Share News

యువత పెద్ద కలలు కనండి.. పట్టుదలతో కృషి చేస్తే ఏ లక్ష్యమైనా సాధ్యం: గవర్నర్ నజీర్

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:26 PM

ప్రస్తుత కాలంలో డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యాసంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించి విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయాలని సూచించారు.

యువత పెద్ద కలలు కనండి.. పట్టుదలతో కృషి చేస్తే ఏ లక్ష్యమైనా సాధ్యం: గవర్నర్ నజీర్
AP Governor Abdul Nazeer

నెల్లూరు, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత కాలంలో డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు (AI) ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazeer) వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యాసంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించి విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలంటే డిజిటల్ విద్యను విస్తృతంగా వినియోగించాలని తెలిపారు. ఈరోజు (మంగళవారం) నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవ సభకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.


ఉన్నత స్థానాలను సాధించాలి..

విశ్వవిద్యాలయం గత పదిహేడేళ్లుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవల ద్వారా విశేష ప్రగతి సాధించిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయం ఇటీవల నాక్ (NAAC) నుంచి 3.23 సీజీపీఏతో ‘A’ గ్రేడ్ సాధించడం గర్వకారణమని ప్రశంసించారు. ఈ విజయంతో జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థానాలను సాధించే సామర్థ్యం విశ్వవిద్యాలయానికి ఉందని తెలిపారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (PM-USHA) కింద రూ.20 కోట్ల నిధులు మంజూరయ్యాయని ప్రస్తావించారు. డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి రూ.4.12 కోట్ల గ్రాంట్ లభించడం విశ్వవిద్యాలయ అభివృద్ధికి కొత్త అవకాశాలను కల్పించిందని వివరించారు.


కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి..

ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ విద్య, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి మరింత ఊతమిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయం చేపడుతున్న జాతీయ సేవా పథకం (NSS) కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, కాలేజ్- టు - విలేజ్, ల్యాబ్ - టు - ల్యాండ్ వంటి కార్యక్రమాలను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. కరుణ, నిజాయితీ, వినయం, పరస్పర గౌరవం వంటి విలువలను జీవితాంతం పాటించాలని సూచించారు.


ప్రపంచానికి మీ అత్యుత్తమ కృషిని అందించాలి..

ఏపీజే అబ్దుల్ కలాం సందేశాన్ని గుర్తుచేస్తూ ప్రపంచానికి మీ అత్యుత్తమ కృషిని అందించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. అప్పుడు ప్రపంచం కూడా మీకు అత్యుత్తమ అవకాశాలు, గుర్తింపు, విజయాలను తిరిగి అందిస్తోందని తెలిపారు. యువత పెద్ద కలలు కనాలని, పట్టుదలతో కృషి చేస్తే ఏ లక్ష్యమైనా సాధించగలరని చెప్పుకొచ్చారు. విద్యే సమాజ మార్పునకు అత్యంత శక్తివంతమైన ఆయుధమని ఉద్ఘాటించారు. విద్యా రంగం, పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించే వర్క్‌షాప్‌లు, సెమినార్లు, సదస్సులు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. తమ జ్ఞానం, నైపుణ్యాలను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించి దేశ అభివృద్ధికి తోడ్పడాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 04:39 PM