివృద్ధికి రూ.6.80 కోట్లు కేటాయించామని ప్రస్తావించారు. మంత్రి ఆనం సహకారంతో నెల్లూరు సిటీలోని అన్ని ఆలయాల అభివృద్ధి జరుగుతుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్‌చల్.. భయాందోళనలో ప్రజలు..
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
Read Latest Telangana News And AP News And Telugu News